-వలస కూలీల గంజాయి సేవనం…?
-పిల్లల ఆరోగ్యంపై ముప్పు
నవతెలంగాణ – రాయికల్
పట్టణ శివారులో మామిడికాయల సీజన్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు చట్టాలను పట్టించుకోకుండా భారీ స్థాయిలో అక్రమంగా వ్యాపారం సాగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మున్సిపల్ అనుమతులు,ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి,రైతుల వద్ద నుండి తక్కువ ధరలకు మామిడికాయలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
-నిబంధనలు పక్కనబెట్టి వ్యాపారం
పెద్ద స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి నిల్వ చేసి,ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపాలంటే సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే ఇక్కడ అలాంటి అనుమతులు లేకుండానే కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ట్రేడ్ లైసెన్స్,మున్సిపల్ అనుమతులు, మార్కెట్ కమిటీ నిబంధనలు, రవాణా పత్రాలు వంటి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-రైతులకు తక్కువ ధర… వ్యాపారులకు భారీ లాభాలు
స్థానిక రైతుల వద్ద నుండి మామిడికాయలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు, అదే సరుకును ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు పంపించి లాభాలు పొందుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సరైన కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు బలవంతంగా ఈ వ్యాపారులకే అమ్ముకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

-వలస కూలీల గంజాయి సేవనం…?చిన్నారులపై ప్రభావం
ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలు మామిడికాయల ప్యాకింగ్ పనులు నిర్వహిస్తున్నప్పటికీ,అదే ప్రాంగణంలో గంజాయి సేవిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితి అక్కడే నివసిస్తున్న కూలీల చిన్నపిల్లలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్వచ్ఛ వాతావరణం,మత్తు పదార్థాల వినియోగం పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-తక్షణ చర్యలు తీసుకోవాలి
ఈ అక్రమ వ్యవహారంపై మున్సిపల్, వ్యవసాయ మార్కెట్,పోలీస్ శాఖలు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అనుమతులు లేకుండా జరుగుతున్న వ్యాపారాలను నిలిపివేసి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులకు సరైన ధరలు అందేలా ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని,కూలీలకు సురక్షిత వాతావరణం కల్పించాలని సూచిస్తున్నారు.



