Magazines

ముగ్గురు డ్రగ్స్ విక్రయదారుల అరెస్టు

53 నిమిషాల క్రితం

Arrest of three drug peddlers
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

80 గ్రాముల మెథాంఫేటమిన్ (మెత్), 4 ఎల్ఎస్డీ

పరారీలో డ్రగ్స్ ప్రధాన సరఫరాదారు, అతని అనుచరుడు
​నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్‌ ‌సమీపంలో డ్రగ్స్ అమ్ముతున్న నిందితులను అరెస్టు చేసి వారి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆర్జీఐఏ డివిజన్ సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) వి.శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రగ్స్ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శంషాబాద్‌లోని సంపత్ నగర్ రోడ్డులోని హెచ్‌ఎండీఏ నర్సరీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు విక్రయదారులను పట్టుకున్నారు. వారి నుంచి 80 గ్రాముల మెథాంఫేటమిన్ (మెత్) తో పాటు 4 ఎల్ఎస్డీ బ్లాట్‌లను, 4 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌‌లోని జహనుమా, నవాబ్ సాహెబ్ కుంటలోని బషరత్ నగర్‌‌కు చెందిన సయ్యద్ సయీద్ హుస్సేన్ (లంబా) అలియాస్ హుస్సేన్ అలియాస్ లంబా హుస్సేన్ డ్రైవర్ ప్రధాన నిందితుడు , రెండో నిందితుడు బెంగళూరులోని ఎల్‌ఎ‌స్‌‌వీ పీజీ హాస్టల్‌‌లో కారు డ్రైవర్‌‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని దేవరకొండ బ‌స్తీకి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ శుకూర్, హైదరాబాద్‌లోని సోమాజిగూడ ఎంఎస్ మక్త, రాజ్‌‌నగర్ నివాసానికి చెందిన రహ్మానుద్దీన్ అలియాస్ లాలాను పోలీసులు అరెస్ట్‌ ‌చేశారు. వీరు కాక, బెంగళూరుకు చెందిన డ్రగ్స్ ప్రధాన సరఫరాదారు జంషెడ్, అతని సహాయకుడు కుండలబౌలి, మథాకికిడికి చెందిన సయ్యద్ జొహైర్ మెహదీ పరారీలో ఉన్నారు. ఈ సరఫరాదారులంతా గొలుసు మాదిరిగా ఏర్పాటై దందా నిర్వహిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. విచారణ ముందుకు సాగే కొద్దీ, ఇందులో పాల్గొన్న నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నిందితులపైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, 1985లోని సంబంధిత నిబంధనల కింద ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌‌లో క్రైమ్ నెం. 862/2026, ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ), 22(బీ) 22(సీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రధాన నిందితుడు సయ్యద్ సయీద్ హుస్సేన్ పాత నేరస్థుడు. ఇతనికి ఆస్తి సంబంధిత నేరాల్లో 270కి పైగా కేసుల్లో ప్రమేయం ఉంది. ఇతనికి ప్రధాన విక్రయదారుడైన జంషెడ్‌తో పరిచయం ఏర్పడటంతో అతని సహచరులైన మహమ్మద్ ఇమ్రాన్, రహ్మానుద్దీన్‌ ద్వారా మెథాంఫేటమిన్ (మెత్), గంజాయి సేకరించి విక్రయించేవారు. అధిక ధరకు అమ్మి, తద్వారా అక్రమంగా డబ్బు సంపాదించేవారు. బెంగళూరు నుంచి సేకరించిన మెథాంఫేటమిన్(మెత్‌) ను పరస్పరం మార్చుకుంటున్న సమయంలో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నిందితులను పట్టుకున్న ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి. సంజీవులు, ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ డీఐ జి.పవన్ కుమార్ వారి బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్