Magazines

ఆ రాత్రి ముగియకూడదనిపించింది

1 గంట క్రితం

I felt like that night shouldn't end.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 4 నిమిషాల చదవడం

ఆ రోజు నా పుట్టినరోజని నాకు గుర్తే లేదు. ఒకవేళ గుర్తున్నా.. అలాంటి విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. ఆరోజు కూడా ఎప్పటిలాగే ఫోన్లు, మీటింగులు.. రాత్రి ఇంటికి వెళ్లి నిశ్శబ్దంగా పడుకుంటాననుకున్న సాధారణ రోజు. కానీ కొన్ని రోజులు మనకు తెలియకుండా ఎవరో ప్రత్యేకంగా మార్చేస్తారు. రాత్రి సరిగ్గా పన్నెండు కావొస్తుండగా ఆఫీస్ కారిడార్‌లో నవ్వుల గోల వినిపించింది. తలెత్తి చూసా... ఆమె... ఆమెతో పాటు ముగ్గురు స్నేహితులు. అందరూ నాకు తెలిసిన వాళ్లే. ఆమె చేతిలో చిన్న కేక్ బాక్స్. ముఖం నిండా అల్లరి. “హ్యాపీ బర్త్‌డే కామ్రేడ్,” అంది. ఆ క్షణం నిజంగా నేను మాటలు మరిచిపోయాను. మన గురించి మనకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకునే వాళ్లు జీవితంలో చాలా అరుదు. “నీకు ఎలా తెలుసు?” అన్నా ఆశ్చర్యంగా. “తెలుసుకోవాలనుకుంటే తెలిసిపోతుంది” అంది చిన్నగా నవ్వుతూ. ఆ చిన్న సెలబ్రేషన్‌లో పెద్దగా ఆర్భాటం ఏమీ లేదు. కేక్ కట్ చేశాం. కొన్ని ఫోటోలు. కొన్ని నవ్వులు. కానీ ఆ హడావుడి మధ్య కూడా..
ఎవరూ చూడకుండా నా దగ్గరికి వాలి, “రోజంతా పని చేశావ్ కదా.. చాలా టైర్డ్‌గా ఉన్నావ్” అంది మెల్లగా. అవి బయటికి చూస్తే చాలా చిన్న మాటలు. కానీ ఆ రాత్రి వాటి వెనక ఉన్న శ్రద్ధ మాత్రం నాకు చిన్నదిగా అనిపించలేదు. కొద్దిసేపటికే వాళ్లలో ఒకరు, “ఇంతటితో పార్టీ అయిపోదు. ఓల్డ్ సిటీకి వెళ్దాం,” అన్నారు. అలా మేమంతా కారులో బయలుదేరాం. నేను ముందు సీట్లో కూర్చున్నా. డ్రైవ్ ఆమె స్నేహితుడే చేస్తున్నాడు. ఆమె వెనక సీట్లో మధ్యలో. కానీ ఆ చిన్న కారులో ఆ రాత్రి ఎక్కువ స్థలం ఆక్రమించింది ఆమె నవ్వే. హైదరాబాద్ నెమ్మదిగా అర్థరాత్రిలోకి జారుకుంటోంది. వీధి దీపాలు పొడవాటి వెలుగుల్లా రోడ్ల మీద పడుతున్నాయి. చార్మినార్ వైపు వెళ్లే దారిలో గాలిలో మసాలా వాసన, పాతనగరపు తడి, ఎక్కడో దూరంగా వినిపించే టీ గ్లాసుల శబ్దం. కారులో మాత్రం పూర్తి హడావుడి. “అవునే..

ఈ సీరియస్ కామ్రేడ్‌కి రొమాన్స్ తెలుసా?” అని ఒక స్నేహితురాలు ఆమెను ఆటపట్టించింది. అందరూ నవ్వుతూ ఆమె వైపు చూశారు. ఆమె మాత్రం నా వైపు చూసి, “తెలుసు” అంది. “నీకెలా తెలుసు?” “అది సీక్రెట్,” మళ్లీ నవ్వులు. అలా కారు సరదాగా సాగిపోతోంది. ఓల్డ్ సిటీ చేరేసరికి రాత్రి మరింత అందంగా మారిపోయింది. దూరంగా చార్మినార్ వెలుగుల్లో తేలుతోంది. రోడ్డు పక్కన ఇంకా చాయ్ దుకాణాలు తెరిచే ఉన్నాయి. హోటళ్ల ముందు జనాలు. అర్థరాత్రి గాలి కూడా అక్కడ ఏదో పాత కథ వింటున్నట్టుగా అనిపించింది. మేము చిన్న హోటల్‌లో కూర్చున్నాం. ఆమె నా ఎదురుగా. తన జుట్టును చెవిపక్కకు జరుపుకుంటూ మాట్లాడుతోంది. స్నేహితులు సరదాగా నవ్వుతున్నారు. ఆ గోల మధ్య కూడా.. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న నిశ్శబ్దాలు పుడుతున్నాయి.
ఒకసారి అందరూ మెనూ చూస్తుంటే.. ఆమె నెమ్మదిగా నా గ్లాస్‌లో నీళ్లు నింపింది. మరోసారి నేను తినకుండా మాట్లాడుతుంటే, “ముందు తిను” అంది. “పని ఉంటే ఆకలి గుర్తుండదు,” అన్నా నవ్వుతూ. “అలా కాదు.. ఎవరో ఒకరు గుర్తు చేయాలి నీకు” అంది. ఆ మాటకు వాళ్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆమె కూడా నవ్వింది. కానీ ఆ నవ్వులో కాస్త సిగ్గు కలిసింది. డిన్నర్ అయిపోయాక కూడా ఎవరూ ఇంటికి వెళ్లాలని అనుకోలేదు. అలా నగర వీధుల్లో కారులో తిరుగుతూనే ఉన్నాం. చార్మినార్ దగ్గరకు వచ్చేసరికి ఆమె, “ఒక్క నిమిషం ఆపండి,” అంది. కారు ఆగింది. “ఏం కావాలి?” అని అడిగాను. “నీకు ఒకటి ఇవ్వాలి. వస్తావా?” ఆమె దిగింది. నేనూ దిగాను. రాత్రి ఇంకా మేలుకునే ఉంది. టీ బండ్ల దగ్గర పొగలు లేస్తున్నాయి. బిర్యానీ హోటళ్ల ముందు కుర్రాళ్లు పరుగులు తీస్తున్నారు. ఎవరో సరుకుల బస్తాలు మోస్తున్నారు.

ఆటోలు ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాయి. మనకు అది నిద్రపోయే సమయం. వాళ్లకు మాత్రం ఇంకా పని సమయమే. ఆమె ఒక చిన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఏదో తీసుకుంది. తిరిగి వచ్చి నా చేతిలో చిన్న ప్యాకెట్ పెట్టింది. “ఇది ఏమిటి?” “నీ బర్త్‌డే గిఫ్ట్.” నేను ప్యాకెట్ తెరిచాను. లోపల ఒక పెన్, నోట్‌బుక్. నేను ఆమె వైపు చూసి నవ్వాను. “నువ్వు చూసినదాన్ని రాయకుండా ఉండలేవు కదా " “అవును.. అయితే?” ఆమె చుట్టూ చూసింది. టీ బండి దగ్గర నిల్చున్న మనిషిని, హోటల్ ముందు పరుగులు తీస్తున్న కుర్రాడిని, రోడ్డుపై బస్తా మోస్తున్న కార్మికుడిని, ఆటోలో ఒంటరిగా కూర్చున్న డ్రైవర్‌ను. తర్వాత నా వైపు చూసింది. “ఈసారి వీళ్ల గురించి రాయ్” అంది. నేను మౌనంగా ఆమెను చూశాను. ఆమె మాట కొనసాగించింది. “మనం రాత్రి నగరాన్ని ఆస్వాదిస్తాం..” ఒక్క క్షణం ఆగి, “వాళ్లు మాత్రం ఆ రాత్రిని జీవింపజేస్తారు..” అంతే. ఆమె ఇంకేమీ చెప్పలేదు. చార్మినార్ వెలుగులు ఎదురుగా ఉన్నాయి.
చుట్టూ నగరం మేలుకునే ఉంది. ఆ రాత్రిని అందంగా చేసేది వెలుగులే అనుకుంటాం. కానీ మన రాత్రులను అందంగా ఉంచడానికి ఇంకెంతో మంది నిద్రపోకుండా పనిచేస్తున్నారు. ఆమె ఇచ్చిన నోట్‌బుక్‌ వైపు మరోసారి చూశాను. ఖాళీ పేజీలే. కానీ ఆ ఖాళీ పేజీలపై అప్పటికే కొన్ని ముఖాలు కనిపిస్తున్నట్టుగా అనిపించింది. “సరే కామ్రేడ్.. ఇవాళ నీ బర్త్‌డే. రేపటి నుంచి సమాజాన్ని మార్చొచ్చు. పద, పోదాం” అని ఆమె ముందుకు నడిచింది. మళ్లీ కారులోకి ఎక్కాం. ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లేటప్పుడు చల్లగాలి లోపలికి వచ్చింది. అందరూ పాటలు పాడుతున్నారు. ఆ గోల మధ్య ఒక్క క్షణం ఆమె ముందుకు వాలి.. సీట్ వెనుక నుంచి మెల్లగా నా భుజాన్ని తాకింది. ఎవరూ గమనించలేదు. “హ్యాపీగా ఉన్నావా నిజంగా?” అని చాలా చిన్నగా అడిగింది. నేను వెనక్కి తిరిగి చూశా. ఆమె నవ్వుతోంది. నేను చిన్నగా తల ఊపాను. ఆమె వెంటనే వెనక్కి వాలి మళ్లీ అందరితో కలిసి నవ్వడం మొదలుపెట్టింది. కిటికీ బయట హైదరాబాద్ వెనక్కి పరుగెడుతోంది. ఆమె నవ్వు మాత్రం ఇంకా నా చెవుల్లోనే ఉంది. ఆ రాత్రి ముగియకూడదనిపించింది.

రామ్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్