నవతెలంగాణ - హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత కోసం వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసిన ఈ-చలానాల్లో సుమారు రూ.20 వేల కోట్ల జరిమానాలు ఇంకా వసూలు కాలేదని పేర్కొంటూ, బకాయిల వసూళ్లకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 2012లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూ.45 వేల కోట్ల విలువైన చలానాలు జారీ చేయగా.. ఇప్పటివరకు రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు అమికస్ క్యూరీ వెల్లడించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.
ఈ-చలానా బకాయిలను నెలవారీ విద్యుత్ బిల్లుల్లో చేర్చి వసూలు చేసే అంశాన్ని అమలు చేయాలని కోర్టు సూచించింది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నందున, జరిమానాల వసూళ్లు సులభతరం అవుతాయని పేర్కొంది.
అలాగే ఈ-చలానా బకాయిలు చెల్లించని వాహనాలకు ఆన్‌లైన్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్‌సీ పునరుద్ధరణ, డూప్లికేట్ ఆర్‌సీ జారీ, వాహన యజమాని చిరునామా మార్పు వంటి సేవలను నిలిపివేయడంతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయరాదని పేర్కొంది. అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం లేదా రెన్యూవల్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకోబోయే చర్యలను నిర్దిష్ట గడువులతో పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు అమలు చేయని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయించడంలో అమికస్ క్యూరీ సమర్పించే నివేదిక కీలకంగా ఉంటుందని జస్టిస్ పార్దీవాలా పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)