Magazines

బతుకమ్మ సాంస్కృతిక రూపాంతరత

49 నిమిషాల క్రితం

Cultural Bathukamma
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 3 నిమిషాల చదవడం

పెత్తరామాస ఎల్లంగనే పల్లె పొలిమేరలల్ల పుడమి తల్లి పురిటినొప్పులు తీరి, నల్లరేగడి నేలంతా పచ్చని పైరుల నవ్వులతో వెలిగిపోతది. కొండకోనలు, చెలకల గట్ల వెంబడి తంగేడు వనాలు పసిడి కాంతులు జిమ్మితే, గునుగు పూలు ధవళ ఛత్రాలై వికసిస్తయి. కట్లపూలు, రుద్రాక్ష పూలు, సీతమ్మజడలు, గుమ్మడి పూల పసుపు ముద్దలతో తెలంగాణ పల్లె ప్రకృతిని తన ఒడిలోకి తీసుకునే కాలమిది. బతుకమ్మంటే కేవలం పువ్వులను పేర్చే వేడుక మాత్రమే కాదు. మట్టికి, మనుషులకు, ప్రకృతికి నడుమ తరతరాలుగా సాగుతున్న అపురూపమైన జీవన సంభాషణ.

‘‘ఇద్దరక్క సెల్లెండ్లు ఉయ్యాలో... ఒక్కూరికించి ఉయ్యాలో..

ఒక్కడే మాయన్న ఉయ్యాలో.... రాకనన్నావాయే ఉయ్యాలో’’

అంటూ పల్లె ఆడబిడ్డలు గొంతు కలిపి పాడే ఈ పాట, పూల సాక్షిగా తెలంగాణ నేలలో గల ఆత్మీయ అనుబంధాలకు ప్రతీక.

ఉత్పత్తి కులాల శ్రమజీవన సౌందర్యం

బతుకమ్మ పండుగ పుట్టిందే బహుజన ఉత్పత్తి శక్తుల చెమట చుక్కల్లో నుంచి గుట్టలెంబడి, చేలగట్లెంబడి తిరిగి పూలు కోసుకొచ్చే శ్రమజీవులు, బతుకమ్మకు ఆధారమయ్యే వెదురు సిబ్బిలల్లిన మేదరోళ్లు, గౌరమ్మను కొలిచే ప్రమిదలందించే కుమ్మరోళ్లు, చెరువు కట్టల వద్ద కాపుకాసే ముదిరాజులు, గంగపుత్రులు,సత్తుపిండి నవధాన్యాలు పండించే పంట కాపుదానపోళ్ళు సకల చేతివృత్తుల జనం కలసి జరుపుకునే సమష్టి సంస్కృతి ఇది. ఇక్కడ అగ్రవర్ణాల పెత్తనం లేదు, నోరుతిరుగని సంస్కృత శ్లోకాలు లేవు. పసుపుతో చేసిన ముద్దే సాక్షాత్తు జీవనాధా రమైన గౌరమ్మ గా చెరువు గట్లే పవిత్ర స్థలాలు గా జరిగే సబ్బండ శ్రమజీవుల పూల జాతర.

‘‘కలవారి కోడలు ఉయ్యాలో..

కనకమాలక్ష్మి ఉయ్యాలో

కడవ పట్టుకొని ఉయ్యాలో..’’

అంటూ మహిళలు పాడుకునే పాటల్లో అత్తవారింటి వేధింపులు, ఆనాటి కరువు కాటకాలు, వ్యవసాయ సంక్షోభం, స్త్రీల అంతరంగ వేదన ప్రతిధ్వనిస్తాయి. ఒళ్లు వంచి, నేలను తాకుతూ, లయబద్ధంగా చప్పట్లు చరిచే ఆ అడుగుల దరువులో శ్రమజీవుల సహజ సౌందర్యం, ఒక ప్రజాస్వామిక స్వేచ్ఛా ఆకాంక్ష కనిపిస్తాయి. నువ్వులు, పల్లీలు, సత్తుపిండి, బెల్లం కలిపి పంచుకునే ‘సద్దులు’ ఉత్పత్తి కులాల పరస్పర ప్రేమానురాగాలకు ప్రతీకలు.

కనుమరుగవుతున్న మట్టి పరిమళం

అయితే నేడు ఈ మట్టి పండుగపై కార్పొరేట్ రాబందుల నీడ పడింది. పేడతో అలికి ముగ్గులేసిన పల్లె వాకిళ్లు, ఊరి రచ్చబండలు కాస్తా.. నగరాల గేటెడ్ కమ్యూనిటీలుగా, కాంక్రీట్ క్లబ్‌హౌస్‌లుగా మారిపోయాయి. అడవి నుంచి తీసుకొచ్చే ఔషధ గుణాల గునుగు, తంగేడు పూల స్థానాన్ని మార్కెట్లో దొరికే రసాయన రంగుల పూలు, ప్లాస్టిక్ పువ్వులు ఆక్రమిం చాయి. కార్పొరేట్ బ్రాండ్ల స్పాన్సర్‌షిప్పులు, రాజకీయ నాయకుల ప్రచార కాంక్ష, గిన్నిస్ రికార్డుల పేరిట వేల మందిని సమీకరించి చేసే కృత్రిమ ప్రదర్శనల్లో పల్లె ఆత్మ చచ్చిపోతోంది. టీవీ కెమెరాల లైట్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విన్యాసాలు, ఖరీదైన పట్టుచీరల ఆడంబరాల నడుమ శ్రమజీవుల పండుగ తాలూకు గురుతులు పూర్తిగా చెరిగిపోయి, బతుకమ్మ కేవలం ఒక వాణిజ్య ఈవెంట్‌గా దిగజారిపోతోంది.

బ్రాహ్మణీకరణ, దాండియా దండయాత్ర

అంతకంటే ప్రమాదకరమైన ధోరణి మరోటి బయలుదేరింది ఈ గడిచిన దశాబ్ద కాలం నుంచి అదే బహుజన మాతృస్వామ్య పండుగ నెమ్మదిగా బ్రాహ్మణీకరణకు గురికావడం. గుడి గోపురాలకు బందీకాని, ఏ పురోహితుడి ప్రమేయం లేని ఈ ప్రకృతి పూజలోకి క్రమంగా వేద మంత్రాలు, హోమాలు, నవదుర్గల ఆరాధన చొప్పించబడుతున్నాయి. పల్లె జానపద దేవత అయిన గౌరమ్మను వైదిక చట్రంలోకి లాగి, దాని మూల ద్రవిడ, బహుజన ఆనవాళ్లను తుడిచిపెట్టే కుట్రలు సాగుతున్నాయి. మరోవైపు, ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకున్న గుజరాతీ ‘దాండియా’ సంస్కృతి తెలంగాణ పల్లెలను సైతం కబళిస్తోంది.
‘‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ..

బంగారు బొమ్మ దొరికేనమ్మో మీ వాడలోన’’

అని ఆడబిడ్డలు ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ, తాళం తప్పకుండా చేతులు తడుతూ వేసే సహజసిద్ధమైన చప్పట్ల నాట్యం మాయమైపోయింది. వాటి స్థానంలో చెక్క కర్రలతో గిరికీలు కొట్టే దాండియా, చెవులు చిల్లులు పడే డీజే చప్పుళ్లు, సినిమా రీమిక్స్‌ల హోరు వచ్చి చేరింది. స్త్రీలు తమ శ్రమను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని చాటుకునే సహజ గొంతుకలను ఈ కృత్రిమ రణగొణ ధ్వనులు మింగేస్తున్నాయి. బతుకమ్మ అంటే దాండియా కర్రల చప్పుళ్లు కావు. కార్పొరేట్ వేదికలపై జరిగే గ్లామర్ ప్రదర్శన అసలే కాదు. అది చెరువు కట్టల సాక్షిగా, ప్రకృతిసిద్ధ సహజ పువ్వుల సాక్షిగా బహుజనులు తమ జీవన వేదనను, ప్రకృతితో ముడిపడిన ఆనందాన్ని పంచుకునే తరాల మూల ద్రావిడ సంస్కృతిక జీవనది. ఈ ఆడంబ రాలను, దిగుమతి సంస్కృతులను నిరాకరించి, బతుకమ్మను తిరిగి దాని మట్టి మూలాల్లోకి, ఉత్పత్తి కులాల శ్రమ సంస్కృతిలోకి తీసుకెళ్లినప్పుడే తెలంగాణ పల్లె జీవం సజీవంగా నిలుస్తుంది.


జుట్టు మహిపాల్, 9347255489

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్