భీకరంగా కబళిస్తున్న ఎల్ నినో గురించి ఆయా కోణాల్లో ఎన్నో అంశాలను టచ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కష్ట కాలంలో కీలకమైన రుణాలపై మారటోరియం విషయాన్ని మాత్రం విస్మరించారు. ఎల్ నినో తీవ్రతను కరోనా సంక్షోభంతో సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే పోల్చింది. రానున్న రోజుల్లో కరువు విలయతాండవాన్ని స్వయానా ముఖ్యమంత్రి తెలంగాణ సమాజం కళ్ళకు కట్టినట్టు అంచనా వేశారు, ఆ మేరకు అప్రమత్తం చేశారు. అసలు ఏకంగా చలికాలమే గల్లంతయ్యేలా ఉక్కపోతలు ఇపుడు మనందరి అనుభవంలో ఉండడమూ ఎండల తాకిడికి ప్రబల తార్కాణం. కోవిడ్ అన్ని రంగాలను, అన్ని వర్గాలనూ పీడించినట్టే ప్రస్తుత ఎల్ నినో దుర్భిక్షమూ ఎవరికీ మినహాయింపు కాదు. రాష్ట్ర రైతాంగం సహా అందరిపైనా నేరుగానే అనావృష్టి ఛాయలు ఇప్పటికే ప్రసరించాయి. తిండిగింజలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు మొదలు ప్రతి ఒక్కటీ బీద సాదలను, దిగువ, మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలను ఇప్పటికే పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ కాలం మాదిరి ఉపశమన చర్యలు, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సి ఉంది. ఎల్ నినో అలుముకున్న దశలో ఎన్నో అంశాలను టచ్ చేసిన రేవంత్ రెడ్డి వివిధ రకాల రుణాలపై మారటోరియం గురించి కడపటి మీడియా సమావేశంలో ప్రస్తావించలేదు.
ఎలాగూ కేంద్ర ప్రభుత్వాన్ని రూ.30 వేల కోట్ల సహాయం అడిగేందుకు సంసిద్ధమవుతున్న దరిమిలా తెలంగాణ ప్రజలు తీసుకున్న అన్నీ రకాల అప్పుల చెల్లింపులను కనీసం ఏడాదిపాటు వాయిదా (మారటోరియం) వేసేలా ఆర్బీఐ సత్వర మార్గదర్శకాల కోసం సెంట్రల్ గవర్నమెంటును మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాల్సి ఉంది. ఎట్లాగూ ఎల్ నినో ప్రతాపం ఎనిమిది నెలల నుంచి పది నెలల వరకు నెలకొంటున్నందున ఓ ఏడాది పాటు మారటోరియం విధింపు గురించి సీఎం దృష్టి కేంద్రీకరించాలి. యాసంగిలో సాగు చేయొద్దంటూ దాదాపు క్రాప్ హాలిడే ప్రకటించినందున పంట అప్పులతోపాటు వివిధ రకాల రైతు రుణాలపై మారటోరియం పరిస్థితులకు తగిన విధాన నిర్ణయం కాగలదు. ఎల్ నినోను ఏ ఒక్కరూ తప్పించుకోనందున వివిధ వర్గాల ప్రజల వ్యక్తిగత, వాహన, గృహ, వ్యాపార, పారిశ్రామిక వగైరా రుణాలపైనా మారటో రియం అమలు చేయించాలి. అదే సమయంలో విపణిలో ద్రవ్య చలామణి, కొనుగోలు శక్తి, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు బేషరతుగా కొత్త రుణాల మంజూరుకు వెసులుబాటు కల్పించాలి. ఇందుకోసం అఖిల పక్షం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఎల్ నినోకు ఏ ఒక్కరూ బలి కాకుండా అన్ని జాగ్రత్తలూ మానవీయ కోణంలో అనుసరించడమే ఈ కష్ట కాలంలో పరమావధి కావాలి.
అనధికార గణాంకాల ప్రకారం తెలంగాణలో రైతులపై ఉన్న మొత్తం వ్యవసాయ రుణ బకాయిలు రూ.1,75,960.56 కోట్లు. స్వల్పకాలిక పంట రుణాలు రూ.95,167.98 కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.80,792.58 కోట్లు. మొత్తం వ్యవసాయ రుణ బకాయిలురూ.1,75,960.56 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో బ్యాంకులు పంపిణీ చేసిన వ్యవసాయ రుణాలు రూ.1,60,501 కోట్లు. రాష్ట్రంలో బ్యాంకు రుణాలు కలిగిన రైతుల ఖాతాలు సుమారు 70 లక్షలు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి వ్యక్తిగత, గృహ, వాహన, వ్యాపార రుణాలు 2026 జూన్ త్రైమాసికానికి మొత్తం రూ.12.77 లక్షల కోట్లు. ఆయా రుణాలపై మారటోరియం అమలైతే సదరు రుణ గ్రహీతలకు అత్యంత ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో ఊరట, ఉపశమనం కలుగుతుంది. సిబిల్, పరపతి నిక్షేపంగా ఉంటాయి. లక్షలాది మంది రుణ గ్రహీతలు, వారి కుటుంబీకులు ఈ విధంగానైనా కాస్త బెంగ వీడి ఆందోళన పడకుండా బతుకుతారు. ఎల్ నినో గాఢత వలె మారటోరియం ప్రాముఖ్యతను గమనంలో ఉంచుకొని ఆ ప్రకారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన విధంగా స్పందించాలి.
ఇల్లెందుల దుర్గాప్రసాద్, 9440850384






కామెంట్లు (0)