నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలోని మిరాకిల్ మైండ్స్- ది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శనివారం చిన్నారులు వారి తల్లిదండ్రులతో 'లిటిల్ స్టార్స్ అండ్ సూపర్ మామ్స్' వినూత్న ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా నిర్వహించిన పలు వినోదాత్మక క్రీడల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సందడి పాల్గొన్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న చిన్నారులతో పొటాటో రేస్, బాల్ కలెక్టింగ్, బెలూన్ గేమ్స్ వంటి రకరకాల ఆటలను నిర్వహించారు. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమానుబంధాలను, సమన్వయాన్ని పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా ఈ పోటీలు సాగాయి. ఆటల పోటీల్లో పాల్గొన్న తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేలా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ మాట్లాడుతూ... విద్యార్థుల మానసిక, శారీరక వికాసంతో పాటు తల్లిదండ్రులతో అనుబంధాన్ని మరింత బలపరచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రిన్సిపాల్ రత్నాకర్ అభినందనలు తెలియజేశారు.






కామెంట్‌లు (0)