నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నియంతృత్వాన్ని ఎండగట్టడానికి, ఆయనను తన పదవికి రాజీనామా చేసేలా చేయడానికి ఇండియా బ్లాక్ సమావేశంలో ఒక వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. బుధవారం ఇండియా బ్లాక్ సమావేశం జరగనున్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జ్ఞానేష్ కుమార్ వ్యవహారాలను బయటపెట్టడానికి, అలాగే ఆయన స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకునేలా లేదా తొలగించేలా చేయడానికి అవసరమైన వ్యూహాన్ని, ప్రచారాన్ని సిద్ధం చేయనున్నామని అన్నారు.
"ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాల ఆదేశాల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ పాల్పడుతున్న అక్రమ చర్యలను అడ్డుకునేందుకు ఏర్పడిన విస్తృత కూటమి ఇది. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అందరం ఏకం కావాల్సిన కీలక సమయం ఇదేనని వామపక్షాలైన తాము భావిస్తున్నాము’’ అని అన్నారు. దీంతో ఈ పోరాటంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఎన్‌డిఎని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో డిఎంకె ఇండియా బ్లాక్‌లో చేరుతుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇండియా బ్లాక్‌లోకి తిరిగి రావడం అనేది డిఎంకె ఇష్టమని అన్నారు. కూటమిలోకి తిరిగి రావడం డీఎంకే ఇష్టం. కేరళలో కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయని, కానీ తాము ఆ విభేదాలకు అతీతంగా ఉన్నామని, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సంబంధించిన ప్రశ్న అని అన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌పై ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉందని అన్నారు.







కామెంట్‌లు (0)