రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకోసం ఎదురుచూపులు
ఇండ్లు మంజూరైనా అందని ప్రొసీడింగ్స్
మార్కౌట్ కోసం ఇండ్లు కూలగొట్టుకున్న వైనం
పనులు ప్రారంభించేందుకు చొరవచూపాలంటున్న లబ్దిదారులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పక్క చిత్రంలో మహిళ పేరు ఇందిర. నవీపేట్‌లో నివసిస్తున్నారు. కూలే దశలో ఉన్న పెంకుటిల్లులో నివసిస్తుండగా.. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. తొలి విడుత లిస్టులో పేరు రాలేదు. రెండో విడుతలో మంజూరైనట్టు చెప్పి ముగ్గుపోసేందుకు సిద్ధం చేసి పెట్టాలని చెప్పడంతో ఉన్న ఇల్లు కూలగొట్టింది. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ముగ్గుపోసే వారు లేకుండా పోయారు. ఇంటి స్థలంలో పిచ్చిమొక్కలు మొలుస్తుండగా.. ఆమె నెలకు రూ.3000 వెచ్చిస్తూ కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు ఆడపిల్లల పెండ్లిల్లు చేసి అత్తారింటికి పంపగా.. భర్త చనిపోవడంతో ఒక్కరే ఉంటున్నారు. తలదాచుకునేందుకు నీడ కరువైందని వాపోతున్నారు. వెంటనే రెండో విడుత ఇండ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు. ఒక్క ఇందిరనే కాదు.. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడుత కోసం వేలాది మంది లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి తొలివిడుతలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల మంజూరై, లబ్దిదారుల ఎంపిక పూర్తి చేశారు. స్ర్కూట్నీ అనంతరం ఆరు నియోజకవర్గాలకు (బాన్సువాడకు 1990 ఇండ్లు) కలిపి 17,734 ఇండ్లు మంజూరు కాగా 14,957 ఇండ్లకు మార్కౌట్ చేశారు. వాటిల్లో 6368 ఇండ్ల నిర్మాణాలు పూర్తవ్వగా, బేస్‌మెంట్ స్థాయిలో 1602, రూఫ్ లెవల్ స్థాయిలో 748, స్లాబ్ వరకు వచ్చినవి ఇండ్లు 4346 ఉన్నాయి. ఇంకా పనులు ప్రారంభం కాని ఇండ్లు 1893 ఉండగా, ఇటీవల పనులు ప్రారంభించుకున్న వారు 1893 మంది లబ్దిదారులున్నారు. వీటితో పాటు రెండో విడుత ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి పనులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఐదు నెలలుగా తప్పని ఎదురుచూపులు
రెండో విడుతలో నియోజకవర్గానికి 1500 చొప్పున ఇండ్లను మంజూరు చేశారు. వీటితో పాటు గత కాంగ్రెస్ హయాంలో ఇండ్లు మంజూరై పనులు అసంపూర్తిగా నిలిచిపోయిన లబ్దిదారులకు మరో అవకాశంగా అదనంగా 500 చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు మంజూరయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని నిజామాబాద్ జిల్లా మండలాలతో పాటు 5 నియోజకవర్గాలకు కలిపి 8400 ఇండ్లకు సాంక్షన్ ఇచ్చారు. లబ్దిదారుల ఎంపిక సైతం పూర్తవ్వగా వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వక, పనులు ప్రారంభించలేక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు కూలగొట్టుకున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇల్లు మంజూరైందని సంబురపడ్డామని, మార్కౌట్ చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పడంతో అప్పటి వరకు తలదాచుకుంటున్న ఇండ్లను కూలగొట్టుకున్నామని వాపోతున్నారు. ‘‘వర్షాలు పడుతున్న సమయంలో కూలగొట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నాం. ఇండ్ల గురించి అడిగితే ఇగ వస్తది.. అగ వస్తది అంటున్నారు. ఊర్లో కిరాయికి ఇండ్లు సైతం దొరకడంలేదు. వృద్ధులు ఉంటే ఇండ్లు కిరాయికి సైతం ఇస్తలేరు. కంపల్సరీ ఇల్లు కట్టిస్తమంటేనే కూల్చుకున్నాం. నెలలు గడిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మా పరిస్థితి ఎటు పాలుపోని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం మీదే ఆశతో ఉంటున్నాం. వెంటనే పనులు ప్రారంభించి తమకు గూడు కల్పించాలి’’ అని లబ్దిదారులు కోరుతున్నారు. ‘80 ఏండ్ల పాత ఇల్లు మాది. లోపల కొంత కూలిపోయింది. రేకుల ఆధారంతో తలదాచుకుంటున్నాం. ఇల్లు మంజూరైంది పాత ఇల్లు కూలగొట్టుకోవాలని చెప్తే కూలగొట్టుకున్నాం. అప్పటి నుంచి మళ్లీ ఎవరూ రాలేదు. లీడర్‌లను వెళ్లి అడిగితే వచ్చేస్తయ్ అంటున్నారు. పెంకుటిల్లు కూలిన.. రేకుల ఆధారంతో ఎల్లదీసుకున్నం. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది. బయట కిరాయి తీసుకుని ఉంటున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. వెంటనే పనులు ప్రారంభించాలని’ పేరు చెప్పేందుకు ఇష్టపడని బాల్కొండకు చెందిన మరో లబ్దిదారుడు వాపోతున్నాడు.






కామెంట్‌లు (0)