భారతదేశ పారిశ్రామిక ప్రస్థానంలో టాటా గ్రూప్‌నకు ప్రత్యేక స్థానం ఉంది. ఉప్పు నుంచి ఉక్కు వరకు, విమానయానం నుంచి సాఫ్ట్వేర్ వరకు విస్తరించిన ఈ సంస్థ దేశ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, ఎగుమతులు, సాంకేతిక సామర్థ్యానికి విశేష సేవలందించింది. విద్య, వైద్యం, పరిశోధన, సామాజిక సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. లక్షలాది మంది వాటాదారులు, ఉద్యోగులు, వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలు ఈ గ్రూప్‌తో ముడిపడి ఉన్నాయి. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ యాజమాన్యంలో ప్రభుత్వ జోక్యం జరుగుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. టాటా సన్స్ గ్రూప్‌లోని కంపెనీలకు ప్రధాన హోల్డింగ్ కంపెనీగా, ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి సంస్థల్లో కీలక వాటాలు కలిగి ఉంది. ఈ కంపెనీలు తమతమ బోర్డుల ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేస్తాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సహా ఇతర టాటా ట్రస్టులకు టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉంది. మరోవైపు, దివంగత రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా 2024 అక్టోబరులో ఆయన మరణానంతరం టాటా ట్రస్టుల ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
టాటా సన్స్ కార్యనిర్వాహక ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తూ 2026 సెప్టెంబరు 17న బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నోయెల్ టాటా సవాలు చేశారు. అవసరమైన ఆమోదాలు లభించలేదని, సంస్థ నియమావళి లోని నిబంధనలను సక్రమంగా అనుసరించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ ఏకగ్రీవ సిఫారసుతోనే బోర్డు తగిన మెజారిటీతో నిర్ణయం తీసుకుందని టాటా సన్స్ స్పష్టం చేసింది. తన అభ్యంతరాలకు సంబంధించిన బోర్డు సమావేశ ఆడియో, వీడియో రికార్డింగ్‌లు, తుది మినిట్స్, ఓటింగ్ వివరాలను నోయెల్ కోరారు. ఈ అంశాలపై చట్టపరమైన స్పష్టత రావాల్సి ఉంది. టాటా సన్స్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయాలా వద్దా అన్నది మరో ప్రధాన వివాదం. లిస్టింగ్ నుంచి మినహాయింపు కోరిన టాటా సన్స్ అభ్యర్థనను ఆర్బీఐ తిరస్కరించి, నిబంధనల ప్రకారం లిస్టింగ్ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, లిస్టింగ్ వల్ల టాటా ట్రస్టుల నియంత్రణ, గ్రూప్ దాతృత్వ స్వభావం దెబ్బతింటాయని నోయెల్ టాటా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 2026 అక్టోబరు 28న రాహుల్ గాంధీ టాటా గ్రూప్‌ను ‘నేరపూరితంగా ధ్వంసం చేస్తున్నారని’ ఆరోపించారు. వ్యాపారవేత్తలు భయంతో మాట్లాడలేకపోతున్నారని, కొన్ని వ్యాపారాలను మరో పారిశ్రామికవేత్తకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అమిత్ షా నివాసంలో నోయెల్ టాటా, చంద్రశేఖరన్, టాటా ట్రస్టుల ప్రతినిధులు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న సమావేశంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, ఆ సమావేశంలో ఏం చర్చించారన్నది, ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అన్నది వెల్లడికాలేదు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యత, హక్కు కూడా. పెద్ద పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలు, పాలనా విధానాలు, ప్రజా ప్రయోజనాలపై ప్రభుత్వ జోక్యం ప్రభావాన్ని పరిశీలించడం అవసరమే. అయితే, టాటా గ్రూప్‌ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందన్న ఆరోపణకు రాహుల్ గాంధీ విశ్వసనీయ ఆధారాలు చూపాలి. అంతర్గత విభేదాలు, అమిత్ షా నివాసంలో సమావేశం జరగడం మాత్రమే అనుచిత జోక్యాన్ని నిరూపించవు. ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సంస్థ ప్రతిష్టను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. అదే సమయంలో ప్రభుత్వం కూడా మౌనం వీడాలి. సమావేశం ఎందుకు జరిగింది? ప్రభుత్వ ప్రతినిధులు ఏ హోదాలో పాల్గొన్నారు? ఏవైనా అధికారిక నిర్ణయాలు తీసుకున్నారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలి. గోప్యత అవసరమైతే అందుకు సహేతుకమైన కారణాలను వివరించాలి. టాటా గ్రూప్ కూడా తనపై వచ్చిన ప్రశ్నలకు సాధ్యమైనంత స్పష్టత ఇవ్వాలి. ఆరోపణలకు ఆధారాలతో కూడిన సమాధానాలు లభించినప్పుడే వాటాదారులు, ఉద్యోగులు, ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి తొలగుతుంది. ఇది ప్రభుత్వంతో పాటు సంస్థ బాధ్యత కూడా. అంతిమంగా ఈ వివాదంలో వ్యక్తిగత విభేదాలు, సంస్థాగత నిర్ణయాలు, ప్రభుత్వ పాత్రలను వేర్వేరుగా పరిశీలించాలి. ఆరోపణలు నిజమైతే వాటిపై తగిన విచారణ జరగాలి. అదే సమయంలో ఆరోపణలు నిరాధారమైతే అనవసరమైన ప్రచారానికి అడ్డుకట్ట పడాలి. టాటా గ్రూప్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పారదర్శకత, స్వతంత్ర పాలనకు ప్రాధాన్యం ఉండాలి. వాస్తవాలను వెల్లడించడం ద్వారానే ఈ వివాదానికి విశ్వసనీయమైన ముగింపు లభిస్తుంది.
- కృష్ణ బాలాజీ పల్లపోతు,
99490 98406







కామెంట్లు (0)