Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండూ మూడు విడతల్లో రైతు భరోసా

రెండూ మూడు విడతల్లో రైతు భరోసా

- Advertisement -

– పంట పెట్టుబడిగా ముందస్తుగా అందించలేకపోయాం
– వ్యవసాయ అధికారులు సూచించిన మందులనే విక్రయించాలి
– త్వరలో పంట బీమా పథకం : రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రైతాంగానికి ఎకరానికి మాత్రమే ప్రభుత్వం రైతు భరోసాను ఖాతాలో జమ చేసిందని, త్వరలోనే రెండు, మూడో విడత జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి ఎస్‌ఎల్బీసీ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన శనివారం రివ్యూ సమావేశం నిర్వహిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడిగా ముందస్తుగా ఇవ్వాల్సిన రైతు భరోసా అందించలేకపోయామనేది వాస్తమన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు చెల్లించే ప్రీమియంతో పాటు ప్రభుత్వ వాటాను జమ చేసినప్పటికీ అనుభవం లేని ఇన్సూరెన్స్‌ కంపెనీలకు బాధ్యతలు అప్పజెప్పడం వల్ల అమల్లో విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుభవం కలిగిన ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా పంట బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.

దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి జరగాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాలు లేకపోయినప్పటికీ బోరు బావుల మీద ఆధారపడి కూడా వరి పంటను పండించడానికే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నేడు మార్కెట్లో ఉన్న ప్రధాన సమస్య తాలు అని చెప్పారు. చివరి మడి వరకు నీరు అందకపోవడం తో పూర్తిస్థాయిలో ఎదగక తాలు ఏర్పడుతోంద న్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక పంటల ప్రాధాన్యత ఉందన్నారు. నల్లగొండలో పరిశీలిస్తే బత్తాయి, ఆముదం సాగు బాగా జరిగేదన్నారు. ప్రస్తుతం బత్తాయి సాగు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం రైతుకు, రైస్‌ మిల్లులకు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయన్నారు.. వాస్తవానికి రైస్‌ మిల్లులకు, రైతులకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. రైతుల పంటలో తేమ శాతం, తాలు లేకుండా తీసుకొస్తే.. అధికారులు దాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తారని చెప్పారు. అంతేతప్ప రైతులు మిల్లులకు వెళ్లడం అనేది జరగకూడద న్నారు. అలాచేస్తే అధికారుల తప్పిదమని చెప్పారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పంటలకు తెగులు వచ్చిందని రైతులు నేరుగా ఫెస్టిసైడ్‌ దుకాణాలకు వెళితే యజమానులు ఇష్టం వచ్చిన మందులు ఇస్తున్నారని, ఇకపై వ్యవసాయ అధికారులు రాసిచ్చిన మందులను మాత్రమే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యులు చెవిటి వెంకన్న, నెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, నల్లగొండ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జూకూరి రమేష్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -