Magazines

మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు

48 నిమిషాల క్రితం

ACB raids in Moinabad Municipality
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

రూ. 75 వేల లంచం తీసుకుంటూ ‌పట్టుబడిన
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్
నవతెలంగాణ-మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతి అధికారులు మరోసారి ఏసీబీ వలకు చిక్కారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ దొరికిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి (ఏవో-1), ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని చట్టవిరుద్ధమైనదిగా పేర్కొంటూ దానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారిక సహాయం చేస్తానని నమ్మబలికారు. ఈ వ్యవహారంలో భాగంగా మొయినాబాద్ గ్రామ పంచాయతీ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న యలమోని సుదర్శన్ ద్వారా బాధితుని నుంచి రూ.75వేలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం మున్సిపాలిటీ కార్యాలయం పరిధిలో మాటువేసి, ఏవో-2 సూచన మేరకు రూ. 75వేలు నగదును స్వీకరిస్తుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచినట్టు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది ఎవరైనా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్