మెమో 7002ను రద్దు చేయాలని పీఆర్టీయూ టీఎస్ డిమాండ్
నవతెలంగాణ-ఆలేరు రూరల్
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే SA-1, SA-2 పరీక్షల జవాబు పత్రాలను బాహ్య మూల్యాంకనం చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన RC.No.7002, తేదీ 28-08-2026ను తక్షణమే రద్దు చేయాలని పీఆర్టీయూ టీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాహ్య మూల్యాంకనం సీసీఇ విధానాలకు విరుద్ధంగా ఉందని జిల్లా అధ్యక్షుడు గడసంతల మధుసూదన్ పేర్కొన్నారు.
ఉదయం ఎఫ్ ఆర్ ఎస్ తో ప్రారంభమై ఎం డి ఎం,ఎఫ్ ఏ-1, బేస్‌లైన్ టెస్టులతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ యాప్‌ల ద్వారా నమోదు చేయాల్సి రావడంతో ఉపాధ్యాయులపై ఇప్పటికే పనిభారం పెరిగిందన్నారు. దీనికి తోడు ఎస్ ఏ -1,ఎస్ ఏ -2 జవాబు పత్రాలకు బాహ్య మూల్యాంకనం నిర్వహించడం వల్ల అదనపు భారం పడుతుందని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.బాహ్య మూల్యాంకనం వల్ల ఉపాధ్యాయుల స్వేచ్ఛకు భంగం కలగడంతో పాటు విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఒత్తిడి, భయం పెరిగే అవకాశం ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి కంచరకుంట్ల వీరారెడ్డి అన్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అంతర్గత మూల్యాంకన విధానమే ఉపయోగకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు అధికంగా వినియోగించడం వల్ల బోధనా ప్రక్రియకు విఘాతం కలుగుతోందన్నారు.ప్రభుత్వం RC.No.7002 మెమోను వెంటనే రద్దు చేసి, అంతర్గత మూల్యాంకన విధానాన్ని కొనసాగించాలని పీఆర్టీయూ టీఎస్ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మూల తిరుపతిరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి చామల శ్రీధర్,రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్,వేణుగోపాల్,కాంతారావు,సంజీవరెడ్డి, సతీష్,మహిళా నాయకురాలు సంధ్యారాణి, జిల్లా కమిటీ సభ్యుడు సుదర్శన్,మండల నాయకులు సత్యనారాయణ, వెంకటయ్య, దశమంతరెడ్డి, శ్రీనివాస్, శివాయనమః తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)