రూ.50 వేల కోట్ల ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై అఖిలపక్షం ద్వారా ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పంట నష్టాలను అంచనా వేసి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50వేలు, ఇతర పంటలకు రు.30వేలు రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి జాన్‌వెస్లీ బహిరంగ లేఖ రాశారు. 365 మండలాల్లోనే కాదు మిగతా మండలాల్లోనూ, పట్టణాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయా యని గుర్తుచేశారు. మరోపక్క భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు, తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఏర్పడి ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. బియ్యం ధరలు కేజీ రూ.100కి చేరడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటుండటంతో సామాన్య ప్రజానీ కంపై తీవ్రభారం పడుతున్నదని పేర్కొన్నారు. తాగునీటి కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం క్షీణించి అంటురోగాలు, వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందనీ, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు నివారణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని కోరారు. రూ. 2 లక్షల లోపు పంట రుణాలు, అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలనీ, డ్వాక్రా రుణాలపై ఏడాది పాటు వడ్డీ రహిత మారటోరియం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పంటలు వేయని స్థితిలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీంను వర్తింపజేయాలనీ, ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసాను రెట్టింపు చేసి ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులను కూడా రెట్టింపు చేసి ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యంతో పాటు కరువు ఉపశమన కిట్ ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి వారికి కూడా రేషన్‌షాపుల ద్వారా సబ్సిడీ ధరలకు నిత్యావసరాలు అందించాలని కోరారు. గ్రామ పంచాయతీల పరిధిలో పేదలు, వృద్ధుల కోసం ప్రభుత్వం ఉచిత రాగి జావ, మజ్జిగ ఇచ్చే ‘భోజన కేంద్రాలు’ ప్రారంభించాలని సూచించారు.
ఏయే ప్రాంతాల్లో ఏయే ఆరుతడి పంటలను సాగుచేయాలనే దానిపై నిర్దిష్ట మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. ఆరుతడి పంటలు వేసే రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలకు మద్దతు ధరలు దక్కేలా, మార్కెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వలసల నివారణకు ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలనీ, రోజు కూలి రూ.800కు పెంచాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. గ్రామాల్లోని నీటి వనరులను పునరుద్ధరించాలనీ, అవసరమైతే ప్రయివేటు వ్యవసాయ బోరుబావులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వారికి పరిహారం చెల్లించి ప్రజలకు ఉచితంగా సురక్షిత నీటిని అందించాలని సూచించారు. పశువులు, గొర్రెలు, మేకలు, తదితర జంతువుల దాహార్తిని తీర్చడానికి తాగునీటి తొట్లు, ఉచిత పశుగ్రాస కేంద్రాలు నిర్వహించాలనీ, పాల సేకరణ ధరలు పెంచాలని కోరారు.
సెలవు రోజుల్లో కూడా గ్రామ, బస్తీ బడుల్లో మధ్యాహ్న భోజనం (పాలు, గుడ్లు, రాగి జావతో) అందించాలనీ, ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థుల సర్టిఫికేట్లు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పేద విద్యార్థుల అన్ని రకాల ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సీఎస్ఆర్ నిధులతో యువతకు ఉపాధి కల్పన, వృత్తినైపుణ్య శిక్షణలు ఇవ్వాలని సూచించారు. కార్మికులందరికీ వేతనంతో పాటు ‘ఎల్ నినో భృతి’గా 50 శాతం అదనంగా చెల్లించాలనీ, అన్నిరకాల కార్మికులకు కనీస వేతనాలు ప్రతి నెలా మొదటి వారంలోనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర కాలంలో గిరిజన పోడు రైతులను, ఆదివాసీలను వేధించే దాడులను అటవీఅధికారులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో గ్రామపర్యవేక్షణ కమిటీలు వేయాలని సూచించారు. పార్లమెంట్ సభ్యులు తమ ఎంపీల్యాడ్స్ నిధులను ఈ కరువు ప్రాంతాలకు కేటాయించాలనీ, కరువు తీవ్రతను కేంద్రానికి వివరించి అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టడానికి కృషి చేయాలని కోరారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో అనవసరపు, ఆడంబర ప్రభుత్వ ఖర్చులను తక్షణమే నిలిపివేసి పొదుపు చర్యలు పాటించాలనీ, ఆ నిధుల్ని కరువు బాధితుల ఉపశమనానికి మళ్లించాలని సూచించారు.






కామెంట్లు (0)