Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగస్టు 24 నుంచి ట్రాన్స్ పోర్ట్ బంద్

ఆగస్టు 24 నుంచి ట్రాన్స్ పోర్ట్ బంద్

- Advertisement -


ఏఐఆర్‌‌టీడబ్ల్యూఎఫ్‌ (‌ సీఐటీయూ)
 రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య
సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

రవాణా రంగ కార్మికులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 24 నుంచి ట్రాన్స్ పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే నిరవధిక సమ్మె లో రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వాహనాల డ్రైవర్లు పాల్గొనాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామని, గ్యారంటీ కార్డులు ద్వారా అమలు చేస్తామని కార్మికులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.15వేలు ఇస్తుంటే, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం మూడేండ్లయినా ఆ పథకాన్ని ప్రారంభించలేదని తెలిపారు. అందుకు సరైన విధానాలు కూడా రూపొందించకపోవడం డ్రైవర్లను మోసం చేయడమేనని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉండి డ్రైవర్ల సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించలేదని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. దీనివల్ల డ్రైవర్ల మీద అదనపు ఆర్థిక భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఫైనాన్స్‌‌లో ఈఎంఐలు కట్టలేక చాలామంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. 30ఏండ్లుగా డ్రైవర్లు సంక్షేమ బోర్డు కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని తెలిపారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ ఓలా, ఊబర్, రాపిడో యాప్‌‌ల ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్ల నుంచి ఇష్టం వచ్చినట్లు కమీషన్లు దండుకుంటున్నారని తెలిపారు. ప్రయివేట్‌ ఆ‌న్‌‌లైన్‌ యాప్ ‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఒక యాప్‌‌ను తీసుకురావాలని‌ డిమాండ్‌ ‌చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతి నెలకు రూ. 4,500 ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం,డ్రైవర్ల హక్కుల కోసం వారి జీవనోపాధిని కాపాడుకోవడం కోసం 24 నుంచి జరిగే సమ్మెలో రాష్ట్రంలోని డ్రైవర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే అజయ్ బాబు, నాయకులు గోపాల్, లింగయ్య, అశోక్, రవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -