Magazines

ఉలుకులేదు.. పలుకులేదు

47 నిమిషాల క్రితం

Not a sound or a word.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం

‘‘కత్తులు లేవు, గొడ్డళ్లు లేవు, పిస్తోళ్లు లేవు, నెత్తురు చుక్కయినా లేదు, పదమూడుకోట్ల మనుషులు, హత్యకు గురయ్యారు, వినపడని వేదనల అగాధంలో ప్రజాస్వామ్య గొంతు నులిమివేయబడింది. కామూష్‌గా నువ్వు లెవ్వంటారు, జాబితాలో ఉరి వేలాడుతుంది, గప్ చుప్, నిశ్శబ్దమ్... మెలకువ రాని శబ్దం...’’ అంటూ ఓ కవి వర్ణనావేదన. అవును అన్ని నిశ్శబ్దంగానే జరిగిపోతున్నాయి. నోళ్లెత్తి నిగ్గదీస్తున్న అనేక ప్రశ్నలకు ఒక్కటి, ఒక్కటంటే ఒక్క సమాధానమూ లేదు. మాట్లాడటం నాగరిక సమాజ లక్షణం. ప్రజాస్వామిక వ్యవస్థకు మాటలూ, చర్చలూ చాలా ముఖ్యమైనవి. వాటి ద్వారానే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ఎందుకు వీళ్లు నోరువిప్పటం లేదు. నోళ్లేమయిన పడిపోయాయా! సమాధానాలు లేవా! వీళ్లకేమిటి మనం సమాధానం చెప్పేదని అహంకారమా! ఇవన్నీ నిరంకుశులకే చెల్లుబాటవుతాయి. ప్రజాస్వామ్య ఆచరణలో ప్రజలు ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. తప్పులను, దుర్మార్గాలను ఎత్తి చూపుతారు.

అన్నిటికీ అధికార పక్షం సమాధానం చెప్పాలి. వివరించాలి. డైలాగ్ నడవకపో వటం నియంతృత్వ రాజ్యంలో మాత్రమే ఉంటుంది. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం, ఘనతలు వల్లించడం తప్ప, అడిగిన ప్రశ్నలకు సమాధానమేది? ఇదెక్కడి ప్రభుత? ఇతడేలా జననేత? దేశవ్యాపితంగా ప్రతిపక్షాల నుంచి, యువత, విద్యార్థులు పెద్దయెత్తున నిరసనలు చేస్తూ, ఓట్లను చోరీ చేసి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రహసనంగా మార్చివేస్తున్న ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని, ఎలక్షన్ కమిషన్ ను ఆడిస్తున్న ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ-షాలు బాధ్యత వహించాలని, సమాధానం చెప్పాలని గగ్గోలు పెడుతుంటే, ఏమీ మాట్లాడరెందుకు? జరుగుతున్న ఓటరు జాబితా సవరణ తతంగంలో చోటుచేసుకుంటున్న అవినీతిపై, అక్రమాలపై ఏమీ మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారేమో! మన్ కీ బాత్‌లో తన మనసులోని మాటలను ముద్దు ముద్దుగా పలికే మోడీ గారు, ప్రపంచంలోనే ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశాన ఓటర్లనే చంపేస్తున్న ఒక సంఘటన బయటికి వస్తే, స్పందించరా! సీ.ఈ.సీ. సభ్యుల మధ్యనే ప్రజాస్వామిక నిర్ణయాలు జరగకపోతే, ఇక దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏం బతికిస్తారు! ఎంత ఘోరం! ఒడిశాలోని ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త, ఎలక్షన్ కమిషన్ బి.ఎల్.ఓ. అయిన నిరుపమా త్రిపాఠి బయటపెట్టిన వివరాలను చూస్తే ఎంత మోసాలకు పాల్పడుతున్నారో స్పష్టంగా అర్థం అవుతుంది.

ఎన్నికల సంఘంతో కుమ్మక్కయి బీజేపీ ఆడుతున్న డ్రామాలు ఒక్కొక్కటి బయటపడి పోతున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్లు తీసేయడానికి వాడే చట్టబద్దమైన ఫారమ్-7 ను, బిఎల్ఓలకు తెలియకుండానే ఢిల్లీ నుంచి లాగిన్ వివరాలు, ఓటిపిలను దొంగిలించి, తొలగింపు దరఖాస్తులను అప్‌లోడ్ చేయటాన్ని ఆమె బయటపెట్టారు. ఒరిస్సాలో 17 లక్షల 67 వేల ఓట్లు గల్లంత య్యాయి. వీటిపై పోలీసులకు వాళ్లూ ఫిర్యాదు చేశారు. ఒరిస్సా ఎన్నికల అధికారి, అక్రమాలు బయట పడుతుండటంతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారు. తొలగించిన ఓట్లన్నీ మైనారిటీ, ఆదివాసీ, బలహీన వర్గాల వారివే! బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లను గుర్తించి మరీ ఈ పన్నాగాల్ని అమలు చేస్తున్నారు. ఇదే విధంగా ఇంతక్రితం బీహార్, బెంగాల్లోనూ చేశారు. ఇప్పుడు తెలంగాణాలోనూ చేస్తున్నారు. ఓటంటే నోట్లకు సమానమైనదనో, ఒక్క రోజు కాగితంపైనో, మిషన్‌లోనో వేసే లెక్కకాదు. నూట నలభై కోట్ల ప్రజల భవితవ్యాన్ని, ఐదేండ్ల అధికారాన్ని రాసి ఇవ్వటం. ఒక సజీవమైన ప్రజాస్వామిక సంబంధాన్ని కొనసాగించటం. బాధ్యత గల పౌరునికి ఇచ్చే విలువ అది. ప్రజలకే అధికారం అనే పేర గతంలోనూ అనేకరకాల అవకతవకలకు, అవినీతికి పాల్పడ టాన్ని మనం చూశాము. ఇప్పుడు మాత్రం తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకున్న వాళ్ల పేర్లకి సవరణ పేర తీసేయడం పబ్లిక్‌గా జరుగుతోంది.

ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. ఎన్నికల ప్రధానాధికారి చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడుతున్నాడని, అతడు రాజీనామా చేసేవరకు ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాలని, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె. సింగ్ అన్న మాటలు చాలా వాస్తవికమైనవి. ఆలోచించాల్సిన అంశాలు. అయితే ఇన్ని ఆరోపణలు, నిరూపణలు వెల్లువెత్తుతుంటే, ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రశ్నిస్తుంటే, మన బలశాలి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం దారుణం. ప్రజాస్వామ్యంపై ఆయనకున్న చులకన భావనకు ఇదొక తార్కాణం. ఏ ఒక్కస్థాయి అధికార పార్టీ నాయకుడూ నోరు మెదపడం లేదు. కొందరు మాత్రం ఎలక్షన్ కమిషనర్‌కు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేయటం మరీ విడ్డూరం! ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కొన్ని అసంతృప్తిని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. అయినా వాళ్లేం మాట్లాడగలరు!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్