ఏఎంసీ చైర్‌పర్సన్ తిరుమల పిలుపు
నవతెలంగాణ – కాటారం
మహిళలు స్వయంకృషి, నైపుణ్యాల ఆధారంగా ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్‌పర్సన్ పంతకాని తిరుమల స్పష్టం చేశారు. కాటారం రైతు వేదికలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలను వివరించారు.
మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కుట్లు అల్లికలు వంటి వృత్తులను నేర్చుకుని స్వయం ఉపాధి ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు ఈ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే కుటుంబ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఆలోచనల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, వడ్డీలేని రుణాలు, పెట్రోల్ పంపులు, టైలరింగ్ శిక్షణ కేంద్రాలు వంటి పలు అవకాశాలను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఈ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని, చిన్న స్థాయి నుండి పెద్ద పారిశ్రామిక స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ బాలకృష్ణ, ఏ పీ యం రవికుమార్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, మండల సమైక్య అధ్యక్షురాలు ఫరహాన బేగం, సీసీలు రవికుమార్, లక్ష్మి, సారక్క, మాధవి, టైలరింగ్ శిక్షకులు సృజన, కల్పన తదితరులు పాల్గొన్నారు.



