పింఛన్ రూ.4 వేలు..ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు ఏమాయే?
ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలి…ఆగస్టు 2 నుంచి 18 వరకు…
అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట రమణ
మహబూబాబాద్‌లో ఘనంగా యాత్ర ప్రారంభం
నవతెలంగాణ- మహబూబాబాద్
కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుంచి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకట రమణ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని ఆర్తి గార్డెన్‌లో వెంకట రమణ అధ్యక్షతన ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. గీతన్నల బస్సు యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ… పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని, ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు నెల రోజులలోపే ఇస్తామన్న హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. వృత్తిలో ప్రమాదాలు జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియా రూ.20కోట్లను అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఇవ్వలేదని విమర్శించారు. 50 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కొత్తగా ఎవరి దరఖాస్తులూ స్వీకరించడం లేదని తెలిపారు. తాము కొత్తగా కోరికలు ఏమి కోరడం లేదనీ, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించి వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు.అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం ఇస్తుందని, కానీ రాష్ట్రంలో సభ్యత్వం కలిగిన వాళ్లు 2 లక్షలా 30వేల మంది ఉండగా కేవలం 30వేల మందికే ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదెకరాల చొప్పున భూమి ఇవ్వాలని కోరారు. నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నా రు. నందనంలోని నీరా ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో నీరాకు కేటాయించిన రూ.25 కోట్లు, సంక్షేమానికి కేటాయించిన రూ.67కోట్లు వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ యాత్ర నిర్వహిస్తుట్టు తెలిపారు. అనంతరం గార్డెన్ నుంచి బస్టాండ్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్, హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ, సుప్రజా ఆస్ప్రతి మేనేజింగ్ డైరెక్టర్ శిగ విజయ్ కుమార్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీనివాస్, కేజీకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌనీ వెంకన్న, యమగాని వెంకన్న, బిక్కి వెంకటేశ్వర్లు, 36వ వార్డ్ కౌన్సిలర్ ముత్యం ఎంకన్న, గునిగంటి రానున్న, కమలాకర్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గాడిపెల్లి శ్రీనివాస్, జేరుపోతుల వెంకన్న, గండి వీరేందర్, బండి దీపక్, బబ్బూరి ఉప్పలయ్య, మోడం వెంకటేశ్వర్లు, పానుగంటి వీరస్వామి, మొగుళ్ళ యాకన్న, గుండా గాని లింగన్న దిగుండ మధు పాల్గొన్నారు.



