- ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో సీపీఐ(ఎం) నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, సర్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ(ఎం) అఖిలభారత, తెలంగాణ రాష్ట్రంతో పాటు, వివిధ రాష్ట్రాల నాయకులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ అక్రమ అరెస్టులు, కేంద్ర ప్రభుత్వ నిర్బంధ వైఖరిని నిరసిస్తూ, శనివారం హైదరాబాద్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ నిరసన చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ.. సీపీఎం జాతీయ పార్టీ ఆఫీసులైన సూర్జిత్ భవన్, ఏకేజీ భవన్‌లపై దాడి చేసి నాయకులను, కార్యకర్తలను నిర్బంధించడం అత్యంత దుర్మార్గమైన చర్య. దీనిని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు ప్రధాని మోడీకి ఒక ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే సూత్రాన్ని విస్మరించి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే నెపంతో ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ఓట్లను ఏరికోరి దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను రద్దు చేశారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైన రాజ్యాంగ ఉల్లంఘన. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ యంత్రంలోని వివిధ డిపార్ట్‌మెంట్‌లను, స్వతంత్ర సంస్థలను తన ఏజెంట్లుగా మార్చుకుని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో నింపివేస్తోంది. ఈ దుర్మార్గపు చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.
ప్రజల, ప్రతిపక్షాల, యువత ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలి. లేకపోతే ఇది కేవలం సీఈసీ రాజీనామాతో ఆగదు, నరేంద్ర మోడీయే రాజీనామా చేయాలని కోరుతూ కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చే సమయం ఆసన్న మౌతుంది. తక్షణమే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి, SIR ప్రక్రియను రద్దు చేయాలి, రద్దు చేసిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలి. లేనిపక్షంలో సీపీఐ(ఎం), ప్రతిపక్ష పార్టీలు, యువత, విద్యార్థులతో కలిసి దేశవ్యాప్తంగా భారీ పోరాటాలు నిర్వహించి ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు MD అబ్బాస్, టి సాగర్ ప్రసంగించారు.
ఢిల్లీలో శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీతో సహా పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు, ఆర్. అరుణకుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా, సీపీఐ(ఎం)కేంద్ర కార్యాలయాలైన సూర్జిత్ భవన్, ఏకేజీ భవన్‌లపై పోలీసులు దాడి చేసి, పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.






కామెంట్‌లు (0)