Magazines

అ‘‘క్షరం’’

5 రోజుల క్రితం

A "Letter"
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 3 నిమిషాల చదవడం

బుక్ ఫెయిర్, పుస్తకాల పండగ మొదలయ్యిందంటే కవులకు, పుస్తక ప్రియులకు ఆనందమే ఆనందం. పండుగ సేల్స్ ధమాకా అంటే జనాలు ఎలా రెచ్చిపోతారో ఒక విధంగా వీళ్లూ పొంగిపోతారు. పండగంటే పండగే మరి. ఎన్నో పుస్తకాలను తనివితీరా చూడొచ్చు, కొన్ని కొనొచ్చు, ఎందరో కవులను కలవొచ్చు, అక్కడ పుస్తకవిష్కరణలు, ఉపన్యాసాలు వినొచ్చు. పుస్తకానికి ఎక్కడలేని బలం ఈ పుస్తక ప్రదర్శన. అక్షరం చైతన్యానికి దీపికగా, ఆలోచనకు ఆయుధంగా, ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు అద్దంపట్టే దిక్సూచిగా సాహిత్యకారులు ఎంతో ఆశ కలిగించారు అక్షరంపైన, పుస్తకం పైన. గోర్కి, జాషువా, శ్రీశ్రీ సాహిత్యకారులు ఎవరివైపు నిలబడాలో చెప్పనేచెప్పారు. అక్షరం, పుస్తకం రూపం మారినా దాని విలువ మారలేదు మారదు. దానికున్న శక్తి అది. అక్షరాన్ని, ఉద్యమాల్ని జైల్లో పెడతారు, జైళ్ళు మారుస్తారు ఒక్కోసారి కొనవూపిరితో విడుదల చేస్తారు. ఇంతచేసినా కొనవూపిరి మిగిలించుకొని తిరిగి పుస్తకం మొలకెత్తుతూ ఉంటుంది. ఒక పెద్దాయన చెప్పినట్టు పుస్తకం పునర్జన్మ పొందింది. నిజమే ఎన్ని విధాలుగానైతే టేర్ గ్యాసులతో, భాష్పవాయువులతో, వాటర్ క్యానన్లతో ఉద్యమాల్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారో అన్నివిధాలుగానూ పుస్తకాన్ని కూడా అణచివేయాలని, అణగదొక్కాలని, భూస్థాపితం చేయాలని చూస్తున్నా అది తిరిగి తారాజువ్వలా ఎగిసెగిసి పడుతోంది.

అక్షరానికి, పుస్తకానికి ఉన్న సహజ లక్షణమది. తరతరాలుగా నియంతలు ఎన్నిచేసినా కూడా దాని మీద తాత్కాలిక విజయం సాధించారే తప్ప శాశ్వత విజయం సాధించలేక పోయారు. దాని పవర్ అది. రాజకీయాలు, డబ్బు, ద్వేషాలు ఎలగైతే కలిసి నడుస్తున్నాయో ఉద్యమాలు, అక్షరం, పుస్తకం కూడా కలిసే నడుస్తుంటాయి. స్వాతంత్ర సంగ్రామం నుండి ఏ సాంస్కృతిక, అస్తిత్వ ఉద్యమాలు, ఇంకా ఏ ఇతర ఉద్యమాలు తీసుకున్నా చంకలో అక్షరాన్ని, పుస్తకాన్ని పెట్టుకొనే పోతుంటాయి. పుస్తకం హస్తభూషణం అన్నట్టు అది విడరాని బంధం. వ్యాపరాల కోసం సిక్స్ వేలు, బుల్లెట్ రైళ్ళు, ఫ్లై ఓవర్లు వేసి కావ్లసినోళ్ళను ఆనందపరుస్తారో వారితో పాటు మధ్యతరగతి వాళ్ళు కూడా వాటిని వాడుకుంటారు. పుస్తకం విషయానికొచ్చేసరికి అది పాట, కథ, నాటకం ఇలా ఏ రూపంలోనైనా ఉద్యమాలకే తోడ్పడుతుంది. మనుషుల్ని దగ్గర చేస్తుంది. అదే పుస్తకాన్ని మనుషుల మధ్య తేడాలు తీసుకురావడానికి కూడా జనాలు తమవంతు కృషి తాము చేస్తున్నారు. బుక్ పోస్టులు ఎత్తివేస్తారు, కాకితం ధర, ముద్రణ ధర పెంచేస్తారు. వేయి కాపీలు వేసుకునే రచయితలు ఇప్పుడు రెండువందలు, వంద వేస్తున్నారు. వేసిన దాన్ని పోస్టు చేయాలంటే గుండె జారి గల్లంతవుతుంది. మిఠాయి షాపులో అద్దాల్లో కనిపించేవాటినన్నిటిని ఎలా కొనలేమో ఈ పుస్తకాలను కూడా బయటనుండి చూసి, చేతిలోకి తీసుకొని చూడొచ్చుననుకొండి, అలా ఆనందపడిపోయి, తెలుగు అకాడెమివాళ్లు, ఇంకొన్ని సంస్థలు వేసిన పుస్తకాలు కాస్త తక్కువ ధరకు దొరికితే అవి తీసుకొని బయటపడేరోజులు.

ఎల్‌‌నినో ప్రభావం మన జీవితాల ఈద ఎంతగా ఉందో వ్యవస్థ విధించే ఎల్నినో విధానాలు పుస్తకాల మీద కూడా చాలా ఉందని గమనించాలి.. అసలు అక్షరం అంటే క్షరము లేనిది అంటే నాశనము లేనిది అని అర్థం. మరి దాన్ని ఎలా చేయాలని చూస్తున్నారు? ​అక్షరాన్ని క్షరం చేయి బతికిస్తున్నట్టు నాటకమాడు సుద్దులు చెబుతూ ఉండు సద్దిమాటలు అలవాటు చెయ్ సద్దుచేయకుండా ఊపిరి ఆపెయ్ ఇది వ్యవస్థ పాలసీగా కనబడుతుంది. ఐనా గోడల చీలికల్లో, పెద్ద పెద్ద చెట్లపైన, కొండరాళ్ల సందుల్లో పక్షులు వేసే విత్తనాలు ఎలాగైతే మొలకెత్తుతాయో పుస్తకం కూడా విసుగు, విరామం, అలసట లేకుండా మొలకెత్తుతునే వుంటుంది. అక్షరాన్ని క్షరం చేద్దామనుకున్నవారే నామరూపాల్లేకుండా పోతారు. ఇది పుస్తకాల్లోనూ నిక్షిప్తమైన సత్యం. ఒక్క కలం పోటుతో చట్టాలను మారుస్తున్నవాళ్లు, రాత్రికి రాత్రి నల్ల చట్టాలను ఇదే అక్షరం ద్వారా తెస్తున్నామని మరచిపోతున్నారు. తమకు కావలసిన విధంగా పదాలను వాడుకుంటూ తమ పధకాలకు విచిత్రమైన పేర్లు పెట్టుకుంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు అక్షరం పౌరుషాన్ని మోసుకొని ‘జంతర్ మంతర్’ వద్ద పరుగులు తీస్తోంది. అది అక్షరం శక్తి. అక్షరామెప్పుడూ మేలుకొనే ఉంటుంది. దాన్ని నిద్రబుచ్చుతామానుకుంటే దాల్ చాలో కాలేసినట్టే.


జంధ్యాల రఘుబాబు 9849753298

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్