నవతెలంగాణ – హైదరాబాద్ : పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు చక్కెర ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా ధరలు భగ్గుమంటున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో రా షుగర్ ఫ్యూచర్స్ 14 నెలల గరిష్ఠ స్థాయికి చేరగా, భారత్‌లోని స్థానిక మార్కెట్లలో ధరలు రికార్డు స్థాయిలో పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూయార్క్ మార్కెట్‌లో రా షుగర్ ఫ్యూచర్స్ ధర 4.3 శాతం పెరిగి పౌండ్‌కు 17.59 సెంట్లకు చేరింది. ఒక్క ఆగస్టు నెలలోనే అంతర్జాతీయంగా ధరలు 18 శాతం మేర పెరిగాయి. ఇక భారత్‌లో, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హోల్‌సేల్ చక్కెర ధర క్వింటాల్‌కు రూ.5,350కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో రూ.5,400, ఢిల్లీలో రూ.5,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
ముంబై రిటైల్ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.59కి అమ్ముడవుతోంది. గత నెలతో పోలిస్తే కిలోకు రూ.10 వరకు పెరుగుదల కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత ఏర్పడటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. బ్రెజిల్‌లో చెరకును అధికంగా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం, ఎల్ నినో ప్రభావంతో పంట దిగుబడి తగ్గడం, భారత్‌లోనూ ఉత్పత్తి అంచనాల కన్నా తక్కువగా నమోదవడం వంటివి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరగనుండటం కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.



