– సత్తుపల్లిలో ‘పెన్ డౌన్’ కార్యక్రమాన్ని చేపట్టిన ఉద్యోగులు
నవతెలంగాణ – సత్తుపల్లి
వీబీ-జీ రామ్-జీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మండల పరిధిలోని ఉద్యోగులు శనివారం ‘పెన్ డౌన్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీబీ-జీ రామ్-జీ ఉద్యోగులు మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కోరారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు తగిన ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మండల పరిధిలోని ఉద్యోగులందరూ ఏకమై ఈ ‘పెన్ డౌన్’ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ విన్నపాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఎం. బాబు, ఈసీ ఎం. నాగశ్రీను, టీఏలు ఆర్. విజయలక్ష్మి, జి. వీరభద్రం, ఎం. వెంకటేశ్వరావు, సీఈవోలు డి. రాంబాబు, కే. సత్యనారాయణ పాల్గొన్నారు.



