Magazines

సామాజిక సంకేతాలు - సాంస్కృతిక సంఘర్షణలు

13 నిమిషాల క్రితం

Cultural
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 5 నిమిషాల చదవడం

‘‘హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం’’ అని వెనకటికో కవి రాసినట్టు సమాజ పరిణామాల సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తూనే వుంటాయి. వాటిని సకాలంలో సవ్యంగా గ్రహించి ఆలోచనలనూ ఆచరణనూ మల్చు కోగలమా లేదా అన్నదే సమాజాలకు సవాలు. మనుషుల జీవితాలకు సంబంధించిన ఏ పార్శ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. సామాజిక ఆర్థిక సాంస్కృతిక బౌద్ధిక నైతిక శాసనిక పాదార్థిక కోణాలన్నిటా ఇది ప్రతిబింబిస్తూనే వుంటుంది. ఏనుగంటే తొండం, కాళ్లు చెవులు అన్నట్టు ఏ రోజుకారోజు ఇంకా చెప్పాలంటే ఏ క్షణానికా క్షణం ఏదో ఒకటి తీసి ఏదో జరిగిందనో, ఏదో జరగలేదనో వ్యాఖ్యానాలు చెప్పడం శాస్ర్తీయ పద్ధతి అనిపించుకోదు. తెలుగువారికే గాక భారతీయులకు మరోవిధంగా ప్రపంచానికి కూడా చాలా సందడి సంఘర్షణతో కూడిన ప్రస్తుత సందర్భం అలాంటి పరిశీలనకు సరిగ్గా సరిపోతుంది.

పూజలూ, పుస్తకాలూ....

వినాయకచవితితో మొదలు పెట్టి దసరా, దీపావళి ఇదంతా ఒక పండుగ తరుణంగా సాగుతుంటుంది. మరీ ముఖ్యంగా దసరా పండుగను మహిషాసుర మర్దనంతో మహిళా శక్తితో ముడిపెడితే వినాయకుడు మాతృస్వామిక సమాజానికి ప్రతీకగా నిలిచే ఆమె కుమారుడు వినాయకుడు. అదే మాతృమూర్తి తన కుమారుడినే యుద్ధంలో ఓడించిన కథ దీపావళి. ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి చూస్తే మహిళలకు లభిస్తున్న గౌరవం నిన్న మొన్న కూడా కలచివేసిన ఘటనలు మన కండ్లముందు కదలకుండా వుండవు. అయితే అందులో మరీ దారుణమైన రాప్తాడు ఘటనలో కూడా తన స్నేహితురాలిని కాపాడేందుకు చిన్నారి బాలిక గట్టిగా నిలబడటం కచ్చితంగా ఇలాంటి సందేశమే. దీపావళి టపాకాయల పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి రావడం కూడా పర్యావరణ సంబంధమైన సందేశమైతే వెంటాడుతున్న ఎల్‌‌నినో భూతం ఇందుకు పరాకాష్ట.

అయితే ఈ పర్యావరణ సవాళ్లు బడిపిల్లలతో నినాదాలు రాయించడం వంటి సంకేతప్రాయమైన చర్యలతో పరిష్కారం కావని డేటా సెంటర్లపై సాగే సమరం చెబుతుంది. అది విశాఖపట్టణంలో డేటా సెంటర్ల నుంచి యాదాద్రి కొత్తగూడెం విద్యుదుత్పత్తి తీరు వరకూ కనిపిస్తుంది. ఇవన్నీ బడా బాబుల మాయాజాలాలే తప్ప మామూలు మనుషుల చేతలు కావు. కాకుంటే వారి నిర్వాకాలను నిలదీయడంలోనే వీరి చైతన్యం గోచరిస్తుంది. హోరాహోరీ ఆరోపణలు దాడుల యుద్ధంగా జరిగిన ఏపీ స్థానిక ఎన్నికల సమరంలో విశాఖ ఉక్కు ప్రాంతంలో మాత్రం కార్మిక నాయకుడే విజయం సాధించడం కన్నా ఇందుకు మరో నిదర్శనం అక్కర్లేదు. ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి, మంత్రి కలసి గౌతం అదానీతో దర్శనమివ్వడం దీనికి మరో కోణం. పాలకపార్టీలు మారొచ్చు, పాలకుల స్వభావాలు ప్రభావాలు మారవని చెప్పే ఉదాహరణలివి.

పండుగలు విశ్వాసాలను కమ్యూనిస్టులేదో భంగం చేస్తారన్న వాదనలు ప్రచారాలకు కొదువ వుండదు. ‘రుద్రాలిక నయనజ్వాలిక కలకత్త కాళిక నాలిక’ అని శ్రీశ్రీ రాసినట్టు బెంగాల్‌ ‌దుర్గాపందిళ్లు ప్రపంచ ప్రసిద్ధం. మూడున్నర దశాబ్దాలు అవిచ్చిన్నంగా సాగిన వామపక్ష పాలనలో వాటికెప్పుడూ ఇబ్బంది రాలేదు గానీ హిందూత్వ రాజకీయాల బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి సర్కారు రాగానే అవి వివాదాస్పదమై పోయాయి. పందిళ్ల సంఖ్యవిపరీతంగా పెంచేయడమే గాక సంఘ పరివార్‌ ‌కనుసన్నల్లో దానికోసం పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసి హంగామా చేశారు. తీరా పందిళ్లలో నైవేద్యం, వాద్యం నుంచి ఆ సందర్భంలో జరిగే పుస్తక ప్రదర్శనల వరకూ ప్రతిదీ వివాదం చేయ బడ్డాయి. అయోధ్యలో మొదలైన బుల్డోజర్‌ సం‌స్కృతిని వంగభూమిలోనూ ప్రవేశపెట్టే ప్రయత్నం నిరనన రగిలించింది. విషాదాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ ఓడించి కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను పాఠకులకు చేర్చడం ద్వారా అక్షర ప్రియులు ఆశయాలు చాటి చెప్పడం గొప్ప సన్నివేశం.

తిరగబడిన రామబాణం

రామమందిరం ట్రస్టులో రూ.కోట్ల గల్లంతు జరిగినట్టే బెంగాల్‌‌లోనూ ఈ పందిళ్లలోఅవినీతి పెత్తనాలు కోర్టులకు ఎక్కడం ఒక గుణపాఠం. ఇక ఆ అయోధ్యలో ట్రస్టు ఏర్పాటుకు సారథ్యం వహించిన జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌సిఈసిగా కోట్ల ఓట్ల హొమం చేస్తే నిలదీసి నిలిపేసిన చైతన్యానికి ఢిల్లీ రామ్‌‌లీలా మైదానం వేదిక కావడం తిరగబడిన రామలీలను చెప్పింది, రావణుడితో పాటు కాక్రోచ్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేసి వారు సంబరపడితే నిజమైన ఓట్ల చోరులను తరిమి కొట్టడానికి ఈ సమీకరణ సంకేతమైంది. అక్కడ రామలీల తిరగబడుతుంటే అమిత్‌ ‌షాతో సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రాలకు వచ్చి రాజకీయంగా రెచ్చగొట్టవలసిన దుస్థితి. పార్లమెంటులో ఏ సమస్యనూ చర్చించడానికే సిద్ధపడని మోడీ-షాలు సర్‌‌పై చర్చకు రమ్మని సవాలుచేయడం హాస్యాస్పదం, ఎందుకంటే మొదటే సక్రమంగా చర్చ చేసి వుంటే అసలు ఈ ఓట్ల హననానికి అవకాశమే వుండేది కాదే? ఇప్పుడు ఇక ఈసిఐ రోజుకో సవరణతో పునరుద్ధరణ చేసుకోమనటం వారి పరాజయానికి అద్దం పడుతున్నది. ఇంత సంఘర్షణాత్మక సన్నివేశంలోనూ ఏపీలోని ప్రాంతీయ పార్టీలు మాత్రం బీజేపీ నుంచి పూర్తిగా విడగొట్టుకోవడానికి, జాతీయ ప్రతిఘటనలో పాలుపంచు కోవడానికి సిద్ధపడని ప్రాంతీయపార్టీల తీరు కూడా బహిర్గతమైంది. కానీ అదే పార్టీలు స్థానిక స్థాయిలో మాత్రం నిరసనలకు పరిమితం కావడం ఇరకాటానికి నిదర్శనమవుతున్నది.

జాతీయంగా ఓటు హక్కు రక్షణకై పోరాటం తారాస్థాయికి చేరుతుంటే ఏపీ స్థానిక ఎన్నికలలో దౌర్జన్యం రిగ్గింగులు పరాకాష్టకు చేరడం ఒక విపరీతం. కానీ దానిపైనా కోర్టులు కొంతవరకూ జోక్యం చేసుకోవడం, జాతీయ మీడియా దృష్టి కేంద్రీకరించడం సానుకూల పరిణామమే. ఈ అంశంపై ఉభయ ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమానికి వామపక్షాలు పిలుపునివ్వడం కూడా సందర్బోచితం. వైసీపీ, బిఆర్‌ఎస్‌ ‌వంటిపార్టీలూ ఈ సమయంలో ఓటు హక్కురక్షణ పోరాటంలో మరింత నేరుగా పాల్గొంటాయేమో చూడవలసిందే. ఇప్పుడిప్పుడూ ఫలితాలు ముగుస్తున్న స్థానిక పర్వంలోనూ వామ పక్షాలు పౌర సంస్థలూ ప్రజాస్వామ్య ప్రియులు ముందు నిలవడం హర్షనీయం. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్టులు బలపర్చిన ఎబివెంకటేశ్వరరావుకు పరిమితంగానే ఓట్లు వచ్చినా కార్పొరేటేతర లౌకిక అజెండాను సజీవంగా వుంచడం ముఖ్యమైన విషయం. మొదటే చెప్పినట్టు సందర్భం పోరాటం బట్టి అడుగులు వుండాలి గానీ అన్నిటినీ ఒకే గాట కట్టి చప్పరించడం చెల్లుబాటయ్యేది కాదు. ఇంత ధనరాజకీయం లోనూ దౌర్జన్యాలలోనూ వామపక్షాలు తమ పాత్రకు కట్టుబడటం అభినందనీయం.

లడ్దూలాంటి వివాదం..

లడ్డూలో జంతుకొవ్వు కల్తీ పేరుతో ఏడాది కిందట పెద్ద తతంగమే నడిచిన తీరు ఎవరూ మర్చిపోరు. కల్తీ అవినీతి నిజమే గానీ జంతు కొవ్వు కలిసినట్టు ఆధారలేవీ లేవని ఇప్పటికి అనేకసార్లు వివిధ నివేదికల్లో రుజువవుతూ వస్తున్నది. మొన్న గురువారం నాడు మళ్లీ అత్యున్నత న్యాయస్థానమే ఆ మాట చెప్పవలసి వచ్చింది. లడ్డూ కేసు ఏపీ వెలపల నిర్వహించడని నిందితులొకరు పిటిషన్‌ ‌వేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కూడా అనేక విధాల వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నం దున ఒత్తిడి వుండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ‘మేము వారి నోరు మూయించాము ఏం పర్లేదని’ సిజెఐ సూర్యకాంత్‌ ‌స్వయంగా వ్యాఖ్యానించి ఆ అభ్యర్థన తోసిపుచ్చారు. అన్నట్టు తిరుమలపై ఈ వివాదాస్పద ఘట్టాలలో కోరి నియమించుకున్న చైర్మన్‌ ‌పదవీకాలం నిశ్శబ్దంగా ముగిసిపోయింది, అన్య మతస్తులైన ఉద్యోగుల తొలగింపు తదితర ఉత్తర్వులతో రెచ్చిపోయిన ఘట్టం వెనక్కుపోయింది. ఈ పరిణామాలన్నిటిలోనూ కొట్టవచ్చినట్టు కనిపించేది ఒకటే భావోద్వేగాలను మతతత్వాలను ప్రేరేపించడానికి పన్నే పథకాలు కొంతకాలం పనిచేయవచ్చు గానీ ఎల్లకాలం నడవవు అని.

న్యాయానికి న్యాయం కోసం

ఈ జాబితాలో చెప్పుకోవలసినవి ఇంకా చాలా వున్నా ఇప్పుడు రాజ్యాంగ మూలస్ఫూర్తిని నిలపాల్సిన ధర్మాసనాల దగ్గరకు వద్దాం. ఓట్‌ ‌చోరీ నుంచి కార్పొరేట్‌ ఆధిపత్యాల వరకూ అన్ని విషయాలు ముందో వెనకో న్యాయస్థానాలలో ఆమోదం పొందవలసిందే. గత చాలాకాలంగా ఉన్నతన్యాయస్థానాలే పాలకవర్గాల పాచికలు పారేందుకు దోహదకారుల వుతున్నాయనే విమర్శలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఒక మాజీ సిజెఐ డివై చంద్రచూడ్‌ కొలీజియంను కాదని న్యాయమూర్తుల నియామకంలో జోక్యానికి తలుపులు తీశారు. అప్పుడు ఆయనతో పాటు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ‌సంజయ్‌ కౌల్‌ ‌స్వయంగా ఈ అంశాలపై భిన్నాభిప్రాయం ప్రకటించారు.

కార్పొరేట్‌ ‌వ్యవహారాలు చూసే కంపెనీ లా ట్రిబ్యునల్‌, గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ వంటివి పూర్తిగా వారి చెప్పుచేతల్లోనే వున్నట్టు కనిపిస్తుందని సిజెఐ సూర్యకాంత్‌ ‌స్వయంగా వ్యాఖ్యనించారు.

హైకోర్టుల తీరుపైన కూడా చాలా వ్యాఖ్యానాలు చేశారు. మరో న్యాయమూర్తి ఉజ్జల్‌‌భూయాన్‌ ‌ ఓటు హక్కు తొలగించడం తప్పని ప్రకటించారు. ఇవన్నీ మన కండ్లముందే వచ్చిన మార్పులు. దిగ్గజ సంపాదకులు కూడా స్వయంగా ఛానళ్లు పెట్టుకుని పోరాటం ప్రారంభించడంతో ఇప్పుడు కంటెంటు బ్లాకవుట్‌, గ్లోబల్‌ ప్లాట్‌‌ఫాంలపై ఆంక్షలు వస్తున్నా ఏదో ఒక రూపంలో ఈ పోరాటం కొనసాగుతూనే వుంది. దియామీర్జా అనే క్రీడాకారిణి దీపావళి టపాకాయల కాలుష్యం గురించి హెచ్చరిక చేయడం, హిందూ వ్యతిరేకత అని వచ్చిన ఆ కేసు కొట్టివేయడమే గాక ఇది లౌకిక దేశమని హైకోర్టు గుర్తుచేసింది.చివరగా నూట పదేండ్ల ‘అక్టోబర్‌ విప్లవ’ దినోత్సవం దగ్గరకు వస్తే ఆ స్పూర్తి కొనసాగుతూనే వుందని తాజా అంతర్జాతీయ పరిణామాలు ట్రంప్‌ ‌గిజగిజలు చెబుతున్నాయి. అయినా ఈ కోవలో చేయాల్సి పోరాటం, నడవాల్సిన దూరం చాలా వుందనేది వాస్తవం.

కాకపోతే బడామీడియాతో పాటు బయట కూడా చాలామంది నమ్మించాలని చూస్తున్నట్టు ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సాగే పోరాటం బలహీనమై పోలేదు. ‘ఆర్థిక పరిస్థితి పునాదిగా వున్నా ఆ పై భాగంలోని వర్గ పోరాటాలూ, రాజకీయ రూపాలు, పాలక వర్గ రాజ్యాంగ రీతులూ, న్యాయ చట్రాలూ ఇవన్నీ ప్రజల ఆలోచనల్లో ప్రతిబింబించే రాజకీయ తాత్విక మత న్యాయ భావనలు పోరాటాలను ప్రభావితం చేస్తాయన్న’ అర్థంలో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ జోసఫ్‌ ‌బ్లాంక్‌‌కు రాసింది ఎంత సత్యమో ఇలాంటి ఘట్టాల్లో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ కోణంలో చూసినా ఇప్పుడు అలాంటి ఘట్టమే నడుస్తున్నదనేది దీపావళి సందేశం.


తెలకపల్లి రవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్