అఖిలభారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి :
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
కొమురవెల్లిలో ట్రాక్టర్ల ర్యాలీ
నవతెలంగాణ-కొమురవెల్లి
భారత రైతాంగం ఉద్యమించి హక్కులను కాపాడు కోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. నల్లగొండలో జరిగే కిసాన్ సభ 36వ జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేయడానికి మద్దతుగా మంగళవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై.. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డితో కలిసి మాట్లాడుతూ.. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నల్లగొండ పట్టణంలో ఈనెల 15 నుంచి 18 వరకు జరుగుతాయన్నారు. దీనికి దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాడుతున్న 1500 మందికి పైగా ప్రతినిధులు లక్షలాదిమంది రైతులు హాజరవుతారన్నారు. మొదటిరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సభకు అఖిలభారత నాయకులు కామ్రేడ్ బృందాకరత్ హాజరవుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం 32 దేశాల వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలోకి దిగుమతికి అనుమతించడంతో మన దేశ రైతాంగం భారీగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరిట మోడీ ప్రభుత్వం పూర్తిగా అమెరికాకు లొంగిపోయిందని, ఇప్పటికే అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ దేశాలతోటి ఈ ఒప్పందాలు చేసుకుందన్నారు. వీటితో మన దేశ పాడి, పౌల్ట్రీ పరిశ్రమకు పెను ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లు 2025, విత్తన చట్టం సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారని, ఈ రెండు చట్టాలు అమలు అయితే భారతదేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా ప్రైయివేట్ రంగం చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు వ్యవసాయంలో కార్పొరేట్ రంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మన రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ అఖిల భారత రైతు సంఘం మహాసభలలో పై సమస్యలపై చర్చించి తీర్మానాలు చేసి భారత రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు మహాసభలు దోహదపడతాయన్నారు ఈ మహాసభలను విజయవంతం చేయడానికి ఈనెల 15 న రైతాంగం పెద్ద ఎత్తున నల్లగొండకు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలొ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నక్కల లావణ్య, జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాడూరి రవీందర్, రాళ్ల బండి శశిధర్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అత్తిని శారద, రైతు సంఘం జిల్లా నాయకులు బద్దిపడగ కృష్ణారెడ్డి, రవికుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్, చనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, కేవీపీఎస్ నాయకులు బక్కిలి బాలకిషన్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆముదాల రంజిత్ రెడ్డి, నాయకులు అభిషేక్, బాను, నీల బిక్షపతి, మల్లం అంజయ్య, బోడిగం సురేందర్ రెడ్డి, తాడూరు మల్లేశం, దాసరి మహేష్, నరసవ్వ, పాకినాటి బాలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)