Thursday, July 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా-ఇరాన్‌ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షలు

రష్యా-ఇరాన్‌ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షలు

- Advertisement -

ద్వైపాక్షిక బిల్లు వేగవంతానికి సెనెట్‌ ఆమోదం
భారత్‌, చైనాలపై ప్రభావం

వాషింగ్టన్‌ : రష్యా, ఇరాన్‌ దేశాల నుంచి చమురును అధిక పరిమాణంలో కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అధికారాలు కట్టబెట్టే ద్వైపాక్షిక బిల్లును వేగంగా ముందుకు తీసుకుపోవడానికి అమెరికా సెనెట్‌ అంగీకారం తెలిపింది. దీనికి అనుకూలంగా 86 ఓట్లు పడగా కేవలం 12 మంది మాత్రమే వ్యతిరేకించారు. సెనెట్‌ నిర్ణయం భారత్‌, చైనా వంటి ప్రధాన చమురు కొనుగోలుదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వంద మంది సభ్యులున్న సెనెట్‌లో ఈ బిల్లు తేలికగానే ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. ఈ నెల 11న మరణించిన దక్షిణ కరోలినా సెనెటర్‌ లిండ్సే గ్రహమ్‌కు తుది వీడ్కోలు పలికేందుకు సెనెటర్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు అమెరికా పర్యటనలో ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని కలుసుకున్నారు. అనంతరం ఓటింగ్‌ జరిగింది. ఓటు వేసేందుకు సెనెటర్లు వరుసలో నిలబడగా జెలెన్‌స్కీ గ్యాలరీ నుంచి చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందించారు.

మెజారిటీ డెమొక్రాట్ల మద్దతు
రష్యా, ఇరాన్‌ దేశాల నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై…ముఖ్యంగా భారత్‌, చైనాలపై వంద శాతం వరకూ సుంకాన్ని విధించే అధికారం ఈ బిల్లు ద్వారా ట్రంప్‌కు లభిస్తుంది. దివంగత సెనెటర్‌ లిండ్సే గ్రహమ్‌ చాలా కాలం క్రితమే ఈ బిల్లును సభ ముందు ఉంచిన నేపథ్యంలో దానిని ఆయన పేరిటే ముందుకు తెచ్చారు. సెనెట్‌లో బిల్లును ముందుకు తీసుకుపోవడానికి కనీసం 60 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. దాదాపు రిపబ్లికన్లు అందరూ ఈ చర్యను సమర్ధించగా డెమొక్రాట్లలో కూడా మెజారిటీ సభ్యులు వారితో చేతులు కలిపారు.

బిల్లు ఉద్దేశాలు ఇవే
ఈ బిల్లు రష్యా అధికారులు, సంపన్నులు, ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధిస్తుంది. అంతేకాక రష్యా చమురు ఎగుమతులపై విధించే ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించే ‘షాడో ఫ్లీట్‌’పై కూడా ఆంక్షలు విధిస్తారు. అయితే తాము దిగుమతి చేసుకుంటున్న సహజ వాయువులో రష్యా నుంచి దిగుమతులు పదిహేను శాతం కంటే తక్కువగా ఉంటే ఆయా దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. రష్యా నుంచి సహజ వాయువు దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నించే దేశాలకూ మినహాయింపు వర్తిస్తుంది. ఇరాన్‌ ఇంధన, ఆయుధ రంగాలకు నిధులు అందకుండా అమెరికా ప్రస్తుతం విధిస్తున్న ఆంక్షలు కొనసాగుతాయి. కాగా బిల్లు అధ్యక్షుడి వద్దకు చేరుకోవాలంటే సెనెట్‌లో, ప్రతినిధిసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రతినిధిసభ సభ్యులు వేసవి విరామం కోసం వాషింగ్టన్‌ చేరుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ లోగా ఈ బిల్లు పరిశీలనకు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -