డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్ష
నవతెలంగాణ-మంచాల
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉన్నత విద్యను అభ్యసించినా వారికి ఉద్యోగాలు రాకపోవడంతో భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లు గడిచినా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 12 ఏండ్లు గడిచినా ఉద్యోగాలు కల్పించకుండా మాయమాటలు చెబుతూ యువతను మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. మెక్ ఇన్ ఇండియా పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేయడం తప్పా కొత్త రిక్రూట్‌మెంట్స్ లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఉద్యోగాలు, రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందించడంలో పూర్తిగా విఫలవడంతో.. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. కేవలం 7వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 9 వేల మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారని, ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువత లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే.. వారి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతోందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ నెల 20న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, కందుకూరి జగన్, జిల్లా కమిటీ సభ్యులు చాతల్ల జంగయ్య, సీహెచ్ బుగ్గరములు, పెరుమాండ్ల అంజయ్య, రావుల జంగయ్య, డి.కిషన్, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ్, నాయకులు విజయమ్మ, ఇందిరా, ఆనంద్, చినమోనీ శంకర్, నర్సింహ, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు జంగయ్య, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి గజ్జల మహేష్, మంచాల మండల కార్యదర్శి ఈరమళ్ళ శివకుమార్, ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వంశీ, ఏర్పుల తరంగ్, శ్రీకాంత్, మణి, బన్నీ, రాంచరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



