నేడు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు
ట్రంప్ పాలనకు రిఫరెండం
అమెరికాలో మరికొద్ది గంటల్లో మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఆ దేశంలో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు దేశాధ్యక్షుడి పనితీరు పైనే తీర్పు ఇస్తారు. అయితే ఈ ఎన్నికలు మరింత అరుదైనవిగా, ముఖ్యమైనవిగా మారే అవకాశం ఉంది. అంతేకాక అవి ఓ కొత్త శకానికి దారి చూపే ఉత్ప్రేరకంగా నిలుస్తాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి, ఆయన వారసత్వానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అవి మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ఉద్యమం పట్టును నిలబెట్టవచ్చు లేదా దాని పతనానికి నాంది పలకవచ్చు. గత అధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని మూటకట్టుకున్న డెమొక్రాట్లకు పునరాగమనాన్ని కలిగించవచ్చు. 2028 అధ్యక్ష ఎన్నికల కోసం ప్రధాన పక్షాలైన రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు సమర శంఖాన్ని పూరించడానికి ఈ ఎన్నికలు తొలి మెట్టుగా ఉపయోగపడతాయి.
వాషింగ్టన్ : పాలనా వ్యవహారాలలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్‌పై కొన్ని రాజ్యాంగ పరమైన నియంత్రణలు విధించడానికి ఈ మధ్యంతర ఎన్నికలు ఓటర్లకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి. ప్రతినిధుల సభలోనూ, సెనెట్‌లోనూ డెమొక్రాట్లకు ఆధిక్యత లభిస్తే ట్రంప్ విధాన నిర్ణయాల పైన, ఆయన పాలనలో చోటుచేసుకున్న అవినీతి పైన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధ్యక్షభవనంలో ప్రవేశించిన తర్వాత ట్రంప్ కూడబెట్టిన అపార సంపదపై కూడా డెమొక్రాట్లు కూపీ లాగి ఆయనను దోషిగా నిలబెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు సంవత్సరాల ట్రంప్ పాలనపై ఈ ఎన్నికలు రిఫరెండంగా నిలవబో తున్నాయి. ట్రంప్ తన హయాంలో అనేక ప్రభుత్వ విభాగాలను నిర్వీర్యం చేయడా నికి ప్రయత్నించారు. తన రాజకీయ ప్రత్యర్థు లపై కక్షసాధింపు చర్యలు చేపట్టడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విదేశా ల్లో 'అమెరికా ఫస్ట్' అనే జాతీయవాదాన్ని ముందుకు తెచ్చారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్‌తో కలిసి యుద్ధానికి దిగారు. పసిఫిక్, కరేబియన్‌లో అక్రమ రవాణాదారులు అనే ముద్ర వేసి చట్టవ్యతిరేకంగా హత్యలు చేయించారు.
ప్రజాస్వామ్యానికి పరీక్ష
అమెరికా ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్షా సమయమని చెప్పాలి. ట్రంప్ ఇప్పటికే అలాస్కా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణను సవాలు చేశారు. మధ్యంతర ఎన్నికలు నిస్పాక్షికంగా జరిగాయని నమ్మితేనే ఫలితాలను అంగీకరిస్తానని చెప్పారు. 2020 ఎన్నికలను రద్దు చేసేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను ఈ వ్యాఖ్య గుర్తుకు తెస్తోంది. దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, గృహవసతి, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. తమ ఉద్యోగ భద్రతపై ఏఐ చూపే ప్రభావం కూడా వారిలో ఆందోళనను పెంచుతోంది. ఇలా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజానీకానికి ఆయన ఎన్నికల ప్రసంగాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆయన తన ప్రసంగాల్లో పెద్దగా ప్రస్తావించలేదు కానీ వైట్‌హౌస్‌లో తాను నిర్మించబోయే కొత్త బాల్‌రూమ్ గురించి గొప్పలు చెప్పారు. గతంలో ఏ అమెరికా ఎన్నికల ప్రచారంలోనూ లేనంతగా ముస్లిం వ్యతిరేక, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు.
డెమొక్రాట్లు గెలిస్తే...
టెక్సాస్, జార్జియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్ స్వయంగా ఎంపిక చేసిన రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటమి తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. అదే నిజమైతే ఆయన వ్యక్తిగత ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుంది. రిపబ్లికన్ పార్టీ తన భవిష్యత్తుపై ఆత్మపరిశీలన చేసుకో వాల్సి వస్తుంది. సెనెట్‌పై నియంత్రణ కోసం అవసరమైన నాలుగు స్థానాలను డెమొక్రాట్లు అదనంగా గెలుచుకుంటే ట్రంప్‌కు కష్టకాలం ప్రారంభమైనట్లే. వారు ట్రంప్ నిర్ణయాలను తిరగదోడడమే కాకుండా రాబోయే కాలంలో ఆయనను అడుగడుగునా అడ్డుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఏర్పడే ఏ ఖాళీనైనా భర్తీ చేసే అవకాశం వారికి లభిస్తుంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని, సైనిక కార్యకలాపాల కోసం నిధుల కేటాయింపును డెమొక్రాట్లు సవాలు చేస్తారు. అయితే అధ్యక్షుడి కి ఉన్న వీటో అధికారాన్ని ట్రంప్ ఉపయోగిం చుకునే అవకాశమూ ఉంది. పైగా సెనెట్‌లో ప్రధాన చట్టాలను ఆమోదించాలంటే 60 ఓట్లు అవసరం అవుతాయి కనుక డెమొక్రాట్ల ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లవచ్చు.
పోలింగ్ ఎప్పుడంటే..
అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అమెరికాలో వేర్వేరు టైమ్ జోన్స్ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా మన లాగే ఒకే సమయంలో పోలింగ్ మొదలవదు. భారత కాలమానం ప్రకారం అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలు...అంటే న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, కనెక్టికట్, మైనే వంటి రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. మధ్య ప్రాంతాలైన ఇల్లినాయిస్, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో రాత్రి 6.30-7.30 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమవుతుంది. ఇక పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ రాత్రి 8.30 గంటలకు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. మన కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడం మొదలవుతుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు అలాస్కాలో పోలింగ్ ముగియడంతో అమెరికా అంతటా ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.







కామెంట్‌లు (0)