తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు-వక్రీకరణలు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 11 సెప్టెంబర్‌ 1946 నుండి 21 అక్టోబర్‌ 1951 వరకు ఐదు సంవత్సరాల నెల రోజుల పాటు సాగింది. సుశిక్షితులైన నిజాం సేనలకు, భారత సేనలకు, జమిందారీ ప్రయివేట్‌ సైన్యంతోపాటు రజాకార్ల సైన్యాలకు వ్యతిరేకంగా వ్యవసాయం చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు సాగించిన చారిత్రక పోరాటం. ఈ పోరాటానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. పోరాట సందర్భంగా ఉనికిలోలేని పార్టీలు, నాయకులు నేడు ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ తమ పాత్రను అందులో జోడించు కుంటున్నారు. విముక్తి, విద్రోహం, విమోచన అంటూ వక్రీకరణలు చేస్తున్నారు. ముస్లింల నుండి హిందువులు విముక్తి పొందారని కొందరు, పోరాటాన్ని విరమించడం ద్వారా విద్రోహం జరిగిందని కొందరు, బంధనాల నుండి విమోచనం పొందామని కొందరు టన్నుల కొద్దీ వక్రీకరణలు చేస్తూ, ఆత్మానందం పొందుతున్నారు. వాస్తవ పోరాట వారసులను చిన్నచూపు చూస్తున్నారు.
వాస్తవంగా జరిగిందేమిటి?
230 సంవత్సరాల అసప్‌జాహిల పాలనలో నాటి తెలంగాణలోని ప్రజలు అనేక భాదలు పడ్డారు. హిందూ, ముస్లిం ప్రజలను హిందూ జమీందార్లు, ముస్లిం రాజులు, రజాకార్లు కలిసి ప్రజలపై భౌతిక దాడులు, ఆర్థిక దాడులు చేశారు. 10వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ 1911లో అధికారానికి వచ్చి 1948 సెప్టెంబర్‌ 17న రైతాంగ సాయుధ పోరాటంతో పదవీచ్యుతుడైనాడు. ఈ నిజాం కాలంలోనే మరాఠాలతో జరిగిన యుద్ధంలో అంగ్లేయుల సహకారం పొందినందుకు వారికి మచీలిపట్నం నుండి గుంటూరు వరకు గల ప్రాంతాన్ని ధారాదత్తం చేశాడు. ఆ తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ నాలుగు జిల్లాలను దత్త మండలాలుగా ఇచ్చివేశాడు. మిగిలిన 16 జిల్లాలతో నిజాం ప్రభుత్వం కొనసాగింది. ఇందులో 5 జిల్లాలు మహారాష్ట్రకు చెందినవికాగా, 3 జిల్లాలు కర్నాటకకు చెందినవి. 5.30 కోట్ల ఎకరాలలో రైతులకు 3కోట్ల ఎకరాలకు పట్టాలివ్వగా, 1.5 కోట్ల ఎకరాలు జమీందార్ల స్వాధీనంలో, 55 లక్షల ఎకరాలు నిజాం స్వంత అస్తి (సర్పెఖాస్‌)గా ఉన్నాయి. గ్రామాలలో విపరీతమైన వెట్టిచాకిరి కొనసాగింది. జమీందార్లకు తాము పండించిన పంటలతోపాటు గొర్రెలు, మేకలు, కోళ్లు, తేనె ఉచితంగా ఇచ్చేవారు. చివరికి వారి అడపిల్లలను జమీందార్ల కుటుంబాలకు ‘అడబాప’లుగా పంపించాలి. పండిన పంట మొత్తం అమ్ముకున్నప్పటికీ శిస్తులకు కావాల్సిన ఆదాయం వచ్చేది కాదు. జమీందారు భూములను, నిజాం భూములను మొదట సాగు చేసిన తరువాతనే రైతులు తమ భూములు సాగు చేసుకోవాలి. శిస్తు వసూళ్ళలలో తీవ్ర నిర్భంధం, హింస కొనసాగేది. ఈ పరిస్థితులలో ప్రజలు అనేక గ్రామాలలో తిరుగుబాట్లు చేశారు.
రష్యాలో కమ్యూనిస్టుల ప్రభుత్వం… తెలంగాణపై ప్రభావం
1914లో రష్యాలో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. దాని ప్రభావం తెలంగాణ ప్రజలపై పడింది. 40శాతం తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నప్పటికీ ఉర్ధూ, మరాఠి మాత్రమే మాట్లాడేవారు. చదువు కోవడానికి పాఠశాలలు లేవు. శిస్తులు చెల్లించనందుకు ‘ఖారజ్‌ఖాత’ పేరుతో భూములు ప్రభుత్వానికి ఇచ్చి కూలీలుగా పనిచేసేవారు. తెలుగుభాష విస్తరణ కోసం ఆంధ్ర జన సంఘం పేరుతో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన గ్రంధాలయ సంస్థను ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి ఏటా కమిటీని ఎన్నుకునేవారు. వామపక్ష భావాలు కలిగిన రావి నారాయణరెడ్డి 11వ ”ఆంధ్ర జనసంఘం” వార్షికోత్సవ ఎన్నికలలో గెలిచారు. దీంతో మితవాదులు వేరే సంఘం పెట్టుకున్నారు. రావినారాయణరెడ్డి గెలిచిన తరువాత అనేకమంది సంఘంలో సభ్యులుగా చేరారు. అందులో ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి సంఘంలో చేరి తమ భూములను పేదలకు పంచిపెట్టారు. 1934లో తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చలసాని జగన్నాదరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు నాయకత్వన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1936 ఏప్రిల్‌ 11న అఖిల భారత కిసాన్‌సభ ఏర్పడి ”దున్నేవానికే భూమి” నినాదాన్ని ఇచ్చింది. 1939 డిసెంబర్‌ 13న తెలంగాణలో ముగ్ధుం మొహియిద్దీన్‌, అలంకుంద్‌ మీరి, ఇబ్రహిం, ముర్తుజా హైదర్‌, రాజ్‌బహుదూర్‌ గౌర్‌ నాయకత్వన ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ ఏర్పడింది. ఈ అసోసియేషన్‌ తరువాత అనేక భూ పోరాటాలు సాగాయి. అనేక గ్రామాల్లో ”సంఘం” ఏర్పడి పనిచేసింది. ప్రభుత్వ భూము లతోపాటు భూస్వాముల భూములు అక్రమించిన ప్రజలలో ముఖ్యలు ఆరు పైసలు చెల్లించి సంఘ సభ్యత్వం పొందారు. ఈ సంఘానికి భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు కూడా నాయకత్వం వహించారు. 1941లో పెరవల్లి వెంకటరమణయ్య కార్యదర్శిగా, ఎ.గురవారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంక టేశ్వరరావు తదితరులు తెలంగాణ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. కిసాన్‌ సభతోపాటు, ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టులు ఉద్యమానికి భౌతికంగా, ఆర్థికంగా సహకరించారు. ఈ పోరాటాన్ని అణచడానికి ఔరంగాబాద్‌కు చెందిన అడ్వకేట్‌ ఖాశీం రజ్వి నాయకత్వన 60వేల మంది కిరాయి సైనికులు, రజాకార్లు నిజాంకు తోడ్పాటు అందించారు.
ఐలమ్మ తిరుగుబాటు… దొడ్డి కొమరయ్య మరణం
జనగామ ప్రాంతంలోని పాలకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ స్వంత భూమితోపాటు కౌలుకు భూమి తీసుకొని వరి పంట పండించింది. ఏపుగా పెరిగిన పంటను చూసిన జమీందారు విసునూరు రామచంద్రారెడ్డి పంటను ఎత్తుకెళ్ళడానికి గూండాలను పంపాడు. అప్పటికే ఆ గ్రామంలో ఉన్న భీంరెడ్డి నాయకత్వాన చల్ల ప్రతాపరెడ్డి, కె రాంచంద్రారెడ్డి, గంగుల సాయిరెడ్డి మరో 30మంది కలిసి గూండాలను తరిమివేసారు. ధాన్యం తీసుకెళ్ళకుండా అడ్డగించారు. దీనిని ఉత్సాహంగా భావించిన ప్రజలు ఊరేగింపు చేశారు. విసునూరు గ్రామ పరిసరాలలోకి రాగానే జమీందారు గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. ముందుపీఠిన ఉన్న దొడ్డి కొమురయ్య నెలకొరిగారు. ఈ మరణం పోరాటాన్ని ఉధృతంగా మలిచింది. ప్రజలు మరింత ఉద్రిక్తులై జమీందారు ఇంటిపై దాడి చేశారు. శవంతో ఊరేగింపు చేశారు. అప్పటినుండి రెండు మాసాలపాటు 300 గ్రామాలలో జమీందార్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. భూములు ఆక్రమించారు. నిజాం సైన్యాన్ని, రజాకార్లను, జమీందార్ల గుండాలను తరిమితరిమి కొట్టారు. ప్రజల నిరసన తీవ్రతను గమనించి కమ్యూనిస్టు పార్టీ, 11 సెప్టెంబర్‌ 1946న ‘సాయుధ పోరాటా’నికి పిలుపునిచ్చింది. నాటినుండి పోరాటం మరింత ఉధృతమైంది. హిందూ, ముస్లిం, దళిత, గిరిజన, వెనకబడిన రైతులు కలిసి జమీందార్లకు, నిజాంకు వ్యతిరేకంగా వర్గ పోరాటం ప్రారంభించారు. పోరాటం ప్రారంభమైన 11 మాసాలకు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. నిజాం ప్రాంతానికి మాత్రం రాలేదు. స్వాతంత్య్రం అనంతరం కూడా 13 మాసాలపాటు పోరాటం సాగుతూనే ఉంది. 1500 మంది మరణించారు. ఈ పోరాటాన్ని నిజాం అణచలేదని భావించిన కేంద్రం 1948 సెప్టెంబర్‌ 13న సైన్యాలను పోరాట కేంద్రాలకు పంపింది. సైన్యాల రాకతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి నైజాంను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. సెప్టెంబర్‌ 17న భారత పతాకాన్ని హైదరాబాద్‌లోని బొల్లారంలో సైన్యాధిపతి జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన ఆవిష్కరించారు. నిజాంను భారత ప్రభుత్వం ‘రాజ్‌ప్రముఖ్‌’గా ప్రకటించింది. రాజ్‌ప్రముఖ్‌ పదవికి ప్రజలు నిరసన తెలిపి నప్పటికి 1950 జనవరి 26 వరకు కొనసాగించారు. సైన్యం రాష్ట్రంలోనే ఉండి కమ్యూనిస్టులను అణిచివేయ డానికి వారిపై అత్యంత క్రూర హింసాకాండ సాగించాయి. తిరిగి జమీందార్లకు భూములు అప్పగించే ప్రయత్నం చేశాయి. ఈ పోరాటాన్ని అణిచివేయడం సాధ్యం కాదని భావించిన కేంద్ర నెహ్రూ ప్రభుత్వం, తెలంగాణలో ప్రజలు అక్రమించిన పది లక్షల ఎకరాల భూములకు ‘రక్షిత కౌలుదారీ చట్టం’ తెచ్చింది. భూముల నుండి తొలగించనని ప్రకటించింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి కూడా వీలులేదు. ఈ చట్ట ప్రకటనతో 1951 అక్టోబర్‌ 21న ‘సాయుధ పోరాటాన్ని’ విరమిస్తూ కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. సైన్యంతో జరిగిన పోరాటంలో రెండు వేల ఐదు వందల మంది నాయకులు మరణించారు. మొత్తం నాలుగు వేల మంది అమరులయ్యారు. మూడు వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.
సాయుధ పోరాటంపై వక్రభాష్యాలు
పోరాటం ప్రారంభమైనప్పటినుండీ హిందూ జమీందార్లకు, ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా ముస్లింల నాయకత్వాన ఏర్పడిన కామ్రేడ్స్‌ అసోసియేషన్‌, కమ్యూనిస్టుపార్టీ, కిసాన్‌సభ నాయకత్వాన ప్రజలు ఐదు సంవత్సరాల ఒక మాసం సుదీర్ఘకాలం పోరాటం కొనసాగించారు. ఈ పోరాటంలో కుల, మతాలకు తావులేదు. రెండు పక్షాలలో హిందూ, ముస్లింలు ఉన్నారు. బందగి, షోయబుల్లా ఖాన్‌ (విలేకరి)తో సహా అనేకమంది ముస్లింలను చంపివేశారు. పోరాటంలో హిందూవులతో పాటు ముస్లింలు, మరాఠీలు కూడా పాల్గొన్నారు. అన్ని కులాలవారు ఒకే వేదికపై వచ్చి వర్గపోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఒక కులం, మతం ఓటమి, మరో కులం, మతం గెలుపు అనేది లేదు. సాయుధ పోరాటం ముగిసిన 1951 అక్టోబర్‌ 21న బీజేపీ మాతృక అయిన ‘జన సంఘం’ ఏర్పడింది. ఈ పోరాటంతో జన సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. 1925 సెప్టెంబర్‌ 25న ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా పోరాటంతో సంబంధం లేదు. అలాంటివారు నేడు విముక్తి ఉత్సవాలు జరుపుతామంటూ ప్రకటించడం నిరసించదగినది. ప్రజా వర్గ పోరాటానికి మతం రంగు పులిమి అపవిత్రం చేసే ప్రయత్నాలను ఖండించాలి. పోరాటం ఫలితంగా నైజాం ప్రజల కోరిక మేరకు భారతదేశంలో విలీనమైంది. జాతీయ కాంగ్రెస్‌ కూడా నైజాం ప్రభుత్వం కొనసాగడానికే అనుకూలంగా ఉన్నట్లు చరిత్ర చెపుతున్నది. సుశిక్షితులైన సైన్యాలతో జరిగిన పోరాటంలో ప్రజలు చేసిన పోరాటం మహత్తరమైంది. నాటి పోరాట నాయకులు తమ భూములను పేదలకు పంచి నాయకత్వం వహించారు. ఈ పోరాటాన్ని వక్రీకరించడం ద్వారా బీజేపీ తన కుటిలబుద్ధిని ప్రదర్శించుకుంటుంది. భారతదేశ చరిత్రనే మార్చాలని చేసే ప్రయత్నాల్లో ఇది ఒక భాగమే. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెపుతారు.

సారంపల్లి మల్లారెడ్డి
9490098666 

 

Spread the love