- ప్రభుత్వాన్ని, ప్రశంసించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
నవతెలంగాణ-సత్తుపల్లి
పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో "జాతీయ ఖరీఫ్ సదస్సు"ను మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు ధాన్యాల విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రం పప్పు ధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుందని వివరించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రైతులకు అందిస్తున్న నాణ్యమైన విత్తనాలు, సకాలంలో అందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. తెలంగాణలో కందులు, పెసర్లు, మినుములు వంటి ధాన్యాల సాగు గణనీయంగా పెరిగినట్లు సదస్సులో వెల్లడించారు. తక్కువ నీటితో, ఎక్కువ లాభాలు ఇచ్చే పప్పు ధాన్యాల వైపు రైతులు మొగ్గు చూపేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్రం నుంచి అందిన ఈ అభినందన తెలంగాణ వ్యవసాయ రంగానికి లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం వల్ల పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం ఊహించని స్థాయిలో పెరిగింది. సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడిని కూడా పెంచేలా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సలహాలు ఇస్తున్నారు.
భవిష్యత్తులో తెలంగాణను పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తుండటంతో సాగుపై ఆసక్తి పెరిగింది. ఈ ఈ రికార్డుతో తెలంగాణ రైతాంగం, వ్యవసాయ శాఖ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా పప్పు ధాన్యాల కొరతను తగ్గించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే లభించిన ఈ గుర్తింపు రైతులకు, అధికారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అభినందించింది. తెలంగాణ వ్యవసాయ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)