Magazines

రైతు సంగ్రామానికి నల్లగొండ నుంచే నాంది

54 నిమిషాల క్రితం

farmers
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 5 నిమిషాల చదవడం

భవిష్యత్తు రైతు ఉద్యమాలకు వేదికగా ఏఐకేఎస్‌ 36వ మహాసభలు
ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహణ

14న వ్యవసాయ పనిముట్లతో 200 స్టాళ్ల ప్రదర్శన..15న లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ

పది వేలమంది యువకులతో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు..ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు

నిధుల సేకరణ కోసం మూడు లక్షల కుటుంబాలను కలిశాం

నవతెలంగాణ ఇంటర్వ్యూలో ఆహ్వాన కమిటీ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి రంగం నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి తరుణంలోనే హక్కుల కోసం దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లాలో తొలిసారి అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను నిర్వహించబోతున్నాం. ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగే మహాసభల్లో భాగంగా నల్లగొండ పట్టణంలో 15న లక్ష మందితో భారీ బహిరంగ సభ తలపెట్టాం. వేలాది మంది యువ రైతులతో రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతును నిర్వహించ బోతున్నాం. రైతాంగ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు ఈ మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి...’ అని ఏఐకేఎస్‌ ‌అఖిల భారత మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. రైతాంగ సమస్యలు, మహాసభల లక్ష్యాలు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌‌కు జూలకంటి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ విశేషాలివి...


ఏఐకేఎస్‌ 36వ జాతీయ మహాసభలను నల్లగొండలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఏమిటి?

‘నల్లగొండ అంటేనే పోరాటాల చరిత్ర. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఇది పురిటిగడ్డ. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఈ గడ్డది. వెట్టిచాకిరీ నిర్మూలన, దున్నేవాడికే భూమి అనే నినాదాలకు ఈ పోరాటమే పునాది. అలాంటి చారిత్రక ప్రాంతంలో మహాసభలు నిర్వహించాలని ఏఐకేఎస్‌ ‌కేంద్ర కమిటీ నిర్ణయించింది. నల్లగొండ చరిత్రలో ఇది తొలి జాతీయ మహాసభ కావడం విశేషం...’

​​ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న 
సవాళ్ల గురించి చెప్తారా?

‘దేశంలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కోట్లాది కుటుంబాలు నేడు ఇబ్బందులు పడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుల భారం పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామా లను వదిలి పట్టణాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యవసాయం లాభసాటిగా మారితేనే రైతు కుటుంబాలు బాగుంటాయి. రైతులు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలుతోపాటు రైతులకు అండగా నిలిచే విధానాలు అవసరం...’

​​రైతు వ్యతిరేక చట్టాలపై గతంలో జరిగిన ఉద్యమం ఎలాంటి సందేశాన్నిచ్చింది?

‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం చారిత్రక పోరాటం నిర్వహించింది. ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి సాగిన ఉద్యమంలో సుమారు 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రైతుల ఐక్యత ముందు ఎలాంటి నిర్ణయమైనా పునరాలోచించక తప్పదని ఆ ఉద్యమం నిరూపించింది. ఇప్పుడు కూడా ఆ చట్టాలను పరోక్షంగా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో మరో పోరాటం మొదలైంది. ఇప్పుడిప్పుడే అది దేశమంతటా విస్తరిస్తున్నది...’

​మహాసభలపై రైతులు ఎలా స్పందిస్తున్నారు?

‘ఈ మహాసభలను రైతుల భాగస్వామ్యంతోనే నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటివరకు సుమారు మూడు లక్షల రైతు కుటుంబాలను కలిశాం. ఒక్క నల్లగొండ జిల్లాలోనే లక్ష కుటుంబాలను నేరుగా కలిసి మహాసభల ఆవశ్యకతను వివరించాం. రైతులు తమకు తోచిన విధంగా రూ.10 నుంచి రూ.వెయ్యి వరకు విరాళాలు అందిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ అన్నదాతలు మహాసభలకు సహకరిస్తున్నారు. రైతులే దీన్ని తమ సభగా భావించి అండగా నిలవటం హర్షణీయం...’

మహాసభల నిర్వహణ, 
ఏర్పాట్ల గురించి వివరిస్తారా?

‘మహాసభలను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 15న నల్లగొండలోని ఎన్‌‌జీ కళాశాల ప్రాంగణంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. పట్టణంలో అదే రోజు 10 వేల మంది యువ రైతులతో రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 200 కోలాట బృందాల ఆటలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు, కోయ నృత్యాలు, 36 ఎడ్లబండ్ల ప్రభలు రైతాంగ సంస్కృతిని చాటనున్నాయి. 14న 200 స్టాళ్లతో వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాం. 16, 17, 18 తేదీల్లో ప్రతినిధుల సభలు నిర్వహిస్తాం...’

​ప్రధానంగా ఏయే అంశాలపై 
తీర్మానాలు చేయబోతున్నారు?

‘రైతులు ఎదుర్కొంటున్న అన్ని ప్రధాన సమస్యలపై చర్చిస్తాం. పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతులకు రుణభారం తగ్గింపు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, నీటి వనరుల వినియోగం, పంటల కొనుగోళ్లు, వ్యవసాయ కార్మికుల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతు ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకుంటారు. భవిష్యత్‌ రైతాంగ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తాం...’

​దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు కొంత వెనకపట్టు పట్టినట్టున్నాయి కదా?

‘అలాంటిదేమీ లేదు. రైతాంగ సమస్యలు ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. వారం రోజుల కిందటే మహారాష్ట్రలో 50 వేల మంది రైతులు అంకోలా నుంచి 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పంజాబ్‌, హర్యానా రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆదివాసీ, గిరిజన రైతుల ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ పోరాటాలన్నింటికీ నల్లగొండ మహాసభలు ఒక ఉమ్మడి వేదికగా నిలుస్తాయి. భవిష్యత్తులో రైతాంగ పోరాటాలకు కొత్త స్ఫూర్తినిస్తాయి...’

వ్యవసాయానికి విద్యుత్‌ ‌విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై భారాలు మోపే అవకాశాలున్నాయి కదా?

‘వ్యవసాయానికి విద్యుత్‌ రాయితీలు కొనసాగాలి. అలాగైతేనే రైతు బతుకగలుగుతాడు. విద్యుత్‌ భారాన్ని రైతులపై మోపితే వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. తెలంగాణలో అన్నదాతలపై భారాన్ని మోపే రైతు డిస్కమ్‌‌ను అంగీకరించం. గతంలో బషీర్‌బాగ్‌ ఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో పాలకులు గుర్తుకు తెచ్చుకోవాలి. విద్యుత్‌ విషయంలో రైతుల ప్రయోజనాలనే ప్రాధాన్యంగా తీసుకోవాలి.

ఈ సందర్భంగా నల్లగొండ ప్రజలకు, 
రైతాంగానికి మీరిచ్చే పిలుపు...

‘ఏఐకేఎస్‌ ఏర్పడి 90 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 36వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ రైతు, వ్యవసాయ కార్మికుడు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ మహాసభల్లో భాగస్వాములు కావాలి. ఇప్పటికే 28 కమిటీలు, 500 మంది కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వందమంది మహిళా కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. మూడు జాతాలు దేశవ్యాప్తంగా పర్యటించి మహాసభలకు ప్రజలను ఆహ్వానిస్తున్నాయి. ఊరికో బస్సు.. ఇంటికో మనిషి కదలాలి. రైతుల హక్కుల కోసం జరిగే ఈ మహాసభలను అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలి...’


​​ఈ మహాసభల ద్వారా దేశ రైతాంగానికి 
ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు?

రైతు ఐక్యతే రైతాంగ హక్కులకు రక్షణ. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు పోరాటాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ మహాసభలు కేవలం సమావేశాలుగా మిగిలిపోవు. భవిష్యత్తు రైతాంగ ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తాయి. మరో రైతు సంగ్రామానికి నల్లగొండ వేదిక కావాలి. రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలు నిర్మించడమే మా సంకల్పం.’


​మోడీ పాలనలో రైతులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయంటున్నారు.. ఎలా...?

‘మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ భూములు కార్పొరేట్లు, రియల్టర్ల పరం అవుతున్నాయి. కార్పొరేట్ల ఆస్తులు లక్షల కోట్లకు పెరుగుతున్నాయి. రైతులు, ప్రజలు అప్పులపాలై కూలీలుగా మారుతున్నారు. మోడీ వచ్చాక 200 లక్షల కోట్ల అప్పు చేశారు. పన్నులమీద పన్నులు వేస్తూ పోతున్నారు. ప్రజలకిచ్చే రాయితీలు తగ్గించి కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను పెంచుతున్నారు. ఈ కారణాల వల్ల ప్రజల ఆదాయాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. సామాన్యులు తమకు వచ్చే అరకొరా ఆదాయాన్ని విద్య, వైద్యం మీద ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. అందరికంటే ఎక్కువగా పనిచేసే రైతులు, కార్మికులు కష్టాలపాలవుతున్నారు...’


​​బియ్యం ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో రైతులకు ధాన్యం ధర విషయంలో 
 ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి కారణమేంటి?

‘ధాన్యం కోతకు రాకముందే బియ్యం ధరలు పెరగడం ఆందోళనకరం. బియ్యం నిల్వలు, సరఫరాపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేయాలి. ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. వ్యాపారులు, దళారులు తమ ఇష్టానుసారం ధరలు నిర్ణయించే పరిస్థితి ఉండకూడదు. వినియోగదారులకు సరసమైన ధరకు బియ్యం అందించడంతోపాటు రైతులకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి.’


​ రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
‘ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు ప్రణాళికను రూపొందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోవాలి. తాగునీటి ఎద్దడిని నివారించాలి. పంట నష్టాలను అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలి. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అఖిలపక్షంతో కలిసి కేంద్రం నుంచి నిధులు సాధించాలి. రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించి ముందుకు నడవాలి.’




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్