బిల్లును ప్రతిపాదించిన అమెరికా సెనెటర్ ట్రంప్ సర్కారుకు షాక్
హెచ్-1బీ వీసా రుసుము రద్దుపై స్టేకు అప్పీల్స్ కోర్టు నిరాకరణ
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్ సెనెటర్ టిమ్ షీహీ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతి హెచ్-1బీ వీసా పిటిషన్‌పై విధించే లక్ష డాలర్ల రుసుమును తిరిగి ప్రవేశపెట్టాలని కూడా అందులో కోరారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ రుసుమును ఫెడరల్ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల నియామకం కోసం అమెరికా కంపెనీలు ఈ వీసా కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు. తాజా ప్రతిపాదన ఈ కార్యక్రమంలో భారీ మార్పులను కోరుతోంది. అమెరికా కార్మికుల హక్కులను సులభంగా ఉల్లంఘిస్తున్న ఈ వీసాలను జారీ చేయకూడదని సెనెటర్ టిమ్ షీహీ చెప్పారు. హెచ్-1బీ వీసా కార్యక్రమం ప్రత్యేకమైన, భర్తీ చేయడం కష్టమైన ఉద్యోగాలలో కార్మికుల కొరతను తీర్చడానికి ఉద్దేశించిందని, అంతేకానీ అర్హత కలిగిన, కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో చౌకగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఉపయోగపడేది కాదని టిమ్ అన్నారు. తాను ప్రతిపాదించిన బిల్లు ఉద్యోగుల రక్షణ చర్యలను బలోపేతం చేస్తుందని, జాతీయ భద్రతా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ కార్మికులకు మేలు చేస్తుందని తెలిపారు. అమెరికా ఉద్యోగులకు ఎదురయ్యే ముప్పును నివారించడంలో తాను ప్రతిపాదించిన బిల్లు కీలకమైన, ముందు చూపుతో కూడిన చర్య అనిటిమ్ షీహీ చెప్పారు.
ట్రంప్ సర్కారుకు షాక్
హెచ్-1బీ వీసా రుసుము రద్దుపై స్టేకు
అప్పీల్స్ కోర్టు నిరాకరణ
అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల కోసం జారీ చేసే కొత్త హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుమును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. స్టే కోసం ట్రంప్ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనను బోస్టన్‌లోని ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన రుసుముకు కాంగ్రెస్ అనుమతి లేదని, అది చట్టవిరుద్ధమైన ఫీజు అని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో టి.సోరోకిన్ గత నెల 8న తీర్పు ఇచ్చారు. దీనిపై స్టే కోరుతూ ప్రభుత్వం అప్పీలు చేసింది. ‘ఇక్కడ ప్రశ్న రుసుమును విధించే అధికారాన్ని ప్రభుత్వానికి కాంగ్రెస్ అప్పగించవచ్చా లేదా అన్నది కాదు. అసలు కాంగ్రెస్ ఆ పని చేసిందా లేదా అన్నదే ప్రశ్న’ అని డెమొక్రాట్ల పాలనలోని 20 రాష్ట్రాల న్యాయవాదులు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.
హెచ్-1బీ వీసా అంటే…
కొత్తగా హెచ్-1బీ వీసా పొందాలంటే లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిందేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం సెప్టెంబరులో ఓ ఆదేశాన్ని జారీ చేశారు. నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి దేశీయ కంపెనీలను అనుమతించేదే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అయిన హెచ్-1బీ. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి ఏటా పది వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ వీసా కార్యక్రమం ఉపయోగపడుతోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా అరవై ఐదు వేల హెచ్-1బీ వీసాలతో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన విదేశీ కార్మికుల కోసం మరో ఇరవై వేల వీసాలను మంజూరు చేస్తోంది. ఈ వీసాలకు సాధారణంగా రెండు వేల నుంచి ఐదు వేల డాలర్ల వరకూ ఫీజు ఉంటుంది.
కోర్టు ఏం చెప్పింది?
1989వ సంవత్సరపు అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అప్పీల్స్ కోర్టు తన ఉత్తర్వులలో ప్రస్తావించింది. ఆర్థిక భారాన్ని మోపాలంటే ప్రభుత్వం విధిగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని ఆ తీర్పు స్పష్టం చేసిందని, అయితే ఈ కేసులో ఆ అనుమతి ఎందుకు అవసరం లేదో ట్రంప్ ప్రభుత్వం వివరించలేదని తెలిపింది. స్టే విధించినంత మాత్రాన పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్రాలకు గణనీయమైన నష్టమేమీ జరగబోదని నిరూపించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం… తుది తీర్పు వచ్చే వరకూ లక్ష డాలర్ల రుసుముకు వ్యతిరేకంగా దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలే అమలులో ఉంటాయి.



