సత్యం లేని చదువు.. ప్రేమ లేని ఇల్లు.. ధర్మం లేని రాజకీయం ఉన్నంతకాలం సమాజానికి శాంతి ఎక్కడ? అక్టోబర్ 2 రాగానే గాంధీజీ గుర్తుకొస్తారు. విగ్రహాలకు పూలమాలలు వేస్తాం. చిత్రపటాలకు నివాళులు అర్పిస్తాం. సత్యం, అహింస, స్వచ్ఛతపై ప్రసంగాలు చేస్తాం. కానీ మరుసటి రోజే మళ్లీ అదే కోపం.. అదే మోసం.. అదే అవినీతి.. అదే కుటుంబ కలహ.. అదే రాజకీయ ఆరోపణలు. గాంధీని విగ్రహంలో పెట్టుకున్నామా? గుండెల్లో పెట్టుకున్నామా? గాంధీజీకి సత్యం ప్రసంగ పదం కాదు.. జీవిత ప్రయోగం. సత్యాగ్రహం అంటే తప్పు ముందు తలవంచకుండా నిలబడే నైతిక ధైర్యం. అహింస అంటే ఎదుటివాడిని కొట్టకపోవడమే కాదు.. ఎదుటివాడిలోనూ మనిషిని చూడడం. విగ్రహం ముందు తలవంచడం సులువు.. మన తప్పు ముందు తలవంచడం కష్టం.ఇది ముఖ్యంగా రాజకీయాలకు వర్తిస్తుంది. గాంధీజీకి రాజకీయాలు అధికారం కోసం కాదు.. ప్రజాసేవ కోసం. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం పాలనకు జవాబు చెప్పాలి. ప్రతిపక్షం ఆధారాలతో ప్రశ్నిం చాలి. ప్రజల సొమ్ము ఎలా ఖర్చవుతోంది? పథకం ఎందుకు ఆలస్యమైంది? పని నాణ్యత ఎలా ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి.
అవినీతి, భూకబ్జాలు, కల్తీ వ్యాపారాలు, పోలీసు పైరవీలు, సెటిల్మెంట్లు రాజకీయ పలుకుబడితో నడుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోపణ వస్తే విచారణ జరగాలి. ఆధారం ఉంటే చట్టం తన పని తాను చేయాలి. ఆధారం లేకుండా ఎవరినీ నేరస్తుడిగా ముద్ర వేయకూడదు. వ్యక్తి ఎవరు అన్నది కాదు.. నిజం ఏమిటన్నదే ముఖ్యం.పదవి శాశ్వతం కాదు.. అధికారం ప్రజల నుంచి వచ్చే తాత్కాలిక బాధ్యత. ఓటు ఒకరోజు లావాదేవీ కాదు.. ఐదేళ్ల బాధ్యత. కులం, పార్టీ, వ్యక్తిగత అభిమానం దాటి పనితీరు, పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రశ్నించే పౌర సంస్కృతి కావాలి.
మనవాడు తప్పు చేసినా తప్పు అని చెప్పగలిగినప్పుడే గాంధీ ఆలోచనలకు మనం దగ్గరవుతాం. చదువులోనూ ఇదే ప్రశ్న. నేటి విద్యార్థి చేతిలో ప్రపంచ జ్ఞానం ఉంది. ఫోన్లో పాఠాలు.. వీడియో ల్లో ప్రయోగాలు.. ఏఐతో క్షణాల్లో సమాచారం. కానీ ఈ జ్ఞానం మంచి మనిషిని తయారు చేస్తోందా? గాంధీ నయీ తాలీమ్ విద్యను అక్షరజ్ఞానంతో ఆపలేదు. పని, నైపుణ్యం, బాధ్యత, వ్యక్తిత్వ వికాసంతో అనుసంధానిం చారు. పిల్లలకు కోడింగ్ నేర్పుతున్నాం.. కరుణ నేర్పుతున్నామా? గెలవడం నేర్పుతున్నాం.. ఓడినవాడిని గౌరవించడం నేర్పుతున్నామా?
ఒకప్పుడు గోరుముద్దకు చందమామ ఉండేది. ఇప్పుడు ఫోన్ వచ్చింది. సౌకర్యం పెరిగింది.. సంభాషణ తగ్గింది. గూగుల్ ముద్దతో కడుపు నిండొచ్చు.. మనసు నిండుతుందా? పిల్లలకు వస్తువులు కొనివ్వడం కంటే తల్లిదండ్రుల సమయం అవసరం. ప్రేమ పేరుతో ప్రతి తప్పును కప్పిపుచ్చడం ప్రేమ కాదు, అర్థమయ్యేలా చెప్పి సరిదిద్దడం నిజమైన ప్రేమ. సమాజంలో కూడా మన బాధ్యత తప్పదు. రోడ్డుపై అన్యాయం కనిపిస్తే వీడియో తీసి వెళ్లిపోవడం.. “మనకెందుకులే?” అనడం మన నిర్లిప్తతకు అద్దం. ప్రతి సంఘటనలో మనమే పోలీసులం కావాల్సిన అవసరం లేదు. కానీ బాధితుడికి చట్టబద్ధంగా అండగా నిలవవచ్చు. అదే సత్యాగ్రహం యొక్క నేటి అర్థం.అభివృద్ధి కావాలి. కానీ అభివృద్ధి పేరుతో ప్రకృతిని కోల్పోతే ఆ అభివృద్ధి ఎవరి కోసం? చెట్టు నరికితే నీడ, గాలి, పక్షుల గూడు మాత్రమే కాదు.. భవిష్యత్తు తరానికి ఒక సంపద తగ్గుతుంది.
నీరు, నేల, గాలి, చెట్లు మన తరువాత కూడా ఉండాలి.అందుకే “గాంధీజీ మళ్లీ రావాలి” అని కోరుకునే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన మళ్లీ ఎందుకు పుట్టాలి? మన రాజకీయాల్లో ధర్మం తీసుకురావడానికా? మనం నిజాయితీగా ఉండలేమా? ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఆయన మళ్లీ రావాలా? మనం ప్రశ్నించలేమా? ఓటును నిజాయితీగా వినియోగించ డానికి ఆయన మళ్లీ రావాలా? ఆ బాధ్యత మనది కాదా?
విద్యార్థిలో సత్యం పుడితే ఒక అబద్ధం తగ్గుతుంది. తల్లిదండ్రిలో బాధ్యత పుడితే ఒక కుటుంబం బలపడుతుంది. సమాజంలో స్పందన పుడితే బాధితుడికి అండ లభిస్తుంది. రాజకీయంలో జవాబుదారీతనం పెరిగితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రకృతిపై బాధ్యత పెరిగితే రేపటి తరానికి ఊపిరి మిగులుతుంది. రేపు విగ్రహాలపైపడే పూలు వాడిపోతాయి. కానీ మన ఇంట్లో ఒక నిజం పుడితే? పిల్లవాడితో ఫోన్ పక్కన పెట్టి మాట్లాడితే? ఒక అన్యాయాన్ని చట్టబద్ధంగా ప్రశ్నిస్తే? ఒక మొక్క నాటి పెంచితే? ఒక ఓటును నిజాయితీగా వినియోగిస్తే? అప్పుడు గాంధీ జయంతి క్యాలెండర్లోని తేదీ కాదు.. మన జీవితంలో ఒక మార్పు.గాంధీజీ తన పని చేశారు. సత్యం, అహింస, సత్యాగ్రహం, బాధ్యతతో కూడిన జీవన మార్గాన్ని చూపించారు. ఇక ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత మనది. గాంధీ మళ్లీ పుట్టాల్సిన అవసరం లేదు.. మనలోని గాంధీ మేల్కొంటే చాలు. ఆయన చేయాల్సింది ఆయన చేశారు. ఇప్పుడు చేయాల్సింది మనమే.
శ్రీశైలం దూడం, 9133947176







కామెంట్లు (0)