Magazines

‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’’

1 గంట క్రితం

"Long live the revolution"
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

‘మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని’ చాటిచెప్పిన విప్లవ వీరుడు భగత్ సింగ్. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిలించి, స్వరాజ్య సాధన కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన యోధుడు. ఆయన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆలోచనలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. మత సామరస్యం, శాంతియుత సహజీవనం, సమానత్వం, సామాజిక న్యాయానికి ఆయన ప్రతీకగా నిలిచారు.1907 సెప్టెంబర్ 28న లాహోర్ సమీపంలో జన్మించిన భగత్ సింగ్‌పై 1917 రష్యా అక్టోబర్ విప్లవం, 1919 జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రభావం చూపాయి. భారతదేశంలో కూడా సోషలిస్టు రాజ్యం, సమసమాజం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. జైలులో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న సమయంలోనూ మార్క్సిస్టు సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, ట్రాట్‌స్కీతో పాటు వివిధ యూరప్ ఉద్యమాల రచనలను చదివారు. మూఢనమ్మకాలు, అంటరానితనం, మతతత్వం, సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించారు. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాలని భగత్ సింగ్ స్పష్టం చేశారు. మతం వ్యక్తిగత విషయమని, మత ప్రాతిపదికన ప్రజలను ఐక్యం చేయడం సాధ్యం కాదని, భిన్న మతాల ప్రజలు రాజకీయంగా కలిసి పనిచేయడానికి లౌకిక దృక్పథం అవసరమని ఆయన నొక్కిచెప్పారు.మత ఘర్షణలను రెచ్చగొట్టడంలో మతతత్వ నాయకులు, కొన్ని వార్తా పత్రికల పాత్రను కూడా ఆయన విమర్శించారు.

ప్రజల్లో అవగాహన కల్పించడం, సంకుచిత భావాలను తొలగిం చడం, పరస్పర అవగాహనను పెంచడం పత్రికల బాధ్యతగా భావించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన అనేక రచనలు చేశారు. కుల వివక్ష, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. కోట్లాది మందిని అస్పృశ్యులుగా చూడటం అమానవీయమని విమర్శించారు. ‘అఛూత్ కా సవాల్’ వ్యాసంలో అంటరానితనం దురాచారాన్ని ఎత్తిచూపారు. ‘నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే’ రచనలో తన హేతుబద్ధమైన వైఖరి, భౌతికవాద అవగాహన, మార్క్సిస్టు దృక్పథం గురించి వివరించారు. స్వేచ్ఛాయుత ఆలోచన, సమానత్వం, సామాజిక న్యాయం సమాజంలో పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. నేడు వివిధ రాజకీయ, సామాజిక వర్గాలు భగత్ సింగ్ పేరును తమకు అనుగుణంగా ప్రస్తావిస్తున్నప్పటికీ, ఆయన అసలు ఆశయాలను ఆయన రచనలు, ఆలోచనల వెలుగులోనే అర్థం చేసుకోవాలి. కుల, మత వివక్షలు, మూఢనమ్మకాలు, మతోన్మాదం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటికీ ప్రాసంగికమే. భగత్ సింగ్‌కు నిజమైన నివాళి ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదు; ఆయన ప్రశ్నించిన అసమానతలను, మూఢనమ్మకాలను, మతతత్వాన్ని, సామాజిక వివక్షను ప్రశ్నించడం. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం నేడు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్ఫూర్తినిచ్చే నినాదంగానే నిలిచివుంది. (28 సెప్టెంబర్‌, భగత్‌‌సింగ్‌ ‌119వ జయంతి)


నాదెండ్ల శ్రీనివాస్, 9676407140

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్