ప్రాణం పోసుకున్న పత్తి.. పెరుగుతున్న వరిసాగు.. నాట్లు వేస్తున్న రైతులు..
విస్తరించిన సాగు విస్తీర్ణం
పదిరోజుల్లోనే 23 లక్షల ఎకరాలకు పైగా పెరిగిన పంటలు
నిజామాబాద్‌లో అత్యధికంగా 50 వేల ఎకరాల్లో నాట్లు
ఎల్‌నినో భయం తప్పినట్టేనా..?
ఇంకా పలు జిల్లాల్లో
లోటు వర్షపాతమే
పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలని వ్యవసాయాధికారుల సూచనలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కురుస్తున్న వరుస వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పదిరోజుల క్రితం వరకు ఎక్కడ చూసినా తగ్గిన ప్రాజెక్టుల నిల్వలు, వెలవెలబోతున్న చెరువులు, అడుగంటిన భూగర్భజలాల తో ఆందోళన చెందిన రైతాంగానికి ప్రస్తుత వర్షాలు ప్రాణం పోశాయి. పత్తి పంటకు జీవం వచ్చింది. వరి సాగు పెరిగింది. వ్యవసాయాధికారుల సూచనలతో ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపేందుకు తటపటా యించిన రైతుల్లో ఆనందం వెల్లి విరిసింది. సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అప్పటికే పలు చోట్ల దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉన్న రైతులు అందులో వరి నాట్లు వేశారు. పది రోజుల క్రితం వరకు పది లక్షల వరకే ఉన్న వరి సాగు విస్తీర్ణం.. ఇప్పుడు 23 లక్షల ఎకరాలకు పైగా పెరిగింది. ప్రస్తుత వర్షాలతో దాదాపు 13 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో 132 లక్షల ఎకరాలకు గాను 86 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. పత్తి సాగు మొత్తం విస్తీర్ణంలో 98 శాతానికి పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొన్న నేపథ్యంలోనూ గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వానాకాల పంటల సాగు ఏ మాత్రం తగ్గ లేదు. అధికార వర్గాల లెక్కల ప్రకారం గతేడాది ఇదే సమయానికి 89,16,098 ఎకరాల్లో పంటలు వేయగా.. ఈ సారి మూడు లక్షల ఎకరాలు తక్కువగా ఉంది. అయితే ఇప్పటికీ పలు జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. బావులు, ఆయకట్టు పరిసర ప్రాంతాల్లోనే సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావం ఇంకా పోలేదని, పరిస్థితులకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సూచించినట్టు వరికి సంబంధించి ఆరు వరి రకాలనే రైతులు వాడుతున్నారు.
ఎల్‌నినోను పట్టించుకోని రైతాంగం
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయనీ, అందువల్ల వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని ఒకవైపు ప్రభుత్వం, అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తున్న సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో మున్ముందు సైతం అదే విధంగా వర్షాలు కురుస్తాయనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో వరి సాగుకు ఎక్కువ రైతులు మొగ్గుచూపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా 50 వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేసుకోవడం గమనార్హం. దీనికి తోడు ఎస్సారెస్పీకి 16 టీఎంసీల వరద నీరు వచ్చి చేరడంతో సాగునీటికి ఢోకా ఉండదనే భావనతో ఉన్నారు. ఆరుతడి పంటలకు భౌతిక పరిస్థితులు కూడా అడ్డంకిగా మారాయి. ఇదివరకే పొలాలు వరికే అచ్చు కట్టి ఉండటంతో వాటిల్లో ఇతర ఆరుతడి పంటలు వేశాక వర్షాలు కురిస్తే నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంటలు కుళ్లిపోతాయని రైతులు పేర్కొంటున్నారు.
నిజామాబాద్‌లో…
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,54,129 ఎకరాల్లో వివిధ పంటలు సాగువుతాయని వ్యవసాయాధికారులు అంచనాలు రూపొందించారు. కాగా ఇప్పటి వరకు 5,25,843 ఎకరాల్లో పంటల సాగు చేపట్టడం గమనార్హం. అందులో ప్రధానంగా వరి 4,22,454 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. సోమవారం నాటికి ఏకంగా 3,85,051 ఎకరాల్లో అంటే 91 శాతం విస్తీర్ణంలో వరి సాగు ప్రారంభించారు. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. జులై 29 నాటికి వరి 3.35 లక్షల ఎకరాల్లో సాగవ్వగా.. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో ఏకంగా నాలుగు రోజుల వ్యవధిలో 50 వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేయడం గమనార్హం. మొత్తం విస్తీర్ణంలో సైతం 70 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 5.59 లక్షల ఎకరాలు కాగా.. అందులో వరి 3.20 ఎకరాల్లో సాగవుతున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇక్కడ సైతం ఇప్పటి వరకు 2.53 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తవ్వగా.. మొత్తం విస్తీర్ణంలో ఇప్పటి వరకు 4,85,238 ఎకరాల్లో వివిధ పంటలు సాగు ప్రారంభించారు. ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఆరుతడి పంటలకు ముందు నుంచి రైతులు ప్రాధాన్యత ఇస్తుంటారు. దీంతో మొక్కజొన్న 46 వేలు, కందులు 48 వేలు, సోయా 87 వేలు, పత్తి 45 వేల ఎకరాల మేర సాగవుతుంది.
కొన్ని చోట్ల పెరిగిన ప్రత్యామ్నాయ పంటలు
కుమురంబీం, ఆసిరాభాద్, మంచిర్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు జిల్లాల్లో అధిక వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ , నాగర్‌కర్నూల్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదల వల్ల ప్రాజెక్టుల్లో నీరు చేరడం వల్ల వర్షపాతం తక్కువ ఉన్న ఏరియాల్లోనూ పంటలు సాగు చేస్తున్నారు. కందులు, మక్కలు, మినుములు, కూరగాయల, సోయాబీన్, కూరగాయల సాగు కొన్నిచోట్ల పెరిగింది, అయితే తాము ఆశించిన విధంగా పెరగలేదని అధికారులు చెబుతున్నారు. కోతుల బెడద వల్ల కూడా కొన్ని రకాల పంటలు వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని అంటున్నారు. మొత్తం మీద ఎల్‌నినో భయపెట్టినా, వర్షాలు ఆలస్యంగా కురిసినా, రాష్ర్ట రైతాంగం నాగలిపట్టి పొలంలోకి వెళ్లేందుకే సిద్ధమవడం విశేషం.
తగ్గిన భూగర్భ జలాలు
రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలకు 14 మండలాల్లో భూగర్భజలాలు తగ్గాయి. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తలకొండపల్లి, శేరిలింగంపల్లి, చేవెళ్ల, చౌదరిగూడెం, అబ్దుల్లాఘర్‌మెంట్, తదితర మండలాల్లో ఇంకా భూగర్భజలాలు లోతుగానే ఉండటం గమనార్హం.
నిండిన చెరువులు
జగిత్యాలలో 729 చెరువులకు గాను మత్తడి పారుతున్నవి 324 చెరువులు, పూర్తిగా నిండినవి 130 చెరువులు, సగానికి పైగా నిండిన చెరువులు 118. గత వారం వరకు 25 శాతం చెరువుల్లో నీరు లేదు అని అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లాలో గత వానాకాలంలో వరి 1,98, 482 ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఇప్పటివరకు సాగైంది 57, 928 ఎకరాలు. గత ఏడాది అన్ని పంటలు 2,82, 130 ఎకరాల్లో సాగయ్యాయి. ప్రస్తుతం లక్ష ఎకరాలకు పైగా సాగైంది. అయితే ఇక్కడ వర్షపాతం తక్కువ పడింది.
ముదురునారు వేయొద్దు
వర్షాలు కురిసిన తర్వాత నాట్లు వేద్దామని పలువురు రైతులు భావించి నారు మడులు వేసుకొని ఎదురుచూడగా.. ఇటీవల వర్షాలతో నాట్లు వేస్తున్నారు. అయితే ముదురు నారుతో నాట్లు వేయొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ముదురు నారుతో వరికి చీడపీడల బెడద పెరిగే అవకాశం ఉంటుందని, ఒక వేళ అలానే వేయాల్సి వస్తే నారు కొనలు కత్తిరించాలని సూచిస్తున్నారు. నారు కొనల మీద ఉండే చీడపీడలు గుడ్లు పెట్టుకొని ఉండే అవకాశం ఉంటుందని, వాటిని కత్తిరిస్తే వాటి బెడద తగ్గే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. బోరుబావుల ఆధారంతో వరి సాగు చేపట్టే రైతులు.. తమ గ్రామాల్లోని చెరువులు పూర్తిస్థాయిలో నిండితేనే నాట్లు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఎస్సారెస్పీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 16 టీఎంసీల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(85.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1075 అడుగుల 33.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఊపిరిపోసిన వానలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



