అది కైలాసం! శివ పార్వతులు ఇద్దరూ మంచుదిమ్మెలపై కూర్చుని ఎదురు చూస్తున్నారు!
చాలా సేపైంది. కాని ఫలితం లేదు! ఎవరూ కనపడటం లేదు!
‘‘స్వామీ ఏమైంది! మన గణేషుడు ఇంకారాలేదు!’’ పార్వతి అడిగింది.
కొడుకు కోసం తల్లి గుండెకు ఉండే ఆరాటం అది!
‘‘దేవీ ఆందోళన చెందకు! మన పుత్రుడు విఘ్న నాయకుడు! ఎన్ని విఘ్నాలైనా అధిగమిస్తాడు!
ఈ మధ్య భక్తి బాగా పెరిగింది! అంత సులభంగా మన గణేషుడిని భక్తులు సాగనంపలేక పోతున్నారు!
అందుకే ఆలస్యం రుగుతుండవచ్చును!’’ అనునయించాడు శివుడు.
అయినా సరే..పార్వతి తల్లి మనసు కొడుకు కోసం ఆందోళన పడుతునే ఉన్నది, ఎదురు చూస్తూనే ఉన్నది.
ఇంతలో వారి ముందుకు ఒక విచిత్రమైన ఆకారం వచ్చింది! ఆ ఆకారం వంటిపై బురద! మురుగు కాలవల వాసన వస్తోంది! అక్కడి వారంతా ముక్కు మూసుకున్నారు! ఆ ఆకారం ఒక్కోఅడుగు వేస్తున్న కొద్దీ బురద అక్కడ పడుతూనే ఉంది! ఆ ఆకారం పార్వతివైపు వెళ్తోంది!
నందీశ్వరుడికి అనుమానం వచ్చింది! ఎవరో బురద రాక్షసుడు వరాలు పొంParvenus turned devotees!ది పార్వతిదేవిపైకి యుద్ధానికి వచ్చారని భావించాడు! ‘‘వెంటనే ఈ బురద రాక్షసుడిని బంధించండి!’’ అంటూ ప్రమథ గణాలను ఆదేశించాడు! ప్రమధ గణాలు ముందుకు కదిలాయి! కాని ఆయుధాలను ప్రయోగించేలోపు, అవి అన్నీ ఆ ఆకారం ముందు కుప్పలా పడి పోయాయి! ప్రమధ గణాలకు దిక్కు తోచలేదు! బురదరాక్షసుడు అసాధారణ వరాలు పొందినట్లున్నాడు! అనుకున్నారు! అంతా శివుడి వైపు చూశారు!
శివుడు చిరునవ్వుతో తన ఝటఝటాన్ని మెల్లగా కదిలించాడు! దాంతో శివుడి ఝటాఝూటంలో గంగమ్మ, మెల్లిగా ఆ ఆకారంపైకి ప్రవహించింది! అపుడు ఆ ఆకారం పైనున్న బురద, మట్టి అంతా కొట్టుకుని పోయింది! ఇప్పుడు ఆ ఆకారాన్ని వినాయకుడిగా అందరూ గుర్తించారు! కాని గణేషుడి వంటిపై గాయాలున్నట్లు పార్వతీదేవికి కనబడింది!
‘‘నాయనా! గణేశా! ఏమిటీ గాయాలు! మాకు తెలియకుండా ఎవరిపై యుద్ధానికి వెళ్లావు ! యుద్ధంలో నిన్ను గాయపర్చేటంత బలమైన రాక్షసులు ఉన్నారా?
ఎవరు వారు? వారి అంతు తేల్చుతాను!’’ అన్నది పార్వతీ దేవి ఆగ్రహంగా!
‘‘యుద్ధంలో నన్ను గెలవగల రాక్షసులెవరూ లేరమ్మా! ఈ గాయాలకు, ఆ బురదకు కారణం నా భక్తులేనమ్మా!’’
అన్నాడు గణేషుడు నీరసంగా.
‘‘ఏమిటి గణేషా! నీవు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు!’’ అన్నది పార్వతి అయోమయంగా!
‘‘అవును మాతా! ఆ బరద నాకు అంటించింది, ఈ గాయాలు చేసింది. నా భక్తులే! అసలు నన్నెందుకు సృష్టించావమ్మా? సృష్టించిరిది పో, నా తండ్రియైన పరమశివుడు, నా తలను ఖండించినపుడే వదిలేసి ఉంటే నాకీ బాధ తప్పేది కదమ్మా!’’ అంటూ తల్లిని పట్టుకుని బావురుమన్నాడు ! గణేషుడు!
పార్వతి కనీళ్లతో శివుడి వంకచూసింది!
‘‘ఏం జరిగింది గణేషా! వివరించుము!’’ అన్నాడు శివుడు.
‘‘అంతా మీరే చేశారు నాన్న!, నా కష్టాలన్నింటికీ కారణం మీరే!’’ అన్నాడు గణేషుడు కన్నీళ్లు ధారగా కారుస్తునే!
ఒక తల తీసి మరో తల అతికించినంత మాత్రాన గణేషుడి కష్టాలకు తానెలా కారణమో శివుడికి అర్థం కాలేదు! అయోమయంగా చూశాడు.
‘‘నా తలను ఖండించి, ఎనుగు తల అతికించి, అంతటితో సరిపెట్టుకోక నాకు మొదటి పూజలు చేయగలరని మీరు వరమిచ్చితిరి! ఆ వరమే నా పాలిట శాపమైనది! నన్ను కొలువు దీర్చకముందు నుండే నా పేరిట లక్షల రూ॥లను బలవంతంగా చందాల పేరిట వసూలు చేస్తున్నారు! భక్తి బాగా కనబడాలని నా విగ్రహాలను భారీ సైజులో ఏర్పాటు చేస్తున్నారు! ఇంతటితోనే ఆగితే నాకు ఎలాంటి బాధా ఉండక పోయేది!’’ అంటూ ఆగాడు గణేషుడు.
ఇంతలో పార్వతి దేవీ ఉండ్రాళ్లు, కుడుములు తెచ్చి గణేషుడి ముందు పెట్టింది!
వాటన్నిటినీ ఆలుగా తిన్నాడు! గణేషుడు ! తర్వాత కన్నీళ్లతో తల్లివైపు చూశాడు!
‘‘తల్లి ఎప్పుడూ కొడుకు ఆకలినే చూస్తందమ్మా! తొమ్మిది రోజుల పాటు నన్ను మండపంలో కూర్చోబెట్టిన భక్తులు, నాకు ఏది ఇష్టమో మర్చిపోయారు! ఒక లడ్డూ నా చేతిలో పెట్టి, ఆఖరికి దాన్ని వేలం వేసుకుని లక్షలు రూ॥ వసూలు చేసుకుంటున్నారు! నాకిష్టమైన ఉండ్రాళ్ల పాయసం, కుడుములు లాంటివి ప్రసాదంగా పెట్టడమే మార్చిపోయారమ్మా! ఇంకొన్ని ఉండ్రాళ్లు పెట్టమ్మా ఆకలేస్తుంది!’’
అన్నాడు వినాయకుడు ఇంకా నిండని బొజ్జ నిమురు కుంటూ!
పార్వతి కన్నీళ్ల పర్యంతమయ్యింది! వెంటనే గణేషుడికి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టింది!
‘‘మండపంలో భారీ అలంకరణలు భక్తులు శ్రద్ధగా చేస్తారమ్మా! కానీ డి.జె సౌండుతో బూతు పాటలు పెడతారమ్మా! నా చెవులు పెద్దవి కదా! చిన్న శబ్దమైనా బాగా వినబడుతుంది! అలాంటిది డి.జె సౌండుతో బూతు పాట విని, వినీ, నా చెవుల్లో ఇంకా రక్తమెస్తుందమ్మా చూడూ!’’ అంటూ తల్లికి తన చెవుల్లో వస్తున్న రక్తాన్ని చూపాడు గణేషుడు!
పార్వతి విలవిల్లాడింది! తన కొంగుతో కొడుకు చెవుల్లోని రక్తాన్ని తుడిచింది!
‘‘నిమజ్జనం రోజు నా బాధ చెప్పనలవి కాదమ్మా! నన్ను ఊరేగింపు చేస్తూ, విపరీతమైన శబ్దంతో, అసహ్యకరంగా డాన్సులు చేస్తారమ్మా! మాదకద్రవ్యాలు సేవించి, నా ముందు డాన్సులు చేసే కుర్రాళ్లను చూస్తుంటే, వెనకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి! అప్పట్లో బాగా చదువు రావాలని, పుస్తకాలు నా ముందుంచి, గుంజీలు తీసి, చెంపలు వాయించుకునేవారు! ఇప్పుడు ఒక్కరు కూడా అలా చేయటం లేదు! ఆ రోజులే బాగుండేవి కదమ్మా!’’ అన్నాడు గణేషుడు ఉండ్రాళ్లను తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకుంటూ!
పార్వతి అవునన్నట్లు తలూపింది!
‘‘అమ్మా! నిమజ్జనం అంటూ నన్ను తీసుకెళ్లి ఆ హుస్సెన్‌సాగర్, యమునానది, ఇంకా మురికి గుంటల్లోకి తోసేస్తున్నారు! ఆ మురికి గుంటల్లో నేను మునగకపోతే, పెద్ద పెద్ద కర్రలు, ఇనుపరాడ్లతో నా తలను బద్దలు కొడుతున్నారు! నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, ఆ బురదలో విసిరేస్తున్నారు! అప్పటికీ నేను మునగటం లేదు!
ఎలా మునుగుతానమ్మా! వేసిందేమో బురదలో చేసిందేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో! ఈ విషయం మార్చిపోయి నన్ను నిమజ్జనం పేరిట బురదలో వేసి, నన్ను కాళ్లతో తొక్కుతున్నారు! అంతే అప్పటికీ నేను మునగపోతే ఆ జేసీబీ, బుల్డోజర్లతో నన్ను ఆడుగుదాకా తొక్కుతున్నారమ్మా! అంటూ వంటిపై గాయాలను తల్లికి చూపాడు గణేషుడు!
‘‘నీకు గాయాలు చేసిందెవరో చెప్పు గణేశా! నాస్తికులా, చార్వాకులా, లేక నిన్ను పూజించని వారా? వారి అంతం చూస్తాను!’’ అన్నది పార్వతీ దేవి కాళికావతారం దాల్చి!
శాంతించు అమ్మా! నన్ను గాయాలపాలు చేసింది నాస్తికులు, చార్వాకులు కాదు! నన్ను పూజించని వారు అసలే కాదు! పైగా వారంతా, నా మండపాల వద్ద మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు! నన్ను మట్టితో తయారుచేసి, పర్యావరణం పరిరక్షిం చేందుకు అందరికి, నా మట్టి ప్రతిమలు సరఫరా చేస్తున్నారు! నన్ను గాయాలుపాలు చేస్తున్నది నడమంత్రపు భక్తులేనమ్మా! వారి స్వార్థ రాజకీయాలను కూడా ఇందులో జొప్పిస్తున్నారు. భక్తుల మత విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. గత ముప్ఫయేండ్ల కిందటి భక్తులు ఎంతో మంచివారమ్మా! ఇప్పటి నడమంత్రపు భక్తులతో నేను వేగలేకపోతున్నానమ్మా! వచ్చే వినాయకచవితికి నేను ఆ భూమి మీదకు వెళ్లనమ్మా!’’ అంటూ ఈ వినాయకుడు లోపలకి వెళ్లిపోయాడు.
- ఉషాకిరణ్






కామెంట్‌లు (0)