Magazines

కాంగ్రెస్‌‌ను గద్దెదించాలి.. బీజేపీని గెలిపించాలి

1 గంట క్రితం

Oust the Congress... ensure the BJP wins.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షా పిలుపు

రెండు చోట్ల ఓట్లు ఉంటే తీసేయాలా? వద్దా?

విపక్షాలు చెప్పాలంటూ డిమాండ్‌

ఓట్ల రద్దుపై కాంగ్రెస్‌ది ‌దుష్ప్రచారమంటూ విమర్శ

మాక్‌ ‌పార్లమెంటులో మాత్రమే

రాహుల్‌ ‌ప్రధాని అవుతారంటూ ఎద్దేవా

బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న షా

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

‌తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్‌‌ పార్టీని గద్దెదించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఆ పార్టీ ఆధ్వర్యాన సోమవారం హైదరాబాద్‌‌ బషీర్‌‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌‌రామ్‌ ‌విగ్రహం నుంచి మొజంజాహీ మార్కెట్‌ ‌వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ ‌షా అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ... సర్దార్ వల్లాభాయ్‌‌పటేల్‌ లేకుంటే హైదరాబాద్ సంస్థానం విముక్తి అయ్యేదే కా‌దని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించింది ఓటు బచావో ర్యాలీ కాదు.. చొరబాటుదారులను కాపాడే ర్యాలీ...’ అని ఎద్దేవా చేశారు. దేశంలో 13 కోట్ల ఓట్లు రద్దయ్యాయంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. అందులో ఆరున్నర కోట్ల ఓట్లు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారివేనని స్పష్టం చేశారు. తొలగించిన వాటిలో చనిపోయినవారి ఓట్లు మూడు కోట్లు ఉన్నాయని తెలిపారు. మరణించిన వారి ఓట్లను తొలగించాలా? వద్దా? చెప్పాలంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఎంత ప్రయత్నించినా చొరబాటుదారులకు ఓటు దక్కనివ్వబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలకే పాల్పడుతుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నకిలీ ఓట్లను తొలగిస్తుంటే, రాహుల్‌‌కు ఎందుకు కడుపుమంట? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ఇండియా బ్లాక్‌‌లు కలిసి సర్‌‌ను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ఆయా శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. చొరబాటుదారులకు రాహుల్ ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి ఓట్లు తొలగించాలా? వద్దా..? భారత్‌‌లో చొరబడిన 3 కోట్ల మంది ఓట్లు తొలగించవద్దా? అని నిలదీశారు. సర్‌ రాకముందే ‌తాము కేంద్రంలో వరుసగా మూడు సార్లు గెలిచామని గుర్తు చేశారు. 2014లో మోడీ గెలిచారు... అప్పుడు సర్‌ ఉందా? ఆ ప్రక్రియ జరక్కముందే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్, బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. ప్రజల ఆదరణతో మోడీ గెలిచారని, భవిష్యత్తులో తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్‌ ఎన్నటికీ ప్రధాని కాలేరు...

దేశానికి రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని కాలేరంటూ అమిత్‌ ‌షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మాక్ పార్లమెంట్‌‌లో మాత్రమే ఆయన ప్రధాని అవుతారంటూ ఎద్దేవా చేశారు. గెలిస్తే ప్రజలు గెలిపించారని, ఓడితే ఈవీఎంలపై నెపం వేయడం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఆ పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్‌‌పై ఉందన్నారు. సర్‌, ఈవీఎంలపై చర్చకు ‌బీజేపీ సిద్ధమన్నారు. మరి కాంగ్రెస్‌ ‌సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈవీఎంల ద్వారా బీజేపీ గెలిస్తే, మరి తెలంగాణలో కాంగ్రెస్‌ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. కేరళ, తమిళనాడులో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయని నిలదీశారు. కాంగ్రెస్‌ పాలనలో కేవలం పదేండ్లలోనే రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాహుల్‌, రేవంత్‌ (ఆర్ఆర్) ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవినీతిని ఓవైసీ ఆపుతారా? బీఆర్‌ఎస్‌ ఆపుతుందా? అని ప్రశ్నించారు. అది కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. అంతకు ముందు అమిత్‌ ‌షా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర వద్దకు చేరుకున్నారు. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ ‌రాంచందర్‌‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వశ్వేరరెడ్డి, రఘునందన్‌‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

​

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్