పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న పాలకులు : డాక్టర్ నందిని సిద్ధారెడ్డి
నల్లగొండలో రైతు జనకవనం..కవి గాయక సమ్మేళనం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. పాలకుల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా రచనలు చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభను నల్లగొండలో నిర్వహించనున్న నేపథ్యంలో రైతాంగానికి సంఘీభావంగా బుధవారం టీఎన్జీఓ భవన్లో తెలంగాణ సాహితీ, ప్రజానాట్యమండలి, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు జనకవనం, కవి గాయక సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు.
రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వాలు రైతాంగానికి ద్రోహం చేశాయని విమర్శించారు. తెలంగాణలో నాటి భూస్వాముల స్థానంలో నేడు పెట్టుబడిదారులు వచ్చి భూములను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని చెప్పారు. భూమిని అమ్ముకొని అన్నం తినాల్సిన దుస్థితి నేటి రైతులకు ఏర్పడిందన్నారు. రైతులను భూమికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పంటలను కొనుగోలు చేసే సామర్థ్యం కూడా ప్రభుత్వాలకు లేకపోవడం వల్ల పేద రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ క్రమంలో కవులు అట్టడుగు వర్గాల పక్షాన నిలిచి, రైతుల సమస్యలను ప్రతిబింబించే రచనలు చేయాలని పిలుపునిచ్చారు.
భూసంస్కరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : డాక్టర్ ఎన్. ఏనుగు నరసింహారెడ్డి
భూ కేంద్రీకరణ జరగకుండా భూ సంస్కరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే అందరికీ భూమి లభించే అవకాశం ఉంటుందని ప్రముఖ కవి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. కవులకు, రైతులకు మధ్య ఉన్న సంబంధం, రైతులకు భూమికి ఉన్న సంబంధం ఒకటేనని చెప్పారు. పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచిన నల్లగొండలో అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభ నిర్వహించడం ప్రత్యేకతతో కూడుకున్నదని, అభినందనీయమని తెలిపారు. కవులు అట్టడుగు వర్గాల పక్షాన నిలబడి రచనలు చేసినప్పుడే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయించుకునేందుకు రైతులు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మునాసు వెంకట్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ పగడాల నాగేందర్, వురిమల్ల సునంద, కాక మంజన్న, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కట్ట నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ఆనంద్, ప్రముఖ బాల సాహిత్యవేత్త పుప్పాల కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సలీమ, తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హా సేనా తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)