Magazines

పూలనేల తాపం!

5 రోజుల క్రితం

flower-strewn ground
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

పువ్వులంటే వర్ణధరహాసాలు. పరి మళ ఆవరణాలు, ప్రకృతి గీసిన సౌందర్యా త్మక సజీవ చిత్రాలు. అవి చూసి ఆనంద పరవశమవ్వని హృదయముం టుందా! పువ్వులు సంతోష చిహ్నాలు, ప్రేమకు ప్రతిరూపాలు, అనువదించిన ఆత్మీయ సందేశాలు. శృంగార రసరంజి తాలు. శుభకామనల సుగంధాలు. సుతిమెత్తని వర్ణ పరిమళ సరిగమలు. పూల దృశ్యాలు తనివితీరా నందించని మనసుం టుందా! బతుకు పూలబాట కావాలని కోరుకోని వారెవ్వరు! పువ్వులను కానుక గాను, అభినందనగా, ప్రేమను ప్రకటించు టకు ఉపయోగిస్తారు. అంతే కాదు, అందానికి పూగుత్తులే కదా సొగసును వికసితం చేసేది. అమరుల నివాళికి పూలే ప్రణమిల్లుతాయి. శుభకార్యాలకు, అంతిమ వీడ్కోలుకూ పూలులేని ఉత్సవముండునా! భక్తికి, అనురక్తికీ పూలభాషే కీలకం. మనుషుల బుద్ధిని బట్టి, పూలకూ వేరువేరు విలువలు కడుతున్నారు. కానీ పువ్వులన్నీ సొగసు లొలికేవే! మనుషుల మధ్య తేడాలు, అసమానతలు, ధనిక పేదలు మొదలైన భేదాలన్నిం టినీ పూలకూ ఆపాదిస్తున్నది మానవజాతి. పాపం వాటికేం తెలుసు ఈ వ్యత్యాసాలు. ఏ రంగైనా, ఏ తీరైనా మెరిసే సొగసు వాటి సొంతం. ప్రకృతికి ఉన్న ఈస్తటిక్ సెన్స్ ఫలితమే పువ్వులు. వాటిని నిర్దాక్షిణ్యంగా చెట్టునుంచి కోసి ప్రాణాలు తీస్తారు మనుషులని కరుణశ్రీ దుఃఖపడ్డాడు.

పువ్వులు ఎలా విలపిస్తాయో చెబుతూ...‘‘మావెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై తృహించి కృశించి నశించిపోయె, మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమవల పారబోతురు గదా నరజాతికి నీతియున్నదా’’/‘‘బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్యచేసెన్‌ ‌హంతకుండా, మైలపడిపోయెనో నీ మనుజ జన్మ!’’ అని పువ్వులచేత దూషిస్తాడు కవి. అలాంటి పువ్వులను ఆరాధిస్తూ తమ బాధలను, గాధలను చెప్పుకునే పండుగే బతుకమ్మ. తమ బతుకు ఎతలను పూలకు విన్నవించుకునే సంప్రదాయం, తెలంగాణ సంస్కృతిలో కొనసాగుతూ వస్తున్నది. మహిళలు మాత్రమే చేసుకునే పండుగ. తమ జీవితంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకునే పండుగ ఇది. పండుగ ప్రతియేడూ జరుగుతూనే ఉన్నది. కాని మహిళల జీవితాలలో అసమానతలు తొలగడం లేదు. వేధింపులు, దాడులు ఆగడం లేదు. వేడుకోళ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇదొక విషయం. ఇక రెండో విషయం, ప్రకృతి ప్రసాదించే పూల భవిష్యత్తూ ప్రశ్నార్థకంగా మారుతున్నది. పూలకైనా, జీవరాశులకైనా ఆధారం భూమి. భూమి తత్వం కూడా పెనుమార్పులకు లోనవుతున్నది. వేడి పెరిగిపోతున్నది.

భూ ఆరోగ్యం దెబ్బతింటోంది. పచ్చదనం, పూల పరిమళం, జీవ మనుగడ అన్నింటికీ ఆపద పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి కారకుడు మానవుడే. మానవ సమూహాల కార్యకలాపాలే అని కూడా సెలవిస్తున్నారు. భూమి ఆరోగ్యాన్ని కొలిచిన అమెరికా ‘ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ’ పరిశోధకుల అధ్యయనంలో తీవ్ర అనారోగ్యంతో భూమి ఉందని తేలింది. ఇంధన సంబంధిత కర్బన ఉద్గారాలు చరిత్రలో తొలిసారి 41 గిగా టన్నులను దాటాయని తేలింది. వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్, మిథేన్ స్థాయిలు అత్యధికమయ్యాయని, దాని వలన భూమి వేడెక్కి పోయిందని తెలిపారు. నైట్రస్ ఆక్సైడ్ కూడా రికార్డు స్థాయిలో పెరిగిందని ఇది భూమిని వేడెక్కించడంలో చాలా రెట్లు శక్తివంతమైనదని తెలుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సముద్రాల ఉపరితలం వేడెక్కింది. దాని ఫలితంగా ఎల్ నినో ఏర్పడుతున్నది. భూమిలోని చెమ్మ ఇంకిపోతున్నది. తాపంతో బీడులు వారుతున్నది. ఇది మన జీవితాలపై పెద్ద ప్రభావాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కార్పొరేట్ శక్తుల లాభాల కోసం ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత, ఖనిజాల తవ్వకం, పారిశ్రామిక కాలుష్యాలు, అణు ఇంధన కాలుష్యం విపరీతంగా పెరిగింది. దాని పర్యవసానమే ఈ ప్రమాద ఘంటికలు. మొదటగా దీనికి బలయ్యేది సామాన్య ప్రజలు. వీటి గురించిన చర్చ గానీ, చర్యలు గానీ ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదు. ఈ అందమైన ప్రకృతిని భావితరాలకు సురక్షితంగా అందించాలన్న తలంపే లేని పాలకుల విధానాలను తిప్పికొట్టే చైతన్యాన్ని పెంపొందించు కోవాలి. పూల అందాలను, పరిమళాలను, మానవ సమూహాలను కాపాడుకోవాలి!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్