Magazines

వివక్ష లేని సమాజం కోసం...

56 నిమిషాల క్రితం

society
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

కులవివక్ష, అంటరానితనం, అవమానాలు, సామాజిక బహిష్కరణలు దళితుల జీవితాలను శతాబ్దాలుగా వెంటాడు తున్నాయి. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నా, కులం పేరుతో మనిషిని మనిషిగా చూడని అమానవీయ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతుండటం సమాజాన్ని ప్రశ్నిస్తోంది. పల్లెల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా వివక్ష రూపాలు మారుతున్నా, దాని మూల స్వభావం మాత్రం మారడం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి, కులవివక్షకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్యతను నిర్మించేందుకు ఏర్పడిన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) 28 ఏండ్ల పోరాట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని నేడు 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1998 అక్టోబర్‌ 2న ‘ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన’ లక్ష్యాలతో కేవీపీఎస్‌ ఆవిర్భవించింది. అట్టడుగు వర్గాల సమస్యలను కేవలం ఒక కులానికి పరిమితం చేయకుండా, కుల ఆధిపత్యం, అంటరానితనం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడటం సంస్థ ప్రత్యేకతగా నిలిచింది. కులవివక్ష నిర్మూలన కోరుకునే ప్రతి ఒక్కరినీ, ఏ రాజకీయ భావజాలానికి చెందిన వారైనా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ విశాల ఐక్యతకు కృషి చేసింది.


వివక్షను వెలుగులోకి తెచ్చిన సర్వేలు ‘
ఇప్పుడెక్కడుంది కులవివక్ష? అందరం కలిసి తిరుగుతున్నాం, కలిసి కూర్చుంటున్నాం’ అనే వాదనల మధ్య కేవీపీఎస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు పదకొండు వేల గ్రామాల్లో వేలాది మంది కార్యకర్తలతో నిర్వహించిన సర్వేలు సమాజం ముందు చేదు వాస్తవాలను ఉంచాయి. ఉమ్మడి బావిలో నీళ్లు తోడుకోనివ్వకపోవడం, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, దళితులకు క్షవరం చేయకపోవడం, బట్టలు ఉతకకపోవడం, రచ్చబండపై కూర్చోనివ్వకపోవడం, అగ్రకులాల వీధుల్లోకి రానివ్వకపోవడం వంటి వివక్షలు బయటపడ్డాయి.దేవాలయ ప్రవేశం నిరాకరణ నుంచి పండుగల్లో వివక్ష వరకు, దళిత మహిళలు వండిన మధ్యాహ్న భోజనం తినడానికి నిరాకరించడం నుంచి శ్మశాన వాటికలో చోటు ఇవ్వకపోవడం వరకు కులవివక్ష ఎన్ని రూపాల్లో ఉందో ఈ సర్వేలు వెల్లడించాయి. అంటే చట్టపరంగా అంటరానితనం నేరమైనా, సామాజిక జీవితంలో దాని ఆనవాళ్లు ఎంత లోతుగా ఉన్నాయో అవి స్పష్టం చేశాయి. ఈ సమస్యలను కేవలం గుర్తించడంతో కేవీపీఎస్‌ ఆగలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా దశలవారీ ఉద్యమాలను నిర్మించింది. దాని ఫలితంగా కులవివక్షపై జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పడి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 62 వివక్ష రూపాలను గుర్తించింది. ప్రభుత్వానికి 105 సిఫారసులు చేసింది. ఇది కేవీపీఎస్‌ పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి.


ఆరడుగుల నేల కోసం కూడా పోరాటమే!
ఒక మనిషి చనిపోయిన తర్వాత అతడిని గౌరవంగా పూడ్చేందుకు ఆరడుగుల నేల కూడా దొరకని పరిస్థితులు దళితులు ఎదుర్కొన్నారు. అనేక గ్రామాల్లో ప్రత్యేక శ్మశాన స్థలాలు లేకపోవడం, ఇతర కులాల శ్మశానాల్లో దళితుల మృతదేహాలను పూడ్చనివ్వకపోవడం, దూర ప్రాంతాలకు శవాలను మోసుకెళ్లాల్సిన పరిస్థితులు కొనసాగాయి. ఈ సమస్యను కేవీపీఎస్‌ ప్రధాన ఉద్యమ అంశంగా మార్చింది. శవపేటికలతో చలో అసెంబ్లీ, కలెక్టరేట్ల ముట్టడులు నిర్వహిం చింది. ఈ పోరాటాల ఫలితంగా ప్రతి దళితవాడకు శ్మశాన స్థలం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవో నంబర్‌ 1235 జారీ చేయాల్సి వచ్చింది. జీవో అమలుకూ ఉద్యమాలు కొనసాగాయి. ఒక మనిషి మరణానంతరం కూడా కులవివక్ష ఎదుర్కొంటున్న వాస్తవాన్ని ఈ పోరాటం సమాజం ముందు నిలిపింది.


హక్కుల కోసం..బాధితుల పక్షాన
సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా బడ్జెట్‌లోనూ ప్రతిఫలించాలన్న డిమాండ్‌తో కేవీపీఎస్‌ దళిత, గిరిజన జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని పోరాడింది. సామూహిక నిరాహార దీక్షలు, చలో అసెంబ్లీ వంటి ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దాని ఫలితంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు కేటాయించే నిర్ణయం వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్‌ రుణ బకాయిల రద్దు, దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్‌, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకం, హాస్టల్‌ విద్యార్థుల సమస్యల వంటి అనేక అంశాలపై పోరాటాలు సాగాయి. హక్కుల కోసం పోరాడటమే కాదు, బాధితులకు అన్యాయం జరిగిన ప్రతిచోట కేవీపీఎస్‌ ‌వారి పక్షాన పోరాటం చేసింది. ఇన్నేండ్ల ప్రస్థానంలో కులదురహంకార హత్యలు, దాడులు, లైంగిక దాడులు జరిగిన ప్రతి సందర్భంలో బాధితుల పక్షాన ‌ముందు నిలబడింది. మంథని మధుకర్‌, అంబోజి నరేష్‌, పెరుమాండ్ల ప్రణయ్‌ వంటి ఘటనల్లో న్యాయం కోసం దశలవారీ పోరా టాలు సాగించింది. కులాంతర వివాహాలను అడ్డుకునే దౌర్జన్యాలు, సామాజిక బహిష్కరణలు, ఆధిపత్య కులాల దాడులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలను ఐక్యం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కులదురహంకారం అంతరించిపోలేదని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయి.


ముందున్న సవాళ్లు.. విస్తరించాల్సిన ఐక్యత
ప్రభుత్వ రంగం క్షీణించి ప్రైవేట్‌ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల అమలు కూడా సవాలుగా మారుతోంది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కులవివక్ష రూపాలు మారుతున్న కొద్దీ వాటిని గుర్తించి ఎదుర్కొనే ఉద్యమాలు కూడా కొత్త రూపాలు సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కేవీపీఎస్‌ భవిష్యత్‌ కార్యాచరణ కేవలం దళితుల సమస్యలకే పరిమితం కాకుండా కార్మికులు, పేదలు, ఇతర అట్టడుగు వర్గాలు, ప్రజా సంఘాలతో మరింత విశాల ఐక్యతను నిర్మించాల్సిన దిశగా సాగాలి. ప్రత్యామ్నాయ సంస్కృతిని బలపరచాలి. యువతను, మహిళలను ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. కులవివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో నిరంతర చైతన్యం తీసుకురావాలి.

28 ఏండ్ల అనుభవం కేవీపీఎస్‌కు ఒక స్పష్ట మైన సందేశాన్ని ఇస్తోంది-కులవివక్షపై పోరాటం ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదు. అది నిరంతర సామాజిక మార్పు ప్రక్రియ. సాధించిన విజయాలు భవిష్యత్‌ పోరాటాలకు పునాది కావాలి. ఆత్మగౌ రవం, సమానత్వం, సామాజిక న్యాయం సాధించే వరకు ఉద్యమం మరింత విస్తరించాలి. అంతిమ లక్ష్యమైన కుల నిర్మూలన దిశగా ప్రజలందరినీ కలుపుకుని ముందుకు సాగడమే కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవానికి అసలైన స్ఫూర్తి.


టి.స్కైలాబ్ బాబు, 9177549646




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్