Sunday, August 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆకాశంలో పవన విద్యుత్‌

ఆకాశంలో పవన విద్యుత్‌

- Advertisement -

చైనా మరో సంచలన ప్రయోగం
ఎస్‌4000 ‌వ్యవస్థ పరీక్ష విజయవంతం
స్వచ్ఛ ఇంధన రంగంలో సాంకేతిక మైలురాయి

బీజింగ్‌ : స్వచ్ఛ ఇంధన రంగంలో చైనా మరో కీలక సాంకేతిక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎస్‌4000 స్ట్రాటోస్ఫియర్‌ ఎయిర్‌బోర్న్‌ విండ్‌ ఎనర్జీ సిస్టమ్‌ (ఎస్‌ఏడబ్ల్యూఈఎస్‌)ను వాయువ్య చైనాలోని ఒక పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించిందని ‘గ్లోబల్‌ ‌టైమ్స్‌’ వెల్లడించింది. గాలితో విద్యుత్‌ ఉత్పత్తి చేయడంలో ఇప్పటివరకు ప్రధానంగా భూమిపై ఏర్పాటు చేసే భారీ విండ్‌ టర్బైన్లే ఉపయోగంలో ఉన్నాయి. అయితే ఎస్‌4000 విధానం అందుకు భిన్నం. నేలపై భారీ టర్బైన్‌ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా గాల్లో ఎగిరే పరికరాన్ని ఉపయోగించి అధిక ఎత్తులోని గాలిశక్తిని విద్యుత్‌గా మార్చే విధానాన్ని ఇది అనుసరిస్తుంది.

పరీక్షలో అన్ని దశలూ విజయవంతం
ఎస్‌4000 పరీక్షలో వ్యవస్థను పైకి ఎగరేయడం, నిర్దిష్ట ఎత్తులో స్థిరంగా ఉంచడం, విద్యుత్‌ ఉత్పత్తిని పరీక్షించడం, అనంతరం సురక్షితంగా తిరిగి తీసుకురావడం వంటి మొత్తం ప్రక్రియను పరిశీలించారు. క్లిష్టమైన, తీవ్రమైన అధిక ఎత్తు వాతావరణ పరిస్థితుల్లోనూ వ్యవస్థ విశ్వసనీయంగా పనిచేస్తుందా అన్నది ఈ పరీక్షలో ప్రధానంగా పరిశీలించారు. పరీక్షలో అన్ని సూచికలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు సీసీటీవీ న్యూస్‌ ‌వివరించింది.

ఎస్‌2000కి మరింత శక్తివంతమైన రూపం
ఎస్‌4000కు ముందు అభివృద్ధి చేసిన ఎస్‌2000 వ్యవస్థకు ఇది అప్‌గ్రేడ్‌ వెర్షన్‌. కొత్త కాన్ఫిగరేషన్‌తో ఎస్‌4000 మొత్తం పనితీరును గణనీయంగా మెరుగుపరిచారు. దీని గరిష్ఠ ఆపరేటింగ్‌ ఎత్తు 4,000 మీటర్ల వరకు ఉంటుంది. చైనాలోని అత్యధిక ప్రాంతాల్లో దీనిని మోహరించేందుకు ఈ సామర్థ్యం అనుకూలంగా ఉంటుందని సీసీటీవీ న్యూస్‌ ‌నివేదించింది. ఎస్‌4000 మరో ప్రత్యేకత ప్రధాన విద్యుత్‌ గ్రిడ్‌ అవసరాలకు అనుగుణంగా నేరుగా పనిచేసేలా రూపొందించబడటం. అంటే ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సాధారణ గ్రిడ్‌ విద్యుత్‌ సరఫరా అవసరాలకు అనుసంధానించే విధంగా వ్యవస్థను రూపొందించారు. దీనికి గరిష్ఠంగా 20 ఏండ్ల డిజైన్‌ ‌సర్వీస్‌ ‌లైఫ్‌‌ను నిర్దేశించినట్టు గ్లోబల్‌ ‌టైమ్స్‌ ‌తెలిపింది.

‘విండ్‌‌మిల్‌’ ‌కాదు.. ఎగిరే విద్యుత్‌ ‌కేంద్రం!
సాధారణంగా మనకు తెలిసిన విండ్‌ ‌పవర్‌ అంటే భారీ టవర్లపై అమర్చిన బ్లేడ్లతో కూడిన విండ్‌ ‌టర్బైన్లు. ఇవి భూమికి సమీపంలోని గాలిని వినియోగిస్తాయి. అయితే ఎస్‌4000 ‌మాత్రం పూర్తిగా భిన్నమైన విధానాన్ని అనుసరిస్తుంది. ఇది ఒక ఎగిరే పరికరాన్ని ఉపయోగించి అధిక ఎత్తులోని గాలిశక్తిని వినియోగించుకునే విధంగా రూపొందించబడింది. గాలిని విద్యుత్‌గా మార్చడం కొత్త విషయం కాకపోయినా.. గాలిని వెతుక్కుంటూ ఆకాశంలోకి వెళ్లి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం మాత్రం స్వచ్ఛ ఇంధన రంగంలో చైనా చేస్తున్న ఆసక్తికరమైన సాంకేతిక ప్రయోగమని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -