Magazines

చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారె

58 నిమిషాల క్రితం

ailamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

- ఐలమ్మ పోరాట స్ఫూర్తికి ప్రతీక

- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట 

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో ఐలమ్మ పాత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కొనియాడారు.

రజక సంఘం ఆద్వర్యంలో నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. మహనీయుల చరిత్రను యువత తెలుసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఐలమ్మ జీవితం కేవలం ఒక వర్గానికే పరిమితం కాదని, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.


మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ లు జూపల్లి శశికళ, రమేష్ బాబు దంపతులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహిళగా చిరస్థాయిగా నిలిచారన్నారు. మహిళా సాధికారతకు ఆమె జీవితం గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.

- పేదల గుండెల్లో ధైర్యం నింపిన వీరవనిత ఐలమ్మ: సీపీఐ (ఎం)జిల్లా నాయకులు పుల్లయ్య

తెలంగాణ చరిత్రలో దొరల అణచివేతను ఎదిరించి, భూమి హక్కు కోసం నిర్భయంగా నిలిచి పేదల గుండెల్లో ధైర్యం నింపిన వీరవనిత ఐలమ్మ అని సీపీఐ (ఎం) జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. భూస్వామ్య వ్యవస్థ, వెట్టిచాకిరీ, నిజాం పాలన దౌర్జన్యాల మధ్య ఒక సాధారణ రజక మహిళ అసాధారణ పోరాట యోధురాలిగా తెలంగాణ రైతాంగ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయింది తెలిపారు.

చిట్యాల ఐలమ్మ 1895 లో వరంగల్ ప్రాంతంలోని (ప్రస్తుత జనగామ జిల్లా) పాలకుర్తి మండలం కిష్టాపురం గ్రామంలో జన్మించి కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ఆమె, తాము సాగు చేస్తున్న భూమిపై భూస్వాములు హక్కు చెలాయించడానికి ప్రయత్నించడాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు ని పేర్కొన్నారు. 1940లలో దేశ్‌ముఖ్‌ లు, దొరల దౌర్జన్యాలు విపరీతంగా ఉన్న సమయంలో ఐలమ్మ సాగు చేస్తున్న భూమిలోని పంటను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె వెనక్కి తగ్గకుండా గ్రామ ప్రజలతో కలిసి ప్రతిఘటించారు. ఈ సంఘటన తెలంగాణ రైతాంగ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచి, పేద రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అన్నారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా రజక సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ నినాదాలు చేశారు.

పట్టణంలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆమె పోరాట చరిత్ర యువతకు చేరువవుతుందని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల సమీపంలో విగ్రహం ఉండటంతో విద్యార్థులు కూడా ఆమె గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.


కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, మండల అధ్యక్షుడు చెన్నంశెట్టి సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం,సీపీఐ(ఎం) నాయకుడు పుల్లయ్య, కౌన్సిలర్లు మిండా హరిబాబు, నార్లపాటి దివాకర్, కొల్లు రవికిరణ్, ఆకుల శ్రీను, దండబత్తుల రమేష్, వెలుపుల సత్యనారాయణ, రజక సంఘం నాయకులు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్