నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా పార్లమెంటరీ ఎన్నికల తుది ఫలితాల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన ‘యునైటెడ్ రష్యా’ పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 450 స్థానాలున్న స్టేట్ డూమాలో ఆ పార్టీ 349 స్థానాలను గెలుచుకుంది. 58 శాతం ఓట్లు సాధించి మూడొంతుల మెజారిటీని దక్కించుకుంది. ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన తొలి పార్లమెంటరీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.
మొత్తం 11 కోట్లకుపైగా ఉన్న ఓటర్లలో దాదాపు 60 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పదేళ్లలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలతో పోలిస్తే ఇదే అత్యధిక పోలింగ్ కావడం గమనార్హం. మూడు రోజుల పాటు ప్రత్యక్ష ఓటింగ్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఓటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉండే పలు చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు 97 స్థానాల్లో విజయం సాధించగా, నాలుగు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు.
మరోవైపు ఎన్నికల సమయంలో రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు జరిపింది. ఆదివారం రాత్రి రష్యా భూభాగంపైకి వచ్చిన 1,110 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కోపై 450 డ్రోన్లతో దాడి జరిగినట్లు మేయర్ తెలిపారు. ఈ దాడుల్లో ఓ చమురు శుద్ధి కర్మాగారం, ఓ నివాస భవనం దెబ్బతిన్నాయి. మాస్కో పరిధిలో ముగ్గురు పౌరులు మరణించగా, 38 మంది గాయపడ్డారు.
ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురు పోలింగ్ సిబ్బంది మరణించారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. మాస్కో ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలతోపాటు క్రిమియాలోనూ రష్యా ఎన్నికలు నిర్వహించడాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన విజయాన్ని ప్రజల నుంచి తమ విధానాలకు లభించిన మద్దతుగా పుతిన్ పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)