రిపబ్లికన్ల పాలిట గుదిబండగా మారిన ట్రంప్
డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చిన హిస్పానిక్‌లు, నల్లజాతీయులు
వాషింగ్టన్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయాన్ని, పరాభవాన్ని మూటకట్టుకుంది. దేశాధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మధ్యంతర ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురవడం సహజమే అయినప్పటికీ ఇప్పుడు అత్యంత దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. వైట్‌హౌస్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు సంవత్సరాల పాలనకు ప్రజల నుంచి లభించిన తిరస్కారంగా ఈ ఫలితాలను విశ్లేషించవచ్చు. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం రిపబ్లికన్ల ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు కన్పిస్తున్నాయి.
జీవనవ్యయం...ఇరాన్ యుద్ధం
అమెరికా ప్రజలు దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్నారు. ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల కారణంగా ఈ ఏడాది ధరవరల్లో 3.7 శాతం పెరుగుదల కన్పించింది. ద్రవ్యోల్బణం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని ప్రతి పది మంది ఓటర్లలో ఎనిమిది మంది స్పష్టం చేశారు.
అధ్యక్షుడి విధానాలే ధరల పెరుగుదలకు కారణమని ప్రతి పది మందిలో ఆరుగురికి పైగా నిందించారు. ప్రధానంగా ఫిబ్రవరిలో ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం ధరల పెరుగుదలకు కారణమైంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్‌పై సైనిక చర్యను 63 శాతం మంది అమెరికన్లు నిరసించారు. తమ ఓటమికి ఇరాన్ యుద్ధం కారణమైందని ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం అంగీకరించారు.
బలమైన డెమొక్రాట్ అభ్యర్థులు
ఎన్నికల బరిలో బలమైన డెమొక్రాట్ అభ్యర్థులు నిలవడం కూడా రిపబ్లికన్ల ఓటమికి కారణమైంది. రిపబ్లికన్ల కంచుకోటలను వారు తమ శక్తియుక్తులతో బద్దలు కొట్టగలిగారు. ముఖ్యంగా జీవనవ్యయం, ఆరోగ్య సంరక్షణ, అవినీతి వంటి కీలక అంశాలపై వారు దృష్టి సారించి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు.
అదే సమయంలో రిపబ్లికన్ల ప్రచారం పేలవంగా సాగింది.
ఓటర్లను దూరం చేసిన అధ్యక్షుడి విధానాలు
దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థులకు గుదిబండగా మారారు. ధరల పెరుగుదలకు, ఇరాన్ యుద్ధానికి ఆయనే కారణమన్న అభిప్రాయం ఓటర్లతో నాటుకుపోయింది. రిపబ్లికన్ ఓటర్లలో సైతం ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్లు బలహీనపడ్డారు. బ్యాలెట్ పేపరుపై తానే ఉన్నానని భావించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. ట్రంప్ బ్రాండ్‌పై ఆకర్షణ తగ్గిపోయిందనడానికి ఈ ఫలితాలే ఉదాహరణ. రిపబ్లికన్ల ప్రచారానికి ట్రంప్ కేంద్ర బిందువు కావడం చివరికి వికటించింది. ట్రంప్ తన ఎన్నికల ప్రచార సభల్లో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా వివాదాస్పద బాల్రూమ్ పునరుద్ధరణ ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకోవడాన్ని ప్రజలు సహించలేకపోయారు.
ప్రభావం చూసిన సమాజాలు
రెండేండ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిస్పానిక్‌లు (స్పానిష్ భాష మాట్లాడే ప్రజలు), నల్లజాతి ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టెక్సాస్`మెక్సికో సరిహద్దు వెంబడి అత్యధిక హిస్పానిక్ జనాభా ఉన్న కాంగ్రెస్ జిల్లాల్లోని మూడు ప్రతినిధిసభ స్థానాలనూ డెమొక్రాట్లు గెలుచుకున్నారు. హిస్పానిక్‌లు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో రిపబ్లికన్లపై వ్యతిరేకత కన్పించిందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. అలాగే నల్లజాతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా డెమొక్రాట్లకు ఆదరణ లభించింది.







కామెంట్లు (0)