Magazines

భగత్‌సింగ్ ఆశయాల సాధన కోసం విద్యార్ధి యువత ఉద్యమించాలి

58 నిమిషాల క్రితం

Students and the youth must agitate to realize Bhagat Singh's ideals.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి : 
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భగత్‌సింగ్ ఆశయాల సాధన కోసం విద్యార్ధి యువత ఉద్యమించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ‌కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో‌ హైదరాబాద్‌‌లోని ఆ సంఘాల రాష్ట్ర కార్యాలయంలో భగత్ సింగ్ 119వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి అని తెలిపారు. భగత్‌సింగ్ కేవలం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదనీ, సామాజిక, ఆర్థిక అసమానతలు లేని సమస మాజాన్ని ఆకాంక్షించిన విప్లవకారుడని గుర్తు చేశారు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా కులం పేరుతో కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ భగత్‌సింగ్ విద్యార్థి, యువతలో శాస్త్రీయ ఆలోచనలు, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు స్ఫూర్తినిచ్చిన విప్లవ వీరకిషోరం అని చెప్పారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల భారం, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కొరత, విద్యా రంగంలో పెరుగుతున్న అస మానతలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలకు, అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథంతో విద్యార్థులు ముందుకు సాగాలని చెప్పారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, యువతకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భగత్‌సింగ్ చూపిన ధైర్యం, త్యాగం, ప్రజాస్వామ్యం, సమానత్వ భావాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కెవిపిఎస్ హైదరాబాద్ నగర కార్యదర్శి బి.సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, నాయకులు జి.రాములు, బి.పవన్, నాగేందర్, రజనీకాంత్, శ్రీమాన్, జనార్దన్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్