- సింగరేణి నియోజకవర్గాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
నవతెలంగాణ-సత్తుపల్లి
హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై మంగళవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని సింగరేణి సంబంధిత సమస్యలను, నియోజకవర్గ అభివృద్ధి అవసరాలను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ సమావేశంలో సమగ్రంగా వివరించారు. ప్రజలకు అత్యంత అవసరమైన మౌలిక వసతులు, వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మాల్యే లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం తక్షణమే రూ.5 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ ప్రత్యేక నిధుల విడుదల ద్వారా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు మౌలిక వసతుల పనులను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించినందుకు ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టి, నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.






కామెంట్‌లు (0)