Sunday, August 2, 2026
E-PAPER
Homeదర్వాజఓ జర్నలిస్టు జీవితసారం

ఓ జర్నలిస్టు జీవితసారం

- Advertisement -

ఏదో ఓ రంగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి తనకు ఎదురైనా ఆటుపోట్లు, గెలుపోటములు వివరిస్తూ పుస్తకం రాస్తే అది ఎవరిదైనా.. ఎవరికైనా ఉపయోగపడేదే. అది రచనా రంగానికి చెందిన వారిదైతే మరీ మంచిది. ఈ మధ్య కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు తన పాత్రికేయ జీవితానుభవాలను విపులీకరిస్తూ ‘విపుల, చతుర, నేను’ మరియు ‘ఒక నేను, ఒక కెనడా’ అనే జోడు పుస్తకాలు రాశారు. వృత్తి పరంగా రచయిత ఎన్ని కాల్పనిక, వాస్తవిక రచనలు చేసినా తన గురించి తాను రాసుకోవడం ఓ పరీక్షనే. జరిగిన కథలా అంతా చెప్పుకోవాలి. ప్రస్తావనలో మంచీ చెడూ ఉంటాయి. అచ్చయ్యాక అయ్యో అనుకుంటే కుదరదు. అయితే ఇన్ని పట్టింపులు ఉంటే అది నా ఆత్మకథ ఎలా అవుతుంది, రాసిన తృప్తి నాకెలా మిగులుతుంది, అయ్యేదేదో అవుతుందిలే అన్నట్లుగా రాఘవేంద్రరావు తన రాతకు ఎలాంటి ఫిల్టర్లు వాడలేదు. ఎవరి అనుభవాలు, అభిప్రాయాలు, అధికారాలు వారివి. ఇదంతా చదివేప్పుడు ఔనా అనుకోవడం లేదా రచయితపై సానుభూతి చూపడమే పఠితుని పని. పుస్తకంగా రాక ముందు ఇదంతా రచయిత ఫేస్ బుక్ లో రాసుకున్న జ్ఞాపకాల పరంపర. ఎన్నో ఎదురీతల మధ్య గుప్పెడు విజయాల గాథగా వీటిని పేర్కొనవచ్చు. విషయం కన్నా విస్తారంగా.. రచనా కౌశల్యం భిన్న రంగుల్లో, విభిన్న రూపాల్లో అభినయం చేస్తుంది.

రచయిత కథన శైలీ సొగసులు పుస్తకమంతా పరచుకొని విషయాన్ని రసరమ్యంగా మార్చాయి. రచయిత భాషణా భంగిమలు సాధారణ పాఠకుల్ని కూడా పట్టుకొని కూచోబెడుతాయి. తన గోడును ఆసక్తిగా పేజీలు తిరిగేయించే రీతిలో చెప్పడంలో రచయిత గెలుపు సాధించారు. చదవడం మొదలు పెట్టినవారు ‘రచయిత మనోవాంఛ సిద్దిస్తుందా.. లేదా’ అనే ఆసక్తితో పడిపోతారు. ఉపవాచకంలా సాగే ఆత్మకథల ధోరణికి భిన్నంగా.. పాఠకులకు రిలీఫ్ నిచ్చే ఇదో కొత్త బాట. రాఘవేంద్రరావు రెండేళ్ల పాటు ఈనాడు జంట పత్రికలైన విపుల, చతురలకు సంపాదకులుగా పని చేశారు. ఆ పీఠాన్ని అధిరోహించడానికి ఆయన పడిన శ్రమ, ఆయనకు ఈ కార్యం కట్టబెట్టాలా వద్దా అని యాజమాన్యం పెట్టిన పరీక్షలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తాయి. ఆ పత్రికల కోసం ఆయన పనిచేసిన (2005 – 07) కాలమంతా నీరసించిన వాటికి పునరుజ్జీవం పోయడానికి ఎలా వినియోగించారో వివరించారు. 300 పేజీల ‘విపుల చతుర, నేను’లో సుమారు 130 పేజీల్లో ఈ పత్రికలకు చెందిన బహు ఆసక్తికర సన్నివేశాలు చదవచ్చు. ఈ రచయిత చతుర, విపులల కోసం బుర్ర బద్దలు కొట్టుకొని చేపట్టిన మార్పులు, చేర్పులు, ప్రయోగాలు, ఫలితాలు వెరసి ఆ పత్రికకు కొత్త గుర్తింపు, సర్క్యులేషన్‌ రెట్టింపు దక్కాయి.

అదో విజయమైతే, అందుకు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కథ ఇవ్వండి అనడిగితే ఓ ప్రసిద్ధ రచయిత్రి ఏమన్నదీ.. కథల, నవలల పోటీలో ఎంపిక కాని రచనల కర్తలు ఎలా నిలదీసిందీ ఇందులో చూడొచ్చు. నవల కుదింపు, సూచించిన మార్పులను మీరే చేసుకోండని తన పైనే తోసేసిన రచయితల ఉదంతాలున్నాయి. రచయిత ఈ చర్చలో కసిగా కొన్ని పేర్లు పేర్కొనగా, మరి కొన్ని సర్వనామాలు, విశేషణల్లో దాచారు. ‘విపుల, చతుర’ పోను ‘నేను’లో కవిగా రాఘవేంద్రరావుకు 2006 లో ఆకాశవాణి తరపున జాతీయ కవి సమ్మేళనంలో దొరికిన గౌరవావకాశం, దానికి వెళ్లేందుకు పడిన పాట్లు మరో ప్రధాన అంశం. మొదటి పుస్తకంలోనే కెనడా హింట్ ఇచ్చి వదిలేశారు. రెండోదైన ‘ఒక నేను, ఒక కెనడాలో నిజంగానే ఆ రెండే ప్రధానం. అంతా ఓ మోనోలాగ్ లా సాగుతుంది. కెనడా ప్రభుత్వ విధానాలు, ప్రజల జీవన పరిస్థితులు.. ఈ రెంటి మధ్య రచయిత నుగ్గయిన తీరు కలిసి పరాయి నీడ సంక్లిష్ఠతలను ముందుంచుతుంది.

పరదేశం వెళ్లినా.. ఇక్కడా అక్కడా కొన్ని కుదరక, కొన్నింటిలో కుదురుకోలేక వీరు తృప్తి దొరికిన సందర్భాలు కొన్నే.సుమారు 40 ఏళ్ల జర్నలిస్ట్ రైటర్ పయనమంతా ఇష్టంగా ఎక్కిన బండిలో ఇరుక్కొని పడిన అగచాట్లే ఈ రచనల్లో కనబడతాయి. రచయిత తన ప్లస్ లు, మైనస్ లు బాహాటంగా చర్చించారు. అన్నిటికి తానే మార్కులు వేసుకున్నారు. సుమారు యాభై ఏళ్ల క్రితం ‘యువ’లో కొడవటిగంటి కుటుంబరావు గారు ‘కొడకా.. జర్నలిస్టు అవకు’ అనే నెగెటివ్ వ్యాసం రాశారు. ఆయన అన్నట్లుగా జర్నలిజానికి బతుకంతా ధారపోసి చారెడు తృప్తిని మూటగట్టుకున్న జీవితాలెన్నో! కొ. కు. తర్వాతి తరం పత్రికా రచయిత రాఘవేంద్రరావు అదే విషయాన్ని ఈ రెండు పుస్తకాల్లో ప్రాక్టికల్ గా చెప్పారు.

బద్రి నర్సన్ 9440128169

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -