- హుస్నాబాద్ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంబరాలు
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 2026–27 విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎ, ఏ ఎస్ ఏ, డిఎస్ యు, టి ఎస్ ఎఫ్ కూటమి విజయం సాధించిన సందర్భంగా బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజ్ విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పటాకులు పేల్చి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ భాను మాట్లాడుతూ..హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమి విజయం సాధించడం దేశ విద్యార్థి ఉద్యమానికి ఒక ముఖ్యమైన పరిణామమని అన్నారు. కూటమి అభ్యర్థి దిల్షాద్ రైహాన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారని తెలిపారు. విద్యార్థుల సమస్యలు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, శాస్త్రీయ విద్య వంటి అంశాలపై విద్యార్థి సంఘాలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హెచ్‌సీయూ ఎన్నికల ఫలితాలు క్యాంపస్‌లో విద్యార్థి సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే రాజకీయాలకు లభించిన మద్దతుగా తాము భావిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచనలపై చర్చ మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం, ఫీజుల భారాన్ని తగ్గించడం కోసం, అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని వారు తెలిపారు. హెచ్‌సీయూ ఎన్నికల ఫలితం విద్యార్థి ఉద్యమాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, సిద్దిపేటలో కూడా విద్యార్థుల సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ కూటమిని గెలిపించిన హెచ్ సి యు విద్యార్థిని విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంల ఎస్ఎఫ్ఐ నాయకులు అప్పల ప్రణయ్ విష్ణు తేజ నవదీపు శంకరు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)