Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజానపదం లేకుండా తెలంగాణ లేదు

జానపదం లేకుండా తెలంగాణ లేదు

- Advertisement -

తెలంగాణ జానపద కళలకు ప్రత్యేక అకాడమీ లేదు
అంతరించిపోయే దశలో 
అనేక కళారూపాలు: 
ఆద్యకళ వ్యవస్థాపకులు జయధీర్ తిరుమలరావు
జానపద కళల్లోనే సజీవంగా తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి, పల్లె జీవనం :
ద్రావిడ యూనివర్సిటీ 
మాజీ వీసీ పులికొండ సుబ్బాచారి
ఎస్వీకేలో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం
నవతెలంగాణ – ముషీరాబాద్

​​‘తెలంగాణ జానపద అకాడమీ మా హక్కు.. జానపదం లేకుండా తెలంగాణ ఉందా..?’ అని ఆద్యకళ వ్యవస్థాపకులు జయధీర్ తిరుమలరావు ప్రశ్నించారు. హైదరా బాద్‌ ‌బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచినా తెలంగాణ జానపద కళలకు ప్రత్యేక అకాడమీ లేదని, వేలాది మంది కళాకారులకు సమగ్ర సంక్షేమ విధానం కూడా అమలు కావడం లేదని అన్నారు. అంతరిం చిపోతున్న కళారూపాలను సంరక్షించే చట్టబద్ధ మైన వ్యవస్థ లేకపోవడం ఆందోళనకరమని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో వందకు పైగా జానపద కళారూపాలు జీవించి ఉండేవని, ప్రస్తుతం అనేక కళారూపాలు అంతరించిపోయే అంచుకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కళాకారుడు కనుమరుగైతే ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక చరిత్ర, ఒక మాండలికం, ఒక వృత్తి పురాణం, ఒక వాయిద్యం, ఒక సాంస్కృతిక వారసత్వం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుందని చెప్పారు. జానపద కళలను కాపాడటం తెలంగాణ ఆత్మను కాపాడటమేనని తెలిపారు.

ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి, పల్లె జీవనం, గిరిజన సంప్రదాయాలు జానపద కళల్లోనే సజీవంగా ఉన్నాయని తెలిపారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక అకాడమీలు, పరిశోధనా సంస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. జానపద కళారూపాల సంరక్షణ, వృత్తి పురాణాలు, పటం కథలు, మౌఖిక చరిత్ర, సంప్రదాయ వాయిద్యాల డిజిటల్ భద్రత, కళాకారుల నమోదు, సంక్షేమం, యువతకు శిక్షణ, పరిశోధన, మ్యూజియంలు, డాక్యుమెంటేషన్ కోసం తెలంగాణ జానపద అకాడమీ అత్యవసరమన్నారు. సకల కళల జేఏసీ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా ఇప్పటి నుంచే బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు. జానపద కళల పరిరక్షణ అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదని, భారత రాజ్యాంగం కల్పించిన సాంస్కృతిక హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. వలస సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నాయకులు సంకె రాజేష్, నడిమింటి శ్రీనివాస్, కొమురయ్య, దేవేందర్ రావు, పెద్దపల్లి నరసయ్య, దంతాలపల్లి సోమయ్య, జంగిలి లచ్చన్న, శ్రీశైలం శ్రీనివాస్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల జానపద కళాకారులు, పరిశోధకులు, రచయితలు, మేధావులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -