– 83.96 శాతం మ్యాపింగ్ పూర్తి
– అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్ ( ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్, ఓటర్ల నమోదు అధికారి డి. వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహశీల్దార్లు, బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ ), సూపర్‌వైజర్లు, మాస్టర్ ట్రైనర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ ఎన్నికల సంఘం (ఈసీ), రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు 2025 ఓటర్ల జాబితాను 2002 జాబితాతో సరిపోల్చుతూ డేటా మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాల లోపు ఉన్న కుటుంబ సభ్యులను ‘ప్రోజనీ’గా నమోదు చేసి ఓటర్ల జాబితాను మరింత సమగ్రంగా తయారు చేస్తున్నట్లు వివరించారు. 2002 జాబితాలో పేరు లేని వారు తమ ఓటర్ కార్డు (ఎపిక్) నంబర్, పోలింగ్ బూత్ వివరాలను సంబంధిత బీఎల్ఓ కు అందజేస్తే వారి వివరాలను కూడా చేర్చు తామని తెలిపారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల మ్యాపింగ్ 83.96 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ములకలపల్లి 86.13%, చంద్రుగొండ 75.72%, అన్నపురెడ్డిపల్లి 83.81%, దమ్మపేట 85.81%, అశ్వారావుపేట 85.12% మేరకు మ్యాపింగ్ పూర్తయింది.
రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఏ ల జాబితాలను సమర్పించాలని కోరగా, ఇంకా సమర్పించని వారు వెంటనే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.



