అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపుతాం
లోక్‌సభలో జెన్ జీ
ఒక శాతం కంటే తక్కువే రాహుల్ మంత్రివర్గంలో వారికే విద్యా శాఖ
జెన్ జీ పోరాటం ఆగొద్దు..
ముందుకెళ్లాలి : ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపు
విద్యార్థులపై దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోని యువతకు రాజీవ్‌గాంధీ 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు వయో పరిమితిని 21 ఏండ్లుగా నిర్ణయించారు. కానీ లోక్‌సభకు
25 ఏండ్లు, రాజ్యసభకు 30 ఏండ్లు దాటితేగానీ ఎన్నిక కావడం లేదు. చట్టసభల్లో జెన్ జీ గ్రూపు వాళ్లు
ఒక్క శాతం కూడా లేరు. జర్మనీ, యూకే లాంటి దేశాల్లో 18 ఏండ్లకే ఎంపీలు, ప్రధానమంత్రులయ్యే అవకాశముంది. అలా మన దగ్గర ఎందుకు కావొద్దు. చట్టసభల్లో పోటీచేసే వయస్సును 21 ఏండ్లకు కుదిస్తూ ఆగస్టు మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించి కేంద్రానికి పంపుతాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. నీట్ ప్రశ్నా పత్రాల లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీఛార్జీకి నిరసనగా శనివారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా యువత తరలొచ్చింది. జెన్‌జీనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయంతోనే నూనుగు మీసాల యువకులు, సోదరీమణులు ఓటు హక్కు పొందగలిగారని చెప్పారు. పీవీనరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మేయర్లు, జడ్పీ చైర్మెన్ల వంటి పోస్టులకు ఎన్నికయ్యే వయస్సును 25 నుంచి 21 ఏండ్లకే తగ్గించారని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయంతోనే యువత 18 ఏండ్లకే ఓటు వేయగలుగుతున్నారనీ, 21 ఏండ్లకే స్థానిక సంస్థల్లో పదవులు సాధించగలుగుతున్నారని తెలిపారు. 21 ఏండ్లకే ఒక సోదరీమణి తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికకావడానికి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అవకాశమే కారణమన్నారు. లోక్‌సభలో 543 మంది ఎంపీలుంటే 30 శాతంగా ఉన్న జెన్‌జీకి ఒక్క శాతం లోపే ప్రాతినిధ్యం ఉందన్నారు. వారి సమస్యలు పరిష్కారం కావాలంటే చట్ట సభల్లోనూ వారి ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసుకు 21 ఏండ్లకే ఎంపికయ్యే అవకాశం ఉందని చెబుతూ…21 ఏండ్లకే శ్రీలక్ష్మి, 22 ఏండ్లకే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య ఐఏఎస్‌లుగా, 22 ఏండ్లకే ప్రస్తుత డీజీపీ సి.వి.ఆనంద్ ఐపీఎస్‌గా ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు ప్రదర్శనగా వెళ్లడం కాదు… రోడ్లపై నుంచి నేరుగా పార్లమెంట్‌లోకి వెళ్లేలా యువత ఉండాలన్నారు. 21 ఏండ్లకే లోక్‌సభకు పోటీ చేసే అవకాశముంటే సభలోనే జెన్ జీ గళాన్ని వినిపించే అవకాశముంటుందన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో విద్యా శాఖ జెన్ జీ నేతకు ఇస్తామనీ, దీనిపై రాహుల్ గాంధీని, ఇండియా కూటమి నేతలను ఒప్పిస్తానని హామీనిచ్చారు.
విద్యా, ఐటీ వంటి కీలకమైన శాఖలను 60, 70, 90 ఏండ్లవారికి కాకుండా 21 ఏండ్ల వారికే ఇవ్వాలనీ, తమకేం కావాలో వారికే తెలుసని అన్నారు. జెన్ జీ పోరాట పటిమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశంసించారు. వారు సాధించిన విజయాలను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో రాసుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. లాఠీలు, తూటాలకు తలవంచకుండా పోరాడి 56 అడుగుల ఛాతీ అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్‌తో వారు రాజీనామా చేయించాగలిగారని కొనియాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదన్నారు. పరీక్ష పేపర్ల లీక్‌తో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యమం సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులపై బనాయించిన కేసులను సోమవారం లోపు ఎత్తేయకపోతే పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, ఖర్గేల నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, వల్లాల నవీన్ యాదవ్, శ్రీగణేష్, మల్ రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



